- ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తర్వులు
- స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ విడుదల
మెదక్, వెలుగు: ప్రభుత్వ బడుల్లో వెంటనే స్కావెంజర్లను నియమించుకోవాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో స్కావెంజర్లు లేక అధ్వానంగా తయారవుతున్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారుతున్నాయి.
నీటి వసతి లేకపోవడం, మెయింటెనెన్స్ లేక టాయిలెట్స్ అధ్వానంగా మారి వినియోగించలేని పరిస్థితి నెలకొంది. దీంతో టీచర్స్, స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్కావెంజర్స్ ను నియమించాలని సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. నర్సింహారెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.
గత జులై నెలలోనే స్కూల్ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్విడుదల చేసింది. టాయిలెట్స్ క్లీనింగ్, మొక్కలకు నీళ్లు పోయడం, స్కూల్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఈ నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మాడల్ స్కూల్ లకు మెయింటెనెన్స్ గ్రాంట్ మంజూరైంది. నిధులు విడుదలై మూడు నెలలవుతున్నా ఇంకా స్కావెంజర్స్‌ను నియమించలేదు. పీఆర్టీయూ నాయకులు ఎస్ఎస్ఏ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ను కలిసి సమస్యలు చెప్పగా అన్ని స్కూల్ లలో వెంటనే స్కావెంజర్స్ ను నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
904 స్కూల్స్...
మెదక్ జిల్లాలో ప్రైమరీ స్కూల్స్623, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 128, జడ్పీ హైస్కూల్స్146, మాడల్ స్కూల్స్7 ఉన్నాయి. ఈ అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మెయింటెనెన్స్ గ్రాంట్ మొదటి విడతగా 50 శాతం నిధులు రూ.1.28 కోట్లు
విడుదలయ్యాయి.
స్టూడెంట్స్ సంఖ్యను బట్టి..
స్కూళ్లలో స్టూడెంట్స్ సంఖ్యను బట్టి స్కావెంజర్స్ జీతాలు ఇవ్వాలని నిర్దేశించారు. 1 నుంచి 30 మంది స్టూడెంట్స్ ఉంటే నెలకు రూ.3 వేలు, 31 నుంచి 100 మంది స్టూడెంట్స్ ఉంటే రూ.6 వేలు, 101 నుంచి 250 స్టూడెంట్స్ ఉంటే రూ.8 వేలు, 251 నుంచి 500 వరకు స్టూడెంట్స్ ఉంటే రూ.12 వేలు, 501 నుంచి 750 మంది స్టూడెంట్స్ ఉంటే రూ.15 వేలు, 750 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. స్టూడెంట్స్ సంఖ్యకు అనుగుణంగా నిర్ధేశిత శ్లాబ్ ప్రకారం 10 నెలల పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి నిధులు విడుదల అవుతాయి.