- ఒక ఆఫీసర్‌కు గాయాలు
- ఢిల్లీలో ఘటన.. నిందితుల్లో ఒకరి అరెస్టు
న్యూఢిల్లీ : సైబర్ మోసంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో రెయిడ్ చేసేందుకు వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టీమ్‌పై దాడి జరగడంతో ఒక అధికారి గాయపడ్డారు. Pyypl పేమెంట్ గేట్‌వే యాప్ ద్వారా ఫిషింగ్, క్యూఆర్ కోడ్ చీటింగ్, పార్ట్ టైమ్ జాబ్ మోసం వంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారనే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం సూరజ్ యాదవ్ అనే ఆఫీసర్ నేతృత్వంలో ఈడీ సోదాలకు వెళ్లింది. ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలోని ఒక ఫామ్‌హౌస్‌పై రెయిడ్ చేసింది. ఆ ఫామ్ హౌస్ అశోక్ కుమార్ శర్మ అనే చార్టెడ్ అకౌంటెంట్(సీఏ)కు చెందినది.
అయితే అశోక్ కుమార్ శర్మ, అతని బంధువు యష్, మరికొందరు కలిసి ఈడీ అధికారులపై దాడి చేశారు. అక్కడున్న ఫర్నిచర్ తో కొట్టారు. ఈ దాడిలో ఒక ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. ఈడీ అధికారులు ఈ దాడులపై వెంటనే సమీపంలోని కపషేరా పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇది గమనించిన నిందితులు పారిపోయారు. గాయపడిన ఈడీ ఆఫీసర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ చేయించారు. అధికారికి స్వల్పగాయాలైనట్టు డాక్టర్లు చెప్పారు.
పోలీస్ ఫోర్స్ సపోర్ట్‌లో మిగతా ఈడీ అధికారులు సోదాలు పూర్తి చేశారు. అయితే ఈడీ ఫిర్యాదుతో పోలీసులు దాడి కేసు నమోదు చేశారు. అలాగే దాడికి పాల్పడిన యష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగాతా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. Pyypl యాప్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడి దోచుకున్న డబ్బును 15వేల మ్యూల్ అకౌంట్లకు తరలించి.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా డ్రా చేసుకుంటున్నట్టు ఈడీ గుర్తించింది. ఈ నెట్‌వర్క్‌ను కొందరు సీఏ లు కలిసి (సీఏలు) నడుపుతున్నారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.