చదువు వ్యాపారం కావద్దంటే.. ఫీజులు కంట్రోల్ చేయాలె

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టాలనే డిమాండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ ప్రబలంగానే వున్నది. ప్రైవేట్ స్కూళ్లు ఏటా 10% చొప్పున ట్యూషన్ ఫీజులు పెంచుకోవచ్చని 2017 లో ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ మేనేజ్‌మెంట్లకు అనుకూలంగా చేసిన సిఫార్సులను తల్లిదండ్రుల సంఘాలు వ్యతిరేకించడంతో అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓలు తెలంగాణాలో కూడా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు తోడ్పడే అవకాశం ఉంది.

దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఒకసారి నిర్ణయించిన ఫీజులు మూడేళ్లు అమలయ్యే విధానమే వుంది. ప్రైవేట్ స్కూల్స్‌‌ ఫీజుల నియంత్రణ విషయంలో తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తలో పద్ధతి పాటిస్తున్నాయి. తమిళనాడులో బడుల వారీగా రాష్ట్ర స్థాయి కమీషనే ఫీజులు నిర్ణయిస్తుంది. మహారాష్ట్రలో టీచర్స్ పేరెంట్స్ కమిటీలు ఫీజులను ప్రతిపాదిస్తాయి. ఢిల్లీలో ప్రభుత్వమే స్కూళ్ల ఎకౌంట్స్ పరిశీలించి ఖర్చుల ప్రాతిపదికన ఫీజులు పెంచడం లేదా  తగ్గించడం చేస్తుంది. గుజరాత్‌‌లో స్కూళ్ల యాజమాన్యాలు ఫీ రెగ్యులేషన్ కమిటీతో సంప్రదించి ఫీజులు ఖరారు చేస్తాయి. రాజస్థాన్‌‌లో రాష్ట్ర స్థాయి నియంత్రణ కమిటీనే ఫీజుల మాగ్జిమమ్‌‌ పరిమితిని ప్రకటిస్తుంది. ఉత్తర ప్రదేశ్‌‌లో వినిమయ సూచీ ఆధారంగా ఫీజుల పెంపుదల ఉంటుంది.
ఆంధ్రాలో
ఆయా రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణకు పాటిస్తున్న పద్దతులను మరియు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కాలేజీల్లోని ప్రొఫెషనల్ కోర్సులకు ఫీజులను నిర్ణయిస్తున్న విధానాన్ని లోతుగా రీసెర్చ్‌‌ చేసిన జస్టిస్ కాంతారావు గారి ఆధ్వర్యంలో ‘‘ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్‌‌ మోనిటరింగ్ కమిషన్‌‌’’ రాజస్థాన్ మాదిరిగా ఫీజులకు గరిష్ట పరిమితిని విధించే పద్ధతినే ఎంచుకుంది. తమిళనాడు లాగ స్కూలు వారీగా ఫీజులు నిర్ణయించడం సాధ్యం కాదని చెప్పింది. బడుల వారీగా ఫీజులు నిర్ణయించాలంటే ఆయా స్కూళ్ల ఎకౌంట్సును ఆడిట్ చేయాల్సి ఉంటుంది. అందుకు యాజమాన్యాలు అంతగా సహకరించవు. అందువలనే ఫీజులపై గరిష్ట పరిమితి పద్దతిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 
జీవో 53
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 53, జీఓ 54 ద్వారా ఈ నెల 24న ఉత్తర్వులు ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామం. తెలుగు రాష్ట్రాల ప్రజలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఎంతో కాలంగా కోరుతున్న ఫీజుల సమస్య పరిష్కారానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూనుకొంది. ఈ జీఓలలో పేర్కొన్న నిబంధనలు అధిక ఫీజులను నియంత్రించి తల్లిదండ్రులకు మేలు చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్స్‌‌, సిబ్బంది సంక్షేమానికి మరియు చిన్న సన్నకారు బడ్జెట్ స్కూళ్ల మనుగడకు తోడ్పడి కార్పొరేట్ స్కూళ్లను కట్టడి చేసి, పెచ్చు మీరిన విద్యా వ్యాపారాన్ని అరికట్టే అవకాశం వున్నది. అమలు విషయంలో ప్రభుత్వ పట్టుదల, విద్యాశాఖ సామర్ధ్యాన్ని బట్టి ఈ జీఓల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. జీఓ1/92 నుండి జీఓ 91/2009 మరియు జీఓ 42/2010 వరకు ఫీజుల నియంత్రణ కోసం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు తాజా ఉత్తర్వులను గౌరవిస్తాయని చెప్పలేము. అందువలన ఈ జీఓల అమలు బాధ్యత ప్రభుత్వంతో పాటు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరే అందరిపైనా ఉంది. జీఓ 53 మరియు జీఓ 54 ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలో వుండే ప్రాథమిక బడులకు (నర్సరీ నుండి 5 వరకు) రూ. 10 వేలు మరియు సెకండరీ స్కూళ్లకు రూ. 12 వేలు; జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు రూ.15 వేలు, సీఈసీ, హెచ్ఈసి కోర్సులకు రూ.12 వేలుగా నిర్ణయించారు. మున్సిపాలిటీ ప్రాంతాల్లో రూ. 11 వేలు, సెకండరీ పాఠశాలలకు రూ.15 వేలు మరియు జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులకు రూ. 17,500 లు, సీఈసీ ,హెచ్ఈసీ కోర్సులకు రూ. 