ఉన్నత  పీఠంపై ‘మన్నెం కాగడ’

డెబ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర స్వర్ణోత్సవ వేళ ఆజాదీ కా అమృతోత్సవాల సందర్భంలో... కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల పోరాటాలను గుర్తించడం మహద్భాగ్యం. నేడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించి త్వరలో ఆమె దేశ ప్రథమ పౌరురాలుగా బాధ్యతలు చేపట్టడం లాంఛనమే. దీంతో అటు బీజేపీ వర్గాల్లో  ఇటు ఆదివాసీ అణగారిన వర్గాల్లో హర్షధ్వానాలు మిన్నంటుతున్నాయి. భారత దేశంలో అతిపెద్ద నాలుగో గిరిజన తెగ సంతాల్ కు చెందిన ముర్ము వంశస్థుల పోరాట చరిత్ర ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో కీలకమైనది. వారి పోరాట పటిమకు గుర్తింపే ఈరోజు ద్రౌపదీ ముర్ముకు లభించబోయే రాష్ట్రపతి పదవి.

ఈ సందర్భంగా సంతాల్ ల ఆనాటి తిరుగుబాటు నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రస్తుత జార్ఖండ్ తూర్పు భారతదేశంలోని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, సంతాల్ జమీందారీ వ్యవస్థ రెండింటికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. అది1855, జూన్ 30న ప్రారంభమై1856, జనవరి 3 వరకు కొనసాగింది. ఈ తిరుగుబాటుకు తన వంశానికి చెందిన నలుగురు ముర్ము సోదరులు సిద్ధూ ముర్ము, కన్హూ ముర్ము, చంద్ ముర్ము, బైరవ్ ముర్ములు నాయకత్వం వహించారు. ఆనాటి ఈస్టిండియా కంపెనీపై జరిగిన సాయుధ పోరాటంలో అసువులు బాసిన పదివేల మంది ఆదివాసీలకు ఇది ఘన నివాళి. ఆనాటి చారిత్రక నేపథ్యం ప్రకారం సంతాలుల తిరుగుబాటుకు నజరానాగా ముర్ముకు ఈ అవకాశం దక్కిందని భావించవచ్చు. 


ప్రతిపక్షాలు గుర్తించలేదు..


రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ముకు అవకాశం ఇవ్వడం అనేది చాలాకాలం తరువాత గిరిజనులకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత గౌరవం. ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా చేయలేకపోయింది. విపక్షాలతో మమతా బెనర్జీ సమావేశం పెట్టి రెండుమూడు పేర్లు మాత్రమే చర్చించారు తప్ప గిరిజనుల్లో కూడా అలాంటి మేధావులున్నారని ఆలోచించలేదు.

గిరిజనులకు అలాంటి అవకాశాలే రావు. వారిని జనజీవన స్రవంతికి దూరంగానే ఉంచుతున్నారు. అందుకేనేమో ద్రౌపది ముర్ముకు అవకాశం రావడానికి  ఏడు దశాబ్దాలు పట్టింది. ఈ క్రమంలో గిరిజనులు, ఎస్సీలకు ప్రధానమంత్రి లాంటి ఉన్నత పదవులు దక్కాల్సి ఉంది. ఇందుకోసం రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితులు, రాజ్యాంగం మేరకు అవకాశం రాదు. కనుక ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాల మాదిరిగానే ప్రధాని పదవికి కూడా రిజర్వేషన్ పెట్టాలి. కొంతకాలం ఈ వర్గాలను ఆదరించేందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించుకోవాలి. రాష్ట్రపతి పీఠానికి అధికార, విపక్ష కూటములు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే ముందు జ్ఞాన సమర్థత ఉన్న సామాజిక వర్గాలపై ఆలోచన చేయటం లేదు.  అధికార కూటమి నుంచి పరిపాలనానుభవం గల ఎస్టీ మహిళకు అవకాశం ఇచ్చారు. కాబట్టి  గౌరవప్రదంగా ముర్మును రాష్ట్రపతి భవన్ కు పంపించడం సమంజసం. 


తొలి ఎస్టీ మహిళ


దళిత పక్షపాతులమనే ముద్ర కోసం కె.ఆర్. నారాయణన్ ను కాంగ్రెస్ తెస్తే, మైనారిటీలకు అనుకూలమనే పేరు కోసం అబ్దుల్ కలామ్ ను వాజ్ పాయ్ హయాంలో ఎన్డీఏ తెర పైకి తెచ్చిందనే విమర్శలు లేకపోలేదు. అంత మాత్రాన మేధావుల సమర్థతను తక్కువగా చూడలేం. ద్రౌపది అభ్యర్థిత్వాన్ని సైతం ఆ కోణంలోనే అర్థం చేసుకోక తప్పదు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకొని, పునాదిని విస్తరించుకొనే క్రమంలో క్రితంసారి 2017లో రామ్​నాథ్ కోవిందు, ఇప్పుడు ద్రౌపదీ ఎంపిక విషయంలో బీజేపీ ప్రయత్నం  హర్షించదగినది. ద్రౌపది లాంటి వారి కథ సమాజానికి స్ఫూర్తినిచ్చేదిగా ఉందనడంలో సందేహం లేదు. ఆమె ఎన్నిక లాంఛనమే. ఈ క్రమంలోనే బీజేపీ మరింత హుందాగా రానున్న రోజుల్లో ఎస్సీ లేదా ఎస్టీలకు ఇలాంటి పదవులను కల్పిస్తే మెజారిటీ ప్రజలు హర్షిస్తారు.

75 ఏండ్ల స్వతంత్ర భారతంలో తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తర్వాత రెండో మహిళా రాష్ట్రపతిగా ముర్ము రికార్డులోకి ఎక్కబోతున్నారు. అంతేగాకుండా ఆదివాసీలే ఈ దేశంలో తొలి భారతీయులు అని చెప్పడానికి సాక్ష్యం ముర్ము ఆదివాసీలలో కాబోయే తొలి రాష్ట్రపతి మాత్రమే గాక ఆదివాసీలలోనే ఈదేశ తొలి ప్రథమ పౌరురాలని నిరూపించబోతున్నారు. ముర్ము ఎన్నికతో దేశంలో ఆదివాసీ చట్టాలు గ్రామ స్థాయిలో సంపూర్ణ అమలుకు హామీ దొరకాలి. తవ్వకాల పేరుతో అడవి మీద జరుగుతున్న విధ్వంసం ఆగాలి. అడవిలో ఆయుధాల పాలనతో జరుగుతున్న హింస, అణచివేత, దౌర్జన్యం ఆగాలి.అడవి బిడ్డలకు వారి హక్కులపై భరోసా దక్కాలి. గిరిజనులు ఇప్పుడు ఎదుర్కొంటున్న అటవీ హక్కుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం.

 

సమర్థంగా పనిచేసి..


అట్టడుగు స్థాయి నుంచి దేశ ప్రథమ పౌరురాలు కాబోతున్న ద్రౌపదీ ప్రస్థానం ఆసక్తికరం.  ఒడిశాలో మారుమూల మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ఆమె రాజకీయాల్లోకి రాక ముందు గిరిజన ఉద్యమకారిణిగా ఓ అగ్గిబరాటా. ఆదివాసీల స్వతంత్రత కోసం ఆధిపత్య వర్గాలను ఎదిరించిన ధీరవనిత. నీటి పారుదల శాఖలో క్లర్క్ గా చేరిన ఆమె, తరవాత టీచరుగా పనిచేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలుత కౌన్సిలర్ గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా  పనిచేస్తున్న కాలంలో  ఆమె 2002లో ఉత్తమ ఎమ్మెల్యేగా పేరు గడించారు. ఆమె నవీన్ పట్నాయక్ బీజేపీ కూటమి సర్కారులో మంత్రిగా కూడా అనేక విభాగాలను సమర్థంగా నిర్వహించడం విశేషం. 2015 లో జార్ఖండ్ గవర్నర్ గా పనిచేసిన ఈ సంతాల్ వనిత మేధావి తత్వానికి కొదవ లేదు. అయితే, అత్యున్నత పదవికి అభ్యర్థినిగా ఎంపికలో ఆమె సమర్థత కన్నా మహిళగా, సామాజిక నేపథ్యాన్ని గుర్తించి ఇచ్చారు. ఉత్తర, దక్షిణ భారతం నుంచే రాష్ట్రపతులు ఎన్నికవుతూ వస్తున్న క్రమంలో దేశంలో తూర్పు ప్రాంతం నుంచి గిరిజన మహిళకు అవకాశం ఇచ్చి  రాజకీయ నేతలు విజ్ఞత పాటించారని చెప్పవచ్చు. 


- గుమ్మడి లక్ష్మీనారాయణ, 
ఆదివాసీల రచయితల వేదిక