హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు టీచర్లు, లెక్చరర్లకు డిప్యూటేషన్లు, ఓడీలపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన కొద్దిరోజులకే డిప్యూటేషన్ల ఉత్తర్వులు రావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సర్కారు పెద్దల ఆదేశంతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను మళ్లీ అభయన్స్ లో పెట్టారు. రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో దాదాపు 30వేల మందికి ప్రమోషన్లు, 40 వేల మందికి బదిలీలు జరిగాయి.
అందులో సరైన స్థానాలు దక్కని కొందరు టీచర్లు, లెక్చరర్లు సర్కారు పెద్దల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వారికి డిప్యూ టేషన్లు, ఓడీలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. దీనిపై సర్కారు పెద్దలకు.. టీచర్ల సంఘాల నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో సర్కారుకు చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది.