తక్షణ మార్పులతోనే విద్యావ్యవస్థకు ఊపిరి

తక్షణ మార్పులతోనే విద్యావ్యవస్థకు ఊపిరి

‘వందేమాతరం ఫౌండేషన్’ పేరుతో కొందరు ఒక గ్రూపుగా ఏర్పడి సీఎం స్వగ్రామం పరిసరాల్లోని కల్వకుర్తిలో ఓ సమగ్ర అధ్యయనశాల నడుపుతున్నారు. గతంలో ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ వంటి సంస్థల్లో కీలకంగా పనిచేసిన ఎన్​ గోవిందాచార్య వంటి పెద్దలు నార్త్​ ఇండియాలో నడుపుతున్న  సంస్థను పోలినట్లుగా ఈ వ్యవస్థ ఉంది. ఈ సంస్థ గణితంలో తయారుచేసిన ‘కార్డ్స్’ చాలా పరిశోధనాత్మకంగా ఉన్నాయి. ఇపుడు ఐఐటీ శిక్షణను నిర్ధారించే సామర్థ్యాలు వీటిలో ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ అధ్యయన కేంద్రంలో విద్యార్థులు తమపని తామే చేసుకుని ఏకకాలంలో ‘గురుకుల విద్య’ను అభ్యసిస్తున్నారు.

 పశుపోషణ, కోళ్లపెంపకం, వంటపని, వడ్రంగిపని, మొక్కలు పెంచడం, పాలు పితకడం వంటి నిత్య జీవనశైలి సమగ్రంగా, నైపుణ్యంతో ఆరవ తరగతి చదివే విద్యార్థి చేస్తున్నాడు. గాంధీజీ  వంటి వ్యక్తి ‘మరుగుదొడ్లు’ శుభ్రంచేసి ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ విద్యార్థులు తమ మరుగుదొడ్లు వాళ్లే శుభ్రం చేసుకుంటున్నారు. భాషలు నేర్చుకోవడం ఓ సబ్జెక్టుగా కాకుండా వీళ్లు మెరుగుపరిచిన ‘లాంగ్వేజ్​ ల్యాబ్స్’ ద్వారా చాలా సహజంగా భాష నేర్పించే విధానం ఉంది. ఇంత బాగా ఓ చిరుదీపంలాంటి చిన్న సంస్థ చేస్తుంటే ప్రభుత్వ వ్యవస్థలోని విద్యావిభాగం జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. 

చదువుకు నాలుగు స్తంభాలు

ఏ విద్యార్థి అయినా చదువు నేర్చుకోవాలంటే.. విద్యార్థి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం ఈ నాలుగు స్తంభాలు ముఖ్యం. గత బీఆర్​ఎస్​ సర్కారు పదేండ్లలో విద్య అంటే గురుకులాలనే పేరుతో కులవ్యవస్థను పెంచిపోషించింది. అందరూ కలిసి సమానంగా చదవాల్సిన చోట కులాలపేరిట విద్యను నేర్పడం వల్ల కలిసిమెలిసి జీవించేవిధానం ధ్వంసం అయ్యింది. మరోవైపు కార్పొరేట్​ కాలేజీలను అవుటర్​ రింగ్​రోడ్డు చుట్టూ పెంచి పోషించడం వల్ల అదొక ప్రత్యేక వ్యవస్థగా మారిపోయింది. దాని ప్రభావం వెంటనే కన్పించకపోవచ్చు. కానీ, వాళ్లంతా పెరిగి పెద్దవారైతే  సమాజంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందో రాబోయే రోజుల్లో చూస్తాం. 

ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులు ఆదర్శంగా నిలవాలి

చదువరులైన చాలామంది మన వ్యవస్థలో ఐఏఎస్​లను ఆదర్శంగా, నిజాయతీకి మారుపేరుగా భావిస్తారు. టీఎన్​శేషన్​లాంటి అధికారులు మనదేశంలో కొన్ని ఆదర్శాలను నిలబెట్టారు. ఇప్పుడు కూడా ఎందరో గొప్పవారు, ఆదర్శవంతులు ఉన్నారు. అత్యున్నత పరీక్ష సివిల్స్​లో ర్యాంకులు కొట్టి ఆ పదవిలోకి రావడం అందరూ గౌరవప్రదంగా భావిస్తారు. ఇటీవల వాళ్లకు రాజకీయ గ్రహణం పట్టింది. ఓ కలెక్టర్​ సాక్షాత్తు మీడియా ముందు సీఎం కాళ్లపై సాగిలపడ్డాడు. చాలామంది అధికారులు బలహీనులను ‘రూల్స్’ పేరుతో రకరకాల ఇబ్బందులను గురిచేస్తారు. ఆశ్రిత పక్షపాతంతో తమ పోస్టింగుల కోసం, రిటైరయ్యాక పదవుల కోసం కక్కుర్తితో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల వాళ్లపై గౌరవం తగ్గుతోంది. గత  బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో సోమేశ్​కుమార్,  ప్రభాకర్​రావు లాంటి ఐఏఎస్, ఐపీఎస్​అధికారులు చేసిన తప్పులు బయటపడుతుంటే ఇప్పుడు పదవిలో ఉన్నవారిని రేపటి తరం ఎలా గౌరవిస్తుంది? ప్రభుత్వాన్ని నడపాల్సినవారు ‘డిసెంట్​నోట్’ ఇవ్వకున్నా హితబోధ చేయకపోతే ఎలా? నాయకులతో కలిసి అరాచకాలు చేస్తే ప్రజలను ఎవరు కాపాడతారు? పాలనాధికారులు ప్రజలను వంచించడం ‘కంచె చేను మేసినట్లు’ కదా. 

విద్యా విలువలకు స్థానం ఉందా?

ఇక అత్యున్నతంగా చదువుకున్న పరిశోధకులైన శాస్త్రవేత్తలు మన కంటికి కనిపించరు. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణకు జరిగిన అన్యాయం చూశాక మనకు నిద్రపట్టలేదు.  డా. అబ్దుల్ కలాం తనపనిలో నిమగ్నమై పెండ్లి కూడా చేసుకోలేదు. ఇప్పుడు మనం ఇన్ని ఆధునిక సౌకర్యాలు అనుభవిస్తున్నాం అంటే ఎందరో శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టారు. అలాగే ఆర్మీలో ఎందరో గొప్పవారు దేశప్రజల భద్రత కోసం తమ ప్రాణాలు తృణపాయంగా వదిలేస్తున్నారు. పూర్వం ఎందరో నాయకులు, గొప్ప విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి ప్రకాశం పంతులులాగా తమ సర్వస్వం కోల్పోయారు. ఇప్పుడు రాజకీయం కార్పొరేట్​గా మారిపోయాక విద్యా విలువలకు స్థానం ఉందా? కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుని పార్లమెంట్​లో,  అసెంబ్లీలో ప్రశ్నలు అడిగినవారిని మనం చూశాం. వ్యవస్థ ఇలా దిగజారిపోయాక ఆదర్శాలు ఎవరు..ఎవరికి చెప్పాలి? శ్రేష్టులు ఆచరించే విధానమే అందరికీ ఆదర్శం కావాలి.

 ‘శ్రేష్టత’ రావాల్సింది విద్య నుంచే కదా.  అవినీతికి పాల్పడేవాళ్లు, అక్రమార్కులు ఎక్కువమంది ఉన్నత విద్యావంతులు అయినపుడు  తప్పులు చేసేవారికి ఏం బోధిస్తారు. అలాగే చక్కగా బోధించే గొప్ప ఉపాధ్యాయులు ఉన్నా వారి గురించి ఎవరూ చెప్పరు. కానీ, లక్షలాదిమందిలో ఎవరో ఒకరు చేసే తప్పును మొత్తం సమాజానికి ఆపాదిస్తారు. అలాగే మన ఉపాధ్యాయ వ్యవస్థను మొత్తం రకరకాల ఇబ్బందులకు గురిచేసి రోజూ వాళ్లుచేసే ