కులగణనపై పబ్లిక్​కు అవగాహన కల్పించండి...బీసీ కమిషన్ సూచన

కులగణనపై పబ్లిక్​కు అవగాహన కల్పించండి...బీసీ కమిషన్ సూచన
  • బీసీ కమిషన్ కు మేధావుల సూచన

హైదరాబాద్, వెలుగు: కులగణనపై పబ్లిక్​కు ముందే అవగాహన కల్పించాలని బీసీ మేధావులు, నేతలు, ప్రొఫెసర్లు బీసీ కమిషన్​ను కోరారు. సర్వే సమయంలో ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలు, ఏ సమాచారం అడుగుతారన్న విషయాలపై పబ్లిక్​కు ముందే చెప్పాలని సూచించారు. శనివారం ఖైరతాబాద్​లోని కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, మెంబర్లు బాల లక్ష్మి, రాపోలు జయప్రకాష్, కమిషన్ మెంబర్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయదేవితో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ ఎంపీ వీహెచ్, జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు, డాక్టర్ వినయ్ కుమార్, ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ సింహాద్రి, పీసీసీ మేధావుల సెల్ అధ్యక్షుడు శ్యామ్ మోహన్, ప్రొఫెసర్ ఎం.బాగయ్య, డా.షేక్ అబ్దుల్ ఘనీ తదితరులు సమావేశమై పలు సూచనలు చేశారు.

రిజర్వేషన్ల నిర్ధారణకు కులగణన డేటా ప్రాతిపదికగా ఉండాలని, వారి జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను నిర్ధారించేందుకు, న్యాయ పరిశీలనను తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా 60 రోజుల్లో కులగణన పూర్తి చేయాలని, ప్లానింగ్ డిపార్ట్ మెంట్​తో కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఉండాలని నేతలు సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను నిర్ణయించడంపై అభిప్రాయాలు, సలహాలను సేకరించడంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28 నుంచి ఉమ్మడి జిల్లాల్లో బీసీ కమిషన్ కులగణనపై పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నందున అప్పటి వరకు పలువురు మేధావులతో కమిషన్​ సమావేశాలు నిర్వహిస్తున్నది. దీంతోపాటు వివిధ కుల సంఘాలు కమిషన్ చైర్మన్​ను కలుస్తూ రిజర్వేషన్లలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వినతిపత్రాలను అందజేస్తున్నారు.