ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షల ఖర్చు చేస్తున్నం : సబితా ఇంద్రారెడ్డి

  •      విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పిట్లం, వెలుగు : తెలంగాణ పిల్లలు చదువులో దేశంలోనే ముందుండాలనేది సీఎం కేసీఆర్​సంకల్పమని, అందుకనుగుణంగా పనిచేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా సోమవారం పెద్దకొడప్​గల్​లో రూ. 1.86 కోట్లతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్​సీఎం అయ్యాక కొత్తగా వేయికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశారని, ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కేజీ టు పీజీతో పాటు ప్రభుత్వ పాఠశాల్లో ఉన్నత విద్య అందించడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

2014–15లో విద్యపై రూ. 9వేల కోట్లు కేటాయిస్తే, ప్రస్తుతం దాన్ని రూ.29 వేల కోట్లకు పెంచినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి కింద మూడు విడతల్లో  సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు  చెప్పారు. మొదటి విడతలో  రూ.7 వేల కోట్ల ఖర్చుతో బడులను కార్పోరేట్​స్కూళ్లకు దీటుగా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఎమ్మెల్యే హన్మంత్​షిండే వినతి  మేరకు వచ్చే వచ్చే ఏడాది పెద్దకొడప్​గల్​లో జూనియర్​కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్​షిండే, ఎంపీ బీబీ పాటిల్, టీచర్స్​ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జిల్లా పరిషత్​చైర్​పర్సన్​దఫేదార్​శోభ, స్కూల్​ఎడ్యుకేషన్​కమిషనర్​దేవసేన, మన ఊరు మన బడి చైర్మన్​శ్రీధర్ రెడ్డి, అడిషనల్​కలెక్టర్​మనుచౌదరి, ఎంపీపీ ప్రతాప్​రెడ్డి పాల్గొన్నారు.