చదువులు విలువలు నేర్పాలి

చదువులు విలువలు నేర్పాలి

విలువలతో కూడిన విద్య మాత్రమే సమాజాన్ని దీర్ఘకాలం మనుగడ సాగించేలా చేస్తుంది.  ప్రజలందరికి విద్యను అందుబాటులోకి తీసుకురావటానికి కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టినాయి. ప్రజలకు విద్యను అందించటం ద్వారా సమాజంలో విజ్ఞానం, వికాసంను పెంపొందించటం జరుగుతుంది. కానీ, సమాజంలో విలువలు, నైతిక ధర్మాలు పెంపొందించటంలో మన విద్యా విధానం సఫలీకృతం కావటం లేదు అనేది అక్షర సత్యం. విద్య అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న సంస్థలు విలువల బోధనకు  ప్రాధాన్యం ఇవ్వకపోవటం వలనే నేడు సమాజంలో అనేకరకాల  విపరీతాలు చోటు చేసుకొంటున్నాయి.   పౌరుడికి ఉన్న విద్యార్హతలకు అతనికి ఉన్న నైతిక విలువలకు మధ్య అఘాతం పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో విలువలను పెంపొందించటానికి అవసరమైన కొత్త విధానాలు రూపొందించుకొని అమలు చేయవలసిన అత్యవసరం ఎంతైనా ఉన్నది.  విద్య ఎక్కడైతే  అభివృద్ధి చెందుతుందో అక్కడ అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. 

 విజ్ఞానంతోపాటు విలువలు నేర్పాలి 

విజ్ఞానం, వికాసం కోసమే విద్య కాకుండా దేశ సౌభాగ్యం కోసం ఉపయోగపడాలి. విలువలు లేని విద్య ఎంత మాత్రం మంచిది కాదు. విద్యా విధానం బలహీనంగా ఉంటే.. దీర్ఘ కాలంలో మొత్తం సమాజమే బలహీనపడుతుంది.  విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున. కేంద్ర-, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపటం లేదు. రెండింటి మధ్య సహకారం, సమన్వయం లోపించటంతో విద్య గాడి తప్పుతున్నది. దేశంలో ఒకే రకమైన విద్య అమలులో లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా సిలబస్, విద్యా సంవత్సర ప్రారంభం, విద్యా ప్రమాణాలు వేరువేరుగా ఉండటం వలన సార్వత్రిక విద్య విలువలతో కూడిన విద్యా బోధన దేశవ్యాప్తంగా ఒకే రకంగా జరగటం లేదు. విద్యార్థులకు విజ్ఞానం ఒక్కటే బోధిస్తే సరిపోదు. నైతిక ధర్మాలు,  సామాజిక బాధ్యతను అవి నేర్పగలగాలి.  అలాంటి సారం విద్యార్థులకు అలవాటుపడేలా పాఠ్యాంశాలు, బోధన పద్ధతులు రావాలి.  క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన పిల్లలకు అలవడేలా తల్లిదండ్రులను ఏదో  ఒకస్థాయిలో భాగస్వాములను చేయాలి. ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రుల మధ్య సమన్వయం నేడు ఎంతో అవసరం.  ప్రతివిద్యాలయాలలో మానసిక నిపుణులను లేదా  విలువలు నైతిక ధర్మాలపై శిక్షణ పొందినవారిని  ఉపాధ్యాయులుగా నియమించుకోవాలి.  ప్రతిరోజు పాఠశాలలో ఒక క్లాస్ విలువలు, నైతిక ధర్మాలుపైన బోధన చేయాలి.

వ్యాపారంగా విద్య 

ఒకప్పుడు విద్యా బోధన పవిత్ర వృత్తి.  ప్రస్తుతం పక్కా వ్యాపారంగా మారిపోయింది. లాభాపేక్షతోనే విద్యా సంస్థలను స్థాపించి అరకొర సదుపాయాలతో నడిపించటమే కాకుండా,  విద్య అర్హతలు లేనివారితో విద్యా బోధన చేయిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలు మరెన్నో.  అవి  పూర్తిగా లాభాపేక్షతోనే నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థలను నడిపినవారు అనతికాలంలోనే ఆర్థికంగా ఎదిగి రాజకీయనేతలుగా మారుతున్నారు. కొంతమంది స్వార్థపరులు విద్యను  ఆర్థికంగా,  రాజకీయంగా ఎదగటానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకొంటున్నారు. దీనిని నియంత్రణ చేయవలసిన అవసరం ఉంది.

విలువల విద్యపై పరిశోధనలు జరగాలి

మన దేశంలో కూడా విలువల విద్యపైన  పరిశోధనలు జరగాలి. విద్యకు ఖర్చు చేయటం అంటే భవిషత్  భరోసా ఇవ్వటమే కానీ మరోటి కాదు.  నైతిక విలువలతో కూడిన విద్యను  బోధించటానికి అవసరమైన పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాలు, శిక్షణ పొందిన అధ్యాపకులను అందుబాటులోకి తీసుకురావాలి. విలువలు మాత్రమే జాతిని నిర్మించగలవు.  వినయం లేని విద్యావంతుడు మృగం కంటే  ప్రమాదకరం అన్నారు డాక్టర్ అంబేద్కర్.  జీవితంలో విలువలు నేర్పించే విద్యే నిజమైన విద్య.  దేశం అభివృద్ధి చెందటం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.  పౌరుడి నైతిక అభివృద్ధినే నిజమైన దేశాభివృద్ధిగా భావించాలి. 

- డా. నాగుల వేణుయాదవ్, 
అసిస్టెంట్ ప్రొఫెసర్  నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండ