
- ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆదేశం
- డెవలపర్స్ వెంచర్లు ప్రమోట్ చేసినందుకు మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లింపు
- ఇన్వెస్టర్లను మోసం చేసిన సదరు సంస్థ
హైదరాబాద్, వెలుగు: సాయిసూర్య డెవలపర్స్ వెంచర్లను ప్రమోట్ చేసినందుకు నటుడు మహేశ్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈనెల 28న బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు సమన్లు పంపింది. పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్ తీసుకురావాలని సూచించింది. పెట్టుబడిదారులను సాయిసూర్య డెవలపర్స్ మోసం చేసిన విషయం తెలిసిందే. దాదాపు రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడింది.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈనెల 16న ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది. మహేశ్‌బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్ల చెల్లింపులు చేసినట్లు ఆధారాలు సేకరించింది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్‌క్లేవ్, షణ్ముక నివాస్ పేరుతో సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ వెంచర్లను ఏర్పాటు చేశాయి. ప్రధానంగా సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్‌కు రూ.3.25 కోట్ల చొప్పున కస్టమర్లతో అగ్రిమెంట్లు చేసుకుంది. అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్లు వసూలు చేసింది.
ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను పలువురి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్లు మేర ఇన్వెస్టర్లను మోసం చేసింది. ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది. ఈ క్రమంలోనే నటుడు మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు సాయిసూర్య డెవలపర్స్ నుంచి చెల్లింపులు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు రాబడుతున్నారు. కాగా, సాయితులసి ఎన్‌క్లేవ్, షణ్ముక నివాస్‌లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు నవంబర్‌లో సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు మొత్తం 11 కేసులు రిజిస్టర్ చేశారు.