15 వేలుగా ఫీజులు నిర్ణయించబడినవి. మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలోని ప్రాథమిక పాఠశాలలకు రూ. 12 వేలు, సెకండరీ స్కూల్సుకి రూ. 18 వేలు మరియు జూనియర్ కాలేజీల్లోని ఎంపీసీ, బైపీసీ కోర్సులకు రూ. 20 వేలు, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులకు రూ. 18 వేలుగా నిర్ధారించారు. ఈ మొత్తాలను మాగ్జిమమ్‌‌ ఫీజులుగా పరిగణించాలి. ఇంతకుమించి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. కాంపోజిట్ ట్యూషన్ ఫీజు లేదా యాన్యువల్‌ ఫీజుగా పరిగణించబడే వీటిలోనే అన్ని రకాల ఫీజులు (ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్ వగైరా..) కలిసి ఉంటాయి. జీఓలలో లేని, ఇంక ఏ పేరుతో ఎంత ఫీజు తీసుకున్నా, దానిని క్యాపిటేషన్ ఫీజుగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. 
బస్సు చార్జీలు
స్కూళ్ళు నడిపే బస్సుల్లో, వ్యానుల్లో వెళ్లే విద్యార్థులకు కి.మీ.కు రూ. 1.20 లు చొప్పున చార్జి చేయవచ్చని మరియు హస్టల్సులో వుండే వారి నుంచి వసూలు చేయాల్సిన ఫీజులను మాగ్జిమమ్‌‌ రూ. 24 వేలు వరకు నిర్ధారించడం జరిగింది. బుక్స్, షూస్, యూనిఫార్మ్స్ ఫలానా షాపులోనే కొనాలనే షరతు విధించకూడదు. ఒకసారి నిర్ణయించిన యూనిఫాంను ఐదేళ్ల వరకు మార్చకూడదు. ఫీజుల ద్వారా వసూలైన ఆదాయంలో 50% మొత్తాన్ని సిబ్బంది జీతాలకు చెల్లించాలి, మరో 15% మొత్తాన్ని గ్రాట్యువిటీ, పీఎఫ్, జీఐఎస్ వంటి సిబ్బంది సంక్షేమ చర్యలకు వెచ్చించాలి. ఇప్పుడు నిర్ణయించిన ఫీ స్ట్రక్చర్ మూడు విద్యా (2021-–22, 2022-–23, 2023-–24) విద్యా సంవత్సరాలకు వర్తిస్తుంది. ఫీ స్ట్రక్చరుతో పాటు టీచర్ల విద్యార్హతలు, వారికి చెల్లిస్తున్న జీతాలు తదితర వివరాలు స్కూల్‌‌ వెబ్‌‌సైట్‌‌లో మరియు నోటిస్ బోర్డులో ఉంచాలి.
అదుపులోకి వస్తుందా?
53, 54 జీఓలలో పేర్కొన్న నిబంధనలు అమలు జరిగితే ప్రైవేట్ విద్యా వ్యాపారం అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు అంత తేలిగ్గా అమలు చేస్తాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సంవత్సరానికి సగటున రూ. 40-–60 వేలు ఒక్క ట్యూషన్ ఫీజుగానే వసూలు చేస్తున్న పాఠశాలలు ఇప్పుడు అన్ని రకాల ఫీజులను కలిపి మాగ్జిమమ్‌‌గా ఫిక్స్ చేసిన రూ. 12-–18 వేలకు, సగటున రూ.60 వేలు నుండి లక్ష రూపాయలు పైగా వసూలు చేస్తున్న జూనియర్ కాలేజీలు ఇప్పుడు అన్ని రకాల ఫీజులను కలిపి రూ. 18-20 వేలకు పరిమితం అవుతాయా? బుక్స్, యూనిఫార్మ్స్, కంప్యూటర్, డిజిటల్, ల్యాబ్, లైబ్రరీ, ఎక్స్‌‌కర్షన్‌‌, కల్చరల్, స్పోర్ట్స్, పేరెంట్స్ మీటింగ్స్, మెసేజెస్, స్పెషల్ క్లాసెస్, కోచింగ్, ఎగ్జామ్స్ మొదలైన పలు రకాల పేర్లతో వసూలు చేస్తున్న లక్షలాది/కోట్లాది రూపాయల ఆదాయాన్ని(దోపిడీని) అంత సులభంగా వదులుకొంటాయా? తాజా ఫీ స్ట్రక్చర్ లో ‘‘ఫీ బడ్జెట్ స్కూళ్ల’’కు సానుకూలంగానే వున్నా పెద్ద స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు కోర్టులను ఆశ్రయించి తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ ఇప్పుడు అలాంటి ఎత్తుగడలు ఫలించే అవకాశమూ లేదు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ రాజ్యాంగ బద్దమేనని ఇటీవల రాజస్థాన్ ప్రైవేట్ స్కూల్స్ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు నేపథ్యంలో మేనేజ్‌మెంట్లు న్యాయస్థానాల్లో సవాల్ చేసినా గెలిచే అవకాశం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సరిపోవని, పెంచాలని కోరే మేనేజ్‌మెంట్లకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని యూజ్‌ చేసుకోవచ్చు. ఏదేమైనా ఏపీలో ఫీజుల నియంత్రణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద మేలు చేస్తుంది. ఎన్నో విషయాల్లో ఆంధ్ర్, తెలంగాణ రాష్ట్రాలు కవల పిల్లల్లా స్పందిస్తున్న విషయం తెలిసిందే. మంచి అయినా చెడు అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రెండో రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తోంది అనడంలో సదేహం లేదు.

                                                                                                                                                           నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త