డ్రగ్స్ కట్టడికి కమిటీలు

డ్రగ్స్ కట్టడికి కమిటీలు
  • స్కూల్, కాలేజీల స్టూడెంట్లపై ఫోకస్
  • గవర్నమెంట్ స్కూళ్లలో ప్రహరీ కమిటీలు
  • ఇకనుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు
  • సైకాలజస్ట్​లతో కౌన్సెలింగ్​లు

నిర్మల్, వెలుగు: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి వాటికి బానిసలుగా మారిపోతున్న అంశాన్ని విద్యాశాఖ సీరియస్ గా తీసుకుంది. మత్తుకు బానిసలైన విద్యార్థులను విముక్తులను చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రతి పాఠశాలలో ప్రహరీ క్లబ్ పేరిట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

దీనికి సంబంధించిన గైడ్​లైన్స్​ కూడా జిల్లా విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలలకు జారీ చేసింది. అయితే ఈ కమిటీల ఏర్పాటులో ఆలస్యం కావడంతో నిర్మల్​ కలెక్టర్ దీనిపై దృష్టి సారించారు. వారంరోజుల్లోగా కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత నివేదికలు అందజేయా లని ఆదేశాలు జారీ చేశారు.  దీంతో అన్ని పాఠశాలలో కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.

 మత్తుకు బానిసలై వికృత చేష్టలు

 విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న కిరాణా దుకాణాలు. పాన్ టేలాల వద్ద మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో చాలామంది విద్యార్థులు, యువకులు గంజాయితోపా టు ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వికృత చేష్టలు చేస్తున్నారు. సెలవు దినాల్లో గంజాయి మత్తులోనే జోగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు, ఆరోగ్యపరమైన నష్టాలపై పాఠశాలల్లో ఇప్పటికే పలుమార్లు కౌన్సిలింగ్ లు నిర్వహించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. 

 కమిటీలకు కీలక బాధ్యతలు

ప్రహరీ క్లబ్​ల పేరిట ఏర్పాటు చేస్తున్న కమిటీలకు విద్యాశాఖ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. విద్యార్థులు, స్థానిక యువకులను మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రహరీ క్లబ్ కమిటీ సభ్యులు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు గంజాయి ఇతర మత్తు పదార్థాలను నివారించాలి. పాఠశాల పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు విక్రయించే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించడం, వాటిని అమ్ముతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి మరోసారి అమ్మకుండా కట్టడి చేయాల్సి ఉంటుంది. మత్తుకు అలవాటుపడిన విద్యార్థులను గుర్తించి వారికి మొదట టీచర్ల ద్వారా, ఆ తర్వాత 15 రోజులకోసారైనా స్థానికంగా ఉన్న సైకాలజిస్టుల చేత కౌన్సెలింగ్ నిర్వహించాలి. మత్తు పదార్థాలతో జరిగే దుష్పరిణామాలపై వివరించాలి. ఈ కార్యక్రమాల నిర్వహణకు తల్లిదండ్రుల సహకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

కమిటీల ఏర్పాటు ఇలా..

ప్రహరీ క్లబ్ కమిటీల ఏర్పాటును పకడ్బందీగా చేపడుతున్నారు. ఈ క్లబ్బుల ప్రెసిడెంట్​గా స్థానిక పాఠశాల హెచ్​ఎం లేదా ప్రిన్సిపాల్, వైస్ ప్రెసిడెంట్​గా పాఠశాల సీనియర్ టీచర్ లేదా విద్యార్థులతో సన్నిహితంగా ఉండే టీచర్ ను నియమించనున్నారు. ఆరు నుంచి టెన్త్​క్లాస్ వరకు ప్రతి తరగతి నుండి ఇద్దరు చొప్పున విద్యార్థులకు కమిటీలో చోటు కల్పించనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒకరు, స్థానిక కానిస్టేబుల్ ఒకరు క్లబ్​లో భాగస్వాములుగా ఉంటారు.