హైదరాబాద్: తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 30) విడుదల చేసిన విషయం తెలిసిందే. సచివాలయంలో రిజల్ట్స్ రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి.. దసరా పండుగ లోపు సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా టీచర్ల సెలక్షన్ ప్రాసెస్‌లో విద్యాశాఖ దూకుడు పెంచింది. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసిన రోజునే సెలక్ట్ అయిన అభ్యర్థులకు మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది.
అక్టోబర్ 1, 2024 నుండి అక్టోబర్ 5, 2024 వరకు డీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేపట్టనున్నట్లు తెలిపింది. మొత్తం ఐదు రోజుల పాటు.. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. స్థానికంగా ఉండే జిల్లా విద్యా శాఖ అధికారుల కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతోందని తెలిపింది. పూర్తి వివరాలు విద్యా శాఖ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు విద్యశాఖ అధికారులు వెల్లడించారు.
కాగా, దసరాలోపు కొత్త టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ 11 వేల 62 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన డీఎస్సీ ఫలితాలను సీఎం ప్రకటించారు. 1:3 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేసినట్టు చెప్పారు. గత ప్రభుత్వం పదేండ్లు పాలించి కేవలం ఏడు వేల టీచర్ పోస్టులనే భర్తీ చేసిందని అన్నారు. తాము పది నెలల వ్యవధిలో 11 వేల 62 టీచర్ కొలువులను భర్తీ చేస్తున్నామని చెప్పారు. కేవలం 56 రోజుల్లోనే రిజల్ట్ ప్రకటించామని చెప్పారు. అక్టోబర్ 9 న ఎల్బీ స్టేడియంలో డీఎస్సీకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని సీఎం చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన పది నెలల వ్యవధిలో 65 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. త్వరలోనే గ్రూప్–1 పలితాలు విడుదల చేయనున్నామని సీఎం చెప్పారు. ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో గత ప్రభుత్వం ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసి వేసిందని, తాము వచ్చాక వాటిని తెరిపించామని అన్నారు. గ్రామీణ విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ హాయంలో పేరుకుపోయిన చెత్తనంతా ఊడ్చేస్తున్నామని వివరించారు.