
హైదరాబాద్ సిటీ, వెలుగు: స్కూళ్లల్లో అడ్మిషన్ పొందడానికి ఆధార్ తప్పనిసరి కాదని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఈ విషయాన్ని హెడ్మాస్టర్లు, డిప్యూటీ ఐఓఎస్‌లు, డిప్యూటీ ఈవోలు గమనించాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో స్కూల్ విద్యా విధానంపై ఆకునూరి మురళి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరిగింది. ఈ కార్యక్రమంలో డీఈవో, విద్యాశాఖ అధికారులు, విద్యా కమిషన్ సభ్యులు, ఎన్జీవోల ప్రతినిధులు, వివిధ స్కూళ్ల టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీచర్లు, స్టూడెంట్స్, ఎన్జీవోల సభ్యలు సమస్యలు ప్రస్తావించారు.
బర్త్ సర్టిఫికెట్ల కోసం పేదలు రూ.4 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఓ కుటుంబం ఖమ్మం నుంచి వలస వచ్చిందని, అందులోని విద్యార్థికి ఆధార్ లేకపోవడంతో అరుంధతి నగర్‌లోని ప్రభుత్వ స్కూల్‌లో అడ్మిషన్ ఇవ్వలేదని ఓ ఎన్జీవో తెలిపారు. ఈ విషయంపై విద్యా శాఖ అధికారులను ఆకునూరి మురళి వివరణ కోరగా.. యూడైజ్ పోర్టల్‌లో విత్ ఆధార్, వితౌట్ ఆధార్ నమోదు చేయొచ్చని వివరించారు. అడ్మిషన్లకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. అన్నింటికి ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. విద్యారంగంలో ఉన్న సవాళ్లను అధిగమించడానికి పని చేస్తానని, ఇప్పటివరకు దాదాపు 200 స్కూళ్లను సందర్శించి స్థానిక సమస్యలు తెలుసుకున్నానన్నారు.
కంప్యూటర్లు లేవు.. ఏఐ అంటే ఏంటో తెలియదు..
‘‘ప్రస్తుతం అందరూ ఏఐ గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ, ప్రభుత్వ స్కూళ్లల్లో కంప్యూటర్లు లేకపోవడంతో ఏఐ, ఇతర టెక్నాలజీల గురించి తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి స్కూల్‌లో కంప్యూటర్లను ఏర్పాటు చేయాలి. పిల్లలకు డిజిటల్ నాలెడ్జ్‌ను అందించాలి”అని ఓ విద్యార్థిని విద్యా కమిషన్‌ను కోరింది. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. ఇంగ్లీషు మాట్లాడటంలో సర్కార్ స్కూల్ విద్యార్థులు వెనుకపడి ఉన్నారని, టీచర్లు స్కూళ్లల్లో విద్యార్థులతో ఇంగ్లీషులోనే మాట్లాడాలని సూచించారు.
కాలేజీల్లలో పీఈటీ టీచర్లు ఉన్నారు.. కానీ, స్పోర్ట్స్ ఆడేందుకు గ్రౌండ్స్ లేవని పలువురు ఇంటర్ స్టూడెంట్స్ విద్యా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న స్కూల్ బుక్స్ కాంపిటేటీవ్ ఎగ్జామ్స్‌కు ఉపయోగకరంగా లేవని ఓ టీచర్ చెప్పారు. ఓల్డ్ సిటీలో డిగ్రీ కాలేజీ లేనందున ఇంటర్ పూర్తవ్వగానే విద్యార్థులు చదువు మానేస్తున్నారని మరో లెక్చరర్ చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యా కమిషన్ సభ్యులు జ్యోత్స్న, ప్రొ. పీఎల్ విశ్వేశ్వర్, డా. వెంకటేశ్ తదితరులు పాల్గొని అభిప్రాయాలను స్వీకరించారు.
విద్యకు ఎక్కువ నిధులు కేటాయించండి
వచ్చే స్టేట్ బడ్జెట్లో విద్యారంగం అభివృద్ధి, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం ఎక్కువ నిధులను కేటాయించాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కోరారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, చారుకొండ వెంకటేశ్, జోష్ణ్నశివారెడ్డితో వెళ్లి కలిసి విన్నవించారు. తర్వాత మురళి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు.
ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలను అభివృద్ధి చేసేందుకు గానూ కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను రెడీ చేసి ఆయనకు అందించారు. సర్కారు స్కూళ్లను, తెలంగాణ ఫౌండేషనల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేసి, ఉన్నత ప్రమాణాలతో బోధన అందించేందుకు తగినన్ని నిధులు ఇవ్వాలని కోరారు.
అడ్డగోలు ఫీజులు అరికట్టండి
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీపై..పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్ యూనియన్స్, ఎన్జీవోలు విద్యా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ లేకపోవడంతో ఇష్టారీతిన పెంచుతున్నారని కమిషన్ సభ్యులతో చెప్పారు. స్కూళ్లల్లో ఫెసిలిటీస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధారంగా ఫీజుల స్లాట్ లను నిర్ణయించాలని కోరారు.