- కట్టెలపై వండొద్దు.. గ్యాస్ పొయ్యిపై వంట చేయాలి
- సీఎస్ శాంతికుమారికి చైర్మన్ ఆకునూరి మురళి నివేదిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్వాడీ సెంటర్లలో వంట సహా తాగేందుకు బోర్ నీళ్లు వాడొద్దని, మిషన్ భగీరథ నల్లా నీటిని వినియోగించాలని తెలంగాణ విద్యా కమిషన్ సూచించింది. హాస్టళ్లు, గురుకులాలు సహా అన్ని విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనాన్ని కట్టెలపై వండొద్దని, గ్యాస్ పొయ్యిలపైనే వంట చేయాలని పేర్కొన్నది.
తెలంగాణలోని పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో 45 మందికి పైగా విద్యార్థులు చనిపోవడంతో దీనికి కారణాలను తెలుకునేందుకు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పలు జిల్లాల్లో పర్యటించింది. దీనికి సంబంధించిన నివేదికను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు విశ్వేశ్వర్ రావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జోత్న్స శివారెడ్డి అందజేశారు. ఆ నివేదికలో పలు సూచనలు చేశారు.
కామన్ మెనూ అమలు చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లోని పలు స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, అంగన్ వాడీ సెంటర్లనూ సందర్శించినట్టు నివేదికలో కమిషన్ పేర్కొన్నది. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఆహార నాణ్యత, భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యా నికి సంబంధించిన లోటుపాట్లను క్షుణ్నంగా పరిశీలించి నట్లు తెలిపింది.
ప్రభుత్వ విద్యాసంస్థ లు, గురుకులాలు, హాస్టళ్లలన్నింటికీ ఒకే విధమైన కామన్ మెనూను అమలు చేయాలని ప్రతిపాదించింది. మెస్ చార్జీలను అన్ని కేటగిరీల వారికి రూ.2 పెంచాలని సూచించింది. అంగన్‌వాడీలు, గురు కులాలు, హాస్టళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, జిల్లా పరిషత్ పాఠశాలన్న వ్యత్యాసం లేకుండా అన్నింటికీ ఒకే తరహాలో ఒకే మెస్ చార్జీలను అమలుచేయాలని సిఫారసు చేసింది.