మంచిర్యాల జిల్లాలో మూతబడ్డ స్కూళ్లు రీ ఓపెన్!

  • స్టూడెంట్లు లేక కొన్ని, టీచర్లు లేక మరికొన్ని క్లోజ్
  • ఇంగ్లీష్ మీడియం, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ప్రైవేట్​కు
  • ప్రతి పంచాయతీలో స్కూల్ ఉండాలన్న సీఎం రేవంత్​
  • ఈ ఏడాది 31 స్కూళ్ల రీ ఓపెన్​కు విద్యాశాఖ ప్రయత్నం
  • క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్న అధికారులు

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో స్టూడెంట్లు లేక మూతపడ్డ 31 స్కూళ్లను ఈ విద్యాసంవత్సరం రీ ఓపెన్ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. స్టూడెంట్ల జీరో ఎన్​రోల్​మెంట్ కారణంగా మూతబడ్డ వాటిలో అత్యధికంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు (ఎంపీపీఎస్)లే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్లలో సరిపడా టీచర్లు లేకపోవడం, నాణ్యమైన విద్య అందకపోవడం, ఇంగ్లీష్ మీడియం బోధించకపోవడం వంటి కారణాలతో తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా 31 స్కూళ్లు దశలవారీగా మూతబడ్డాయి. పలు స్కూళ్లలో టీచర్లు ఉన్నప్పటికీ స్టూడెంట్లు లేకపోవడంతో వాటిని టెంపరరీగా మూసివేశారు. కొన్ని స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో వారిని సమీపంలోని స్కూళ్లలో జాయిన్ చేశారు. అక్కడ పనిచేస్తున్న టీచర్లను ఇతర స్కూళ్లకు డిప్యూటేషన్​పై పంపించారు. 

మూతబడ్డ స్కూళ్లు ఇవే..

టీచర్లు ఉన్నా స్టూడెంట్లు లేక 31 స్కూళ్లు మూతపడగా, 19 స్కూళ్లలో స్టూడెంట్లు లేకపోవడంతో టీచర్లను ఇతర స్కూళ్లకు కేటాయించారు. వీటిలో ప్రైమరీ స్కూళ్లే ఎక్కువగా ఉన్నాయి. బెల్లంపల్లి మండలం సుబ్బారావుపల్లి, అశోక్​నగర్ ఉర్దూ మీడియం స్కూల్, గోండుగూడ, చెన్నూర్ మండలం దుగ్నేపల్లి, వస్తాద్​పల్లి, ముత్తారావుపల్లి, సుబ్బరాంపల్లి, బొక్కలగూడ, దండేపల్లి మండలంలో నేతకానీగూడ, హాజీపూర్ మండలంలో గుడిపేట పోలీస్ క్యాంప్, వేంపల్లి స్కూళ్లలో టీచర్లు ఉన్నారు. అలాగే జైపూర్ మండలం గుత్తేదార్​పల్లి, జన్నారం మండలంలో చర్లపల్లి, పాపమ్మగూడ, శ్రీలంక కాలనీ, మురిమడుగు, రేండ్లగూడ, లక్సెట్టిపేట మండలంలో కొత్తకొమ్ముగూడెం, మోదెల, నెన్నెల మండలంలో బొప్పారం స్కూళ్లలో స్టూడెంట్లు లేకపోవడంతో ఇతర స్కూళ్లకు కేటాయించారు. హాజీపూర్ మండలం కొండపల్లిలో స్కూల్ బిల్డింగ్ లేకపోడంతో అక్కడున్న 20 మంది స్టూడెంట్లను కర్ణమామిడి స్కూల్​కు పంపుతున్నారు. 

స్కూళ్ల రిపేర్లు ఎప్పుడు?

కొన్నేండ్ల కిందట మూతపడ్డ స్కూళ్ల పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా ఉంది. పలుచోట్ల బిల్డింగులు పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరాయి. తలుపులు, కిటికీలు, ఫర్నీచర్, ఇతర సామగ్రి చెదలు పట్టి పనికిరాకుండా తయారయ్యాయి. మరికొన్ని దొంగల పాలయ్యాయి. స్కూల్ ఆవరణలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. విద్యాసంవత్సరం ప్రారంభానికి ఇంకా 20 రోజుల టైమ్ మాత్రమే ఉంది. ఈ లోగా స్కూళ్లలో రిపేర్లు పూర్తిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

రీ ఓపెన్​కు డేటా సేకరణ

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి పంచాయతీలో గవర్నమెంట్ స్కూల్ ఉండాలని, మూతబడ్డ వాటిని ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో టెంపరరీగా మూతపడ్డ స్కూళ్లను ఈ విద్యాసంవత్సరం రీ ఓపెన్ చేసేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. జిల్లాలో ఎక్కడెక్కడ స్కూళ్లు మూతబడ్డాయి? ఆ గ్రామాల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 

వారు ఎక్కడ చదువుతున్నారు? స్కూళ్లను తెరిచే అవకాశాలు ఉన్నాయా? పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉన్నారా? అనే వివరాలను అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో సేకరిస్తోంది. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్​కు ప్రైమరీ, మూడు కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ, ఐదు కిలోమీటర్లకు హై స్కూల్ ఉండాలి. ఈ మేరకు స్కూళ్లను రీ ఓపెన్ చేసి టీచర్లను నియమించే యోచనలో విద్యాశాఖ ఉంది.