ఏజెన్సీలో డుమ్మా టీచర్లకు చెక్​ .. స్కూళ్లలో టీచర్ల ఫొటోలు, వారి వివరాలతో డిస్​ ప్లే

ఏజెన్సీలో డుమ్మా టీచర్లకు చెక్​ .. స్కూళ్లలో టీచర్ల ఫొటోలు, వారి వివరాలతో డిస్​ ప్లే
  • పలుచోట్ల టీచర్లు సరిగా రావడం లేదని ఫిర్యాదులు 
  • ఈ నేపథ్యంలో జవాబుదారీ తనం పెంచేందుకు విద్యాశాఖ కసరత్తు
  • ఇప్పటికే జిల్లాలోని కొన్ని డిస్​ ప్లే బోర్డుల ఏర్పాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల పొటోలు డిస్​ప్లే చేయాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లోని స్కూళ్లలో బినామీ, డుమ్మా కొట్టే టీచర్లకు చెక్​ పెట్టనుంది. ఇప్పటి వరకు స్కూళ్లలో టీచర్ల వివరాలతో కూడిన బోర్డు మాత్రమే ఉండేది. ఇక నుంచి టీచర్ల వివరాలతో పాటు వారి ఫొటోలను అందరికీ కనిపించేలా నోటీస్​ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

1,065 స్కూళ్లలో 4వేల మంది టీచర్లు.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో దాదాపు 4వేల మందికి పైగా టీచర్లు పనిచేస్తున్నారు. జడ్పీ, ఎంపీపీ, స్టేట్​ గవర్నమెంట్, ట్రైబల్ ​వెల్ఫేర్, గిరిజన ఆశ్రమ స్కూళ్లతో పాటు పలు యాజమాన్యాలకు సంబంధించిన గవర్నమెంట్​ స్కూళ్లు​ 1,065 ఉన్నాయి. కాగా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మారుమూల గ్రామాల్లోని పలు స్కూళ్లలో ఇద్దరు టీచర్లుంటే కొన్ని రోజులు ఒకరు..  మరికొన్ని రోజులు మరొకరు మాత్రమే స్కూళ్లకు అటెండ్​ అవుతున్నారు. కొన్ని స్కూళ్లలో తమకు బదులుగా ప్రవేటుగా విద్యావాలంటీర్లను ఏర్పాటు  చేసుకుంటున్నారు. 

దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారుతోంది.  ఇటీవల అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాల్లో టీచర్లు రెగ్యులర్​గా రావడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బడికి తాళాలు వేసి నిరసన తెలిపారు.  కొడవటంచ గ్రామంలో టీచర్​ బడికి సరిగా రావడం లేని స్కూల్​కు తాళం వేసి ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఇల్లెందు పట్టణంలోని ఇల్లందులపాడు గవర్నమెంట్​ ప్రైమరీ స్కూల్  టీచర్​ స్కూల్​కు వచ్చి వెంటనే వెళ్లిపోయేవాడు. తనకు బదులుగా ఓ యువతిని పాఠాలు చెప్పేందుకు నియమించాడు. 

Also Read : వనపర్తి జిల్లాలో అస్తవ్యస్తంగా జూరాల కాల్వల నిర్వహణ

ఇలాంటి టీచర్లకు చెక్​ పెట్టాలని టీచర్​ వివరాలు, ఫొటోలు విద్యార్థులకు, పేరెంట్స్​కు కనిపించేలా నోటీస్​ బోర్డులో ప్రదర్శించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలోని కొన్ని స్కూళ్లలో టీచర్ల వివరాలను డిస్ ప్లే చేశారు. కాగా ప్రైవేట్ స్కూళ్లలోనూ టీచర్ల విద్యార్హత వివరాలు నోటీస్​ బోర్డులో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు పేరెంట్స్​ కోరుతున్నారు. 

జవాబుదారీ తనం ఉంటుంది

స్కూళ్లలో  టీచర్ల పేర్లు, హోదా, విద్యార్హతతోపాటు పొటోలు డిస్​ ప్లే చేయడం మంచి ఆలోచన. దీంతో టీచర్లకు జవాబుదారీ తనం ఉంటుంది. బినామీలకు, డుమ్మా కొట్టే టీచర్లకు  చెక్​ పెట్టవచ్చు. 

రాజు, యూటీఎఫ్​ స్టేట్​సెక్రటరీ