హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రోత్సహించడంతోపాటు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు విద్యాకమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నిరంతరం పనిచేసే వ్యవస్థగా విద్యాకమిషన్ ను తీర్చిదిద్దబోతున్నామని అన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్కారు బడుల్లో చదివి 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు ఇవాళ రవీంద్రభారతిలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన వారితో ఆ పాఠశాల యాజమాన్యలు ఫొటోలు దిగి.. తమ విద్యార్థులని చెప్పుకొంటారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10 జీపీఎ సాధించిన విద్యార్థులంతా మా పిల్లలేనని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు ,తాను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్లమేనని అన్నారు. తమకు చదువులు చెప్పిన గురువులదే ఈ ఘనత అని అన్నారు. సర్కారు బడుల్లో సమస్యలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తే బాగుండేదని, వందేమాతరం ఫౌండేషన్ నిర్వహించి తమ ప్రభుత్వానికి బాధ్యతను గుర్తు చేసిందని సీఎం అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ లుగా పనిచేస్తున్న వారిలో 90% సర్కారు బడుల్లో చదివిన వాళ్లేనని అన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు మూయడానికి వీళ్లేదని తాను చెప్పానని సీఎం తెలిపారు.
గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలలను రన్ చేస్తామని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చిన నడుపుతామని అన్నారు. ఇందుకోసం మెగా డీఎస్సీ వేసి 11 వేల పైచిలుకు టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. మనం విద్యపై పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తుకు పెట్టుబడి అని అన్నారు. సర్కారు బడిలో చదివే ఒక్కో విద్యార్థిపై ఏటా ప్రభుత్వం రూ. 80 వేలు ఖర్చు చేస్తోందని అధికారులు చెబుతున్నారని, తనకు తెలిసి అవన్నీ టీచర్ల జీతాలని అనుకుంటున్నానని అన్నారు. మౌలిక వసతులపై గత ప్రభుత్వం దృష్టి తక్కువగా పెట్టిందని, దాంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ కమిటీలకు అప్పగించామని, గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలే మధ్యాహ్న భోజనం, యూనిఫారాల తయారీ ప్రక్రియను చేపడతాయని చెప్పారు. ఇందుకోసం గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేయాలని ఆర్థికశాఖను ఆదేశించినట్టు సీఎం చెప్పారు.
సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వార సత్ఫలితాలు వస్తాయని వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధి చెప్పారని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇచ్చి పాఠశాలలో చదివించే ఈ ప్రక్రియను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువు కారణంగా విద్యార్థులకు తల్లిదండ్రులతో అనుబంధం తగ్గుతోందని ఓ నివేదిక తెలిపిందని, కుటుంబ సంబంధాలు బలహీన పడొద్దని సీఎం పేర్కొన్నారు. ఈ నెల 9 నుంచి 20వ తారీఖు వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలోవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.