బడి బాట సరే..మరి బడి మాట?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహించే బడి బాట కార్యక్రమాన్ని జూన్ 1 నుండి 9 వరకు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి  ప్రకటించారు. వివిధ ఆవాస ప్రాంతాలలో గల బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో  చేర్పించడం, తద్వారా పిల్లల నమోదును పెంచడం, వారికి నాణ్యమైన విద్యను అందించడం, సమాజ భాగస్వామ్యంతో ప్రభుత్వ బడులను బలోపేతం చేయడం బడిబాట ప్రధాన లక్ష్యాలు. కార్యక్రమంలో టీచర్లతో పాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్​పర్సన్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. వీరితోపాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొంటాయి.

అందరి బాధ్యత

ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు విపరీతంగా పెరిగిపోయి తమ అసంబద్ధ ప్రకటనలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ విద్యను వ్యాపారీకరణ చేస్తున్న ఈ రోజుల్లో సామాన్య జనులకు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. అందుకు ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాలి. గత సంవత్సరం బడిబాట కార్యక్రమంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, వైద్య పరీక్షలు, డిజిటల్ తరగతి బోధన, సన్న బియ్యంతో వండిన మధ్యాహ్న భోజనం, స్కాలర్ షిప్స్ వంటి ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి ఫలితాలలో ప్రైవేటు పాఠశాలలను పడదోసి అగ్ర స్థానాల్లో నిలిచాయి. 

మౌలిక సదుపాయాల కొరత

 ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట సరే. మరి బడి మాట కూడా ప్రభుత్వం ఆలకించి ఆ సమస్యలను పరిష్కరించగలిగితే తెలంగాణ ఒక సుసంపన్నమైన విద్యా క్షేత్రంగా వెలుగొందగలదు. కొన్ని చోట్ల అదనపు తరగతి గదులు లేక ఉన్న గదిలో విద్యార్థులు ఇరుక్కుంటూ కూర్చుని తీవ్ర అవస్థలు పడుతున్నారు. అట్లాగే వారికి సరిపడే మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం వంటివి ఉండడం లేదు. కొన్ని చోట్ల గాలి, వెలుతురు లేని గదుల్లో బోధన కొనసాగుతుండగా, కొన్ని స్కూళ్లకు కరెంట్ బిల్లులు చెల్లించక విద్యుత్​ కట్​ చేస్తున్నారు.  బడి ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలు అందిస్తామని అధికారులు చెబుతున్నా, అందడం లేదు. 

ముందే యూనిఫామ్​ ఇవ్వాలి 

పిల్లల పాఠ్యపుస్తకాలు, ప్రాజెక్టు పనులు, పుస్తక సమీక్షలు, ల్యాబ్ రికార్డులు, లఘు పరీక్షలు నోట్స్ లు అన్నీ కలిపి పిల్లలకు పుస్తకాల సంచి భారంగా మారింది. విద్యాభ్యాసానికి రావాల్సిన విద్యార్థి బరువైన సంచిని తన లేత  భుజ స్కంధాలపై మోస్తూ బాల కార్మికుడి లాగా బడికి రావాల్సి వస్తుంది. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందేటట్లు చూడడంతో పాటు పుస్తకాల బరువును తగ్గించే చర్యలు చేపట్టాలి.  ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున బడి ప్రారంభం నాటికి స్కూల్​ డ్రెస్​ ఇవ్వాలి. గతేడాది దసరా సెలవుల వరకు కూడా అందలేదు. టెస్కో ద్వారా సప్లై చేయబడుతున్న వస్త్రంలో కూడా నాణ్యత లేదు. ఇక కుట్టుకూళ్ల దగ్గరకు వస్తే  గిట్టుబాటు ధర లేని కారణంగా దర్జీలు కుట్టడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం వారికి ఒక జతకు రూ.50  చెల్లిస్తున్నది. ఒకవేళ ప్రభుత్వానికి భయపడి ఏ దర్జీ అయినా ముందుకు వచ్చినా పాఠశాలకు వెళ్లి విద్యార్థుల కొలతలను పూర్తిస్థాయిలో తీసుకోకుండా ఒక అంచనా వేసి కుట్టడమో లేక ఒక విద్యార్థి కొలతను నమూనాగా తీసుకొని కుట్టడమో జరుగుతున్నది. దాంతో అవి విద్యార్థులకు సరిపోవడం లేదు. ఉంటే పొడవుగా , వదులుగా లేదా పొట్టిగా, బిగుతుగా ఉంటున్నాయి. సరైన సమయానికి ముడి వస్త్రం మండల కేంద్రానికి చేరితేనే బడి ప్రారంభం నాటికి పిల్లలకు స్కూలు డ్రెస్​లు అందుతాయి.

నాణ్యతలేని భోజనం 

ఇక మధ్యాహ్న భోజన విషయానికి వస్తే ప్రభుత్వం ఇచ్చే అరకొర డబ్బులు సరిపోక, బిల్లులు సకాలంలో అందక మెజారిటీ బడుల్లో ఏజెన్సీ గ్రూపుల వారు నాణ్యతలేని భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం గ్యాస్ పై వంట చేయాలని ఆదేశించినా సకాలంలో డబ్బులు అందక చాలా బడుల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు. తద్వారా పొగతో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోంది. టీచర్లు బియ్యం కొలిచి ఇవ్వడం, లెక్కలు నమోదు చేసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. అసలు ఈ పనులను టీచర్ల నుంచి తప్పించి తమిళనాడు తరహాలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి, విద్యామంత్రి, బడిబాటే కాదు బడి మాటను కూడా విని సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపడితేనే బడి బాటకు సార్థకత, విద్యార్దులకు ప్రయోజనం చేకూరుతుంది. 

సిబ్బంది కొరత

బడిని శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులు లేక అపరిశుభ్ర వాతావరణ పరిస్థితుల్లో అటు విద్యార్ధులు ఇటు టీచర్లు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రభుత్వం వెంటనే వారిని నియమించాలి.  చాలా బడులలో సబ్జెక్టు బోధించే టీచర్లు లేక విద్యార్ధులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఇంచార్జుల పాలన కొనసాగుతోంది. పర్యవేక్షణ వ్యవస్థ కుంటుపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం ఒకే ఒక ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వెలువడింది. ఇదివరకు టీచర్లకు బోధనాపరంగా అవసరమయ్యే సామాగ్రి కొనుగోలుకు, సామాగ్రి తయారీకి ప్రతి టీచరుకు రూ.500  చొప్పున ఇచ్చేవారు. ప్రస్తుతం ఇవ్వడం లేదు.  

- సుధాకర్. ఏ.వి..  అసోసియేట్ అధ్యక్షుడు, ఎస్​టీయూటీఎస్