
- ప్రభుత్వంతో పోలిస్తే ప్రైవేట్‌లో స్కూళ్ల సంఖ్య తక్కువ.. స్టూడెంట్లు ఎక్కువ
- ప్రతి సర్కారు బడిలో విద్యార్థులు సగటున 87.. ప్రైవేట్‌లో 314
- వచ్చే అకడమిక్ ఇయర్లో సర్కారు స్కూళ్లలో చేరికలు పెంచేందుకు యాక్షన్ ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యా వ్యవస్థలో ప్రైవేట్ స్కూళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య, విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, టీచర్ల సమాచారంపై తాజా గణాంకాలు ఇదే విషయాన్ని మరింత తేటతెల్లం చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం, ఫలితాల్లో వాటి సత్తా, ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ పెరగాల్సిన అవసరం గురించి చర్చ జరుగుతోంది.
అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్ మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సర్కార్ దృష్టి పెట్టింది. ఇందుకోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ముందుకు వెళ్లాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది.
విద్యార్థుల నమోదులో ప్రైవేట్ డామినేషన్
రాష్ట్రంలో మొత్తం 40,975 స్కూళ్లు ఉండగా, వీటిలో ప్రభుత్వ స్కూళ్లు 29,509, ఎయిడెడ్ స్కూళ్లు 634, ప్రైవేట్ స్కూళ్లు 10,832 ఉన్నాయి. అంటే స్కూళ్ల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లదే పైచేయి. కానీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మొత్తం 60,42,060 మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రభుత్వ స్కూళ్లలో 25,68,551 మంది, ఎయిడెడ్ స్కూళ్లలో 68,079 మంది, ప్రైవేట్ స్కూళ్లలో 34,05,430 మంది ఉన్నారు. అంటే, స్కూళ్ల సంఖ్యలో 26% మాత్రమే ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో దాదాపు 56% మంది విద్యార్థులు చదువుతున్నారు. సగటున ఒక్కో ప్రభుత్వ స్కూల్‌లో 87 మంది విద్యార్థులు చదువుతుంటే, ప్రైవేట్ స్కూల్‌లో ఈ సంఖ్య 314కి చేరుతోంది. ఈ గణాంకాలు ప్రభుత్వం కంటే.. ప్రైవేట్ స్కూళ్లపై తల్లిదండ్రులకు ఉన్న నమ్మకాన్ని వెల్లడిస్తున్నాయి.
టీచర్, స్టూడెంట్ రేషియో దాదాపు సమానం
టీచర్ల సంఖ్య విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 3,16,571 మంది టీచర్లు ఉండగా, ప్రభుత్వ స్కూళ్లలో 1,89,957 మంది, ఎయిడెడ్ స్కూళ్లలో 3,077 మంది, ప్రైవేట్ స్కూళ్లలో 1,73,537 మంది పని చేస్తున్నారు. స్టూడెంట్-, టీచర్ రేషియోను పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో పెద్దగా తేడా లేదు. ప్రభుత్వ స్కూళ్లలో సగటున 13–-14 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే, ప్రైవేట్ స్కూళ్లలో ఈ రేషియో 19–-20గా ఉంది. అయినప్పటికీ, ఫలితాల్లో ప్రైవేట్ స్కూళ్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి.
ప్రైవేట్‌లో ఇలా.. ప్రభుత్వం చేయాల్సింది ఇలా..
ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి పలు కారణాలను ఇప్పటికే ప్రభుత్వం విశ్లేషించింది. ప్రైవేట్ స్కూళ్లు ఆధునిక సౌకర్యాలు, డిజిటల్ బోధనా పద్ధతులు, ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తున్నాయి. పోటీ పరీక్షలకు కావాల్సిన స్కిల్స్, ఇతర అదనపు ఎడ్యుకేషన్ ను అందిస్తున్నాయి. ఇవి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు పరీక్షల్లో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తుండటం వాటిపై నమ్మకాన్ని పెంచుతోంది. ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న భావన తల్లిదండ్రుల్లో బలంగా నాటుకుపోయింది. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, టీచర్లు పట్టించుకోరని, బోధనా నాణ్యతపై తల్లిదండ్రుల్లో అనుమానాలు ఉన్నాయి.
అందుకే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచాలంటే పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయమై విద్యా కమిషన్ కూడా ఇప్పటికే పలు సిఫార్సులు చేసింది. ప్రీ ప్రైమరీ విధానంతో పాటు.. ప్రభుత్వ స్కూళ్లలో ఆధునిక సౌకర్యాలు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ల్యాబ్‌లు, లైబ్రరీలు అందుబాటులోకి తేవాలని పేర్కొంటున్నారు. టీచర్లకు ఆధునిక శిక్షణ, డిజిటల్ బోధనా పద్ధతులపై అవగాహన కల్పించాలని చెబుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మెరుగైన విద్య గురించి తల్లిదండ్రులకు తెలియజెప్పేలా కార్యక్రమాలు చేపట్టాలని అంటున్నారు. అలాగే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ, అదనపు క్లాసులు, పోటీ పరీక్షలకు సన్నద్ధత వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.