
లింగాల, వెలుగు: పట్టుదల, ఏకాగ్రతతో చదివితే సాధించలేనిది ఏమీ లేదని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం తెలిపారు. సోమవారం లింగాల మండలం అంబటిపల్లిలో జరిగిన జడ్పీ హైస్కూల్ వార్షికోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. చదువుకు పేదరికం అడ్డు కాదన్నారు. అందుకు నిదర్శనం తానేనని, అంబటిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను చిన్నతనంలో పశువులను కాసేవాడినని చెప్పారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగానని తన అనుభవాలను పంచుకున్నారు.
విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు 10 జీపీఏ లక్షంతో చదవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన విద్యాబోధన అందుతుందని చెప్పారు. ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నారు. చదువుతో గౌరవం, విలువ లభిస్తాయని తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎంఈవో బషీర్ అహ్మద్, హెచ్ఎం జ్యోతి రాణి, హన్మంత్ రెడ్డి, రవి శంకర్, ఉమామహేశ్వర దేవస్థానం డైరెక్టర్ జనార్దన్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.