విద్యా కమిషన్ సిఫార్సులు అసెంబ్లీలో చర్చించాలి

విద్యా కమిషన్ సిఫార్సులు అసెంబ్లీలో చర్చించాలి

 ఆకునూరి మురళి నేతృత్వంలోని తెలంగాణ విద్యా కమిషన్ తెలంగాణా విద్యారంగం బలోపేతం కోసం ఎట్టకేలకు కొన్ని సూచనలు చేసింది. వాటిలో ముఖ్యమైన సిఫార్సులు  నర్సరీ  నుంచి ఇంటర్ వరకు మండలానికి కనీసం మూడు ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేయడం. పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి మండలానికి  కనీసం నాలుగు నర్సరీ నుంచి 2వతరగతి వరకు ‘తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్’ ఏర్పాటు చేయడం. దూరంగా ఉన్న క్యాచ్​మెంట్ ఏరియా నుంచి ట్రాన్స్​పోర్టు సౌకర్యం ఏర్పాటు చేయడం. వీటికోసం సుమారు 30వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా  అంచనా వేసింది.  

ఇంత కీలకమైన సూచనలు అమలుకు  ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యాసంస్కరణలపై చర్చకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో 30,684 వివిధ స్థాయిల పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్య పట్ల పాలకుల నిర్లక్ష్యం, విద్యా బాధ్యతల నుంచి వైదొలగిన పాలకుల నిర్ణయాల వలన ప్రైవేటు విద్యా వ్యవస్థ బాగా ఎదిగింది.  దీనికి తోడు చిత్తశుద్ధి లేని ప్రచారపటాటోపం కోసం పెట్టిన రెసిడెన్షియల్ పాఠశాలల మూలంగా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం గణనీయంగా పడిపోయింది. 

ఇక రెండు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ విద్యారంగంలో మానిటరింగ్ వ్యవస్థ కుప్పకూలటం కూడా ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాణాలు దిగజారడానికి ఒక హేతువైంది. ఫలితంగా తెలంగాణ విద్యా కమిషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం 13వేల పైచిలుకు ప్రాథమిక పాఠశాలల్లో 50మంది విద్యార్థులకు మించి  సంఖ్య లేకపోవడం, అంతేకాదు, మరో వెయ్యి ఉన్నత పాఠశాలల్లో సైతం50కి అటోఇటో విద్యార్థుల సంఖ్య ఉంది. ఇది ప్రభుత్వ విద్యా రంగం పతనావస్థకు సూచికగా చెప్పుకోవచ్చు.

సిఫార్సులు కొంతైనా మార్పు తెస్తాయి

 తెలంగాణ విద్యా కమిషన్ సూచన ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ పూర్తిగా మార్చుతుందని చెప్పలేం. కానీ, కొంతలో కొంత అయినా సంస్కరణలతో ఉపశమనం లభిస్తుంది. అది ఒక ప్రయోగం కూడా అవుతుంది. కృత్రిమ మేధోవిద్యను కూడా తద్వారా పరిచయం చేసే అవకాశం ఉంది. 

ఇకపోతే విశాలమైన  విస్తీర్ణం గల మండలంలో మూడు పబ్లిక్ పాఠశాలలు,  నాలుగు ఫౌండేషన్ స్కూల్స్​ ప్రతిపాదన ఎంతవరకు సబబు! ఇది సర్వశిక్షా అభియాన్ కిలోమీటర్​కు ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ఉండాలన్న పాఠశాల అందుబాటు నిబంధనలను అమలు జరపడం కొంత కష్టతరమే. కాకపోతే పబ్లిక్, ఫౌండేషన్ స్కూల్ ప్రతిపాదన  ప్రైవేటు విద్యా వ్యవస్థకు దీటుగా.. విద్యాప్రమాణాలు పెరుగుదలకు , నాణ్యమైన విద్య అందజేయడానికి తోడ్పడుతుంది. 

అంగన్​వాడీలను విలీనం చేయాలి

తెలంగాణ పబ్లిక్, ఫౌండేషన్ పాఠశాలలకు బస్ సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదన కొత్తదేమీ కాదు! యాక్సెస్ లేని పాఠశాలలకు ట్రాన్స్​పోర్టు సౌకర్యం కల్పించడం వలన సమాజంలో కొందరు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది.  తెలంగాణలో  ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలోనే 9,517 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిని ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం -2020లో సూచించింది. 

ALSO READ | పదేళ్లు తెలంగాణను కేసీఆర్​ ఆగం పట్టించారు.. పైత్యం ముదిరిన కూటమి రాతలు

అంగన్​వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడం వలన తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ సంస్కరణ సాధ్యం అయ్యే అవకాశం ఉంది. తద్వారా పిల్లలకు పోషకాహారంతోపాటు  ఫౌండేషన్  విద్య  పక్కాగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ విద్యా కమిషన్ సూచనలు అమలు జరగాలంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలపై సమగ్ర మదింపు జరగాల్సిఉంది. 

అయితే, పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విశాలమైన భూములు, సర్వశిక్షా అభియాన్ కట్టిన భవన సదుపాయాలు, నైపుణ్యం గల బోధనా సిబ్బందిని, సబ్జెక్టు నిపుణుల సేవలు సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంది. 

 రాష్ట్ర మానవవనరుల అభివృద్దికి కీలకమైన విద్య విషయంలో  ఎన్ఆర్ఐ,  కార్పొరేట్ కంపెనీల సహకారంతో అభివృద్ది చేస్తామనడం ద్వారా పాలక పక్షాలు తమ డొల్లతనం, బేలతనం తమకు తామే బయటపెట్టుకుంటున్నాయి. నిర్బంధోచిత విద్య, వయస్సు ఆధారిత సామర్థ్యం పొందడమనేది విద్యార్థులకు విద్యాహక్కు చట్టం -2009 హక్కుగా చట్టబద్ధం చేయడమైంది. ప్రజలు పన్నుల ద్వారా, విద్యాసెస్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే ప్రభుత్వ విద్యను ప్రజలకు గ్యారెంటీ చేయాల్సిన బాధ్యత పాలక పక్షాలపైనే ఉంది. విద్య విషయంలో ప్రభుత్వేతర సహకారం తీసుకోవడం విద్యార్థుల్లో తప్పుడు సంకేతాలు తీసుకువెళుతుందని పాలకులు గ్రహించాలి. 

ఫౌండేషన్​ స్కూల్స్​తో ​  ప్రాథమిక విద్య బలోపేతం

ప్రభుత్వ పాఠశాలల్లో1,48,456 మంది శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సబ్జెక్టు నిపుణులు ఉన్నారు. కనుక తెలంగాణ  విద్యా కమిషన్ సూచించిన ఫౌండేషన్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్​కు బోధనా సిబ్బంది కొరత ఉపాధ్యాయుల సర్దుబాటుతో సమస్య తీరుతుంది. 

ఇక తెలంగాణ విద్యా కమిషన్ పాఠశాల సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలను తిరిగి జవజీవాలు నింపుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే లక్షలాది రూపాయలు ప్రైవేటు పాఠశాలలకు ధారపోస్తున్న క్యాపిటేషన్ ఫీజుల పీడ ప్రజలకు వదులుతుంది. తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్స్ చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్​ను మినీ గురుకులాలుగా నడపగలిగితే.. ఇన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల అవసరం ఉండకపోవచ్చు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ విద్యా కమిషన్ సూచనలు పెద్ద మనస్సుతో చర్చించి, పతనం అవుతున్న ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను గాడిలో పెట్టగలిగితే అంతకంటే గొప్ప
సంస్కరణ తెలంగాణలో మరొకటి ఉండదు. 

- ఎన్,తిర్మల్, విద్యా విశ్లేషకుడు-