న్యూఢిల్లీ : నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీలాట్)లో ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌కు ఊరట లభించింది. బీసీసీఐకి బకాయిలు చెల్లించడంలో విఫలమవ్వడంతో బైజూస్‌పై దివాలా ప్రక్రియను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) కిందటి నెల 16 న మొదలు పెట్టింది. ఎన్‌సీఎల్‌టీ తీర్పును ఎన్‌సీలాట్ తాజాగా పక్కన పెట్టింది. రూ.158 కోట్ల సెటిల్‌మెంట్ డీల్‌కు ఆమోదం తెలిపింది.
కానీ, సెటిల్‌మెంట్ డెడ్‌లైన్‌లోపు పూర్తి చేయకపోతే దివాలా ప్రక్రియ తిరిగి మొదలుపెడతామని ఆదేశించింది. బైజూ రవీంద్రన్ బ్రదర్ రిజూ రవీంద్రన్ తన షేర్లను అమ్మి బీసీసీఐకి కిందటి నెల 31 న రూ.50 కోట్లు చెల్లించారు. మరో రూ.25 కోట్లు శుక్రవారం చెల్లిస్తామని ప్రకటించారు. రూ.83 కోట్లను ఆగస్టు 9 న ఆర్‌టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు.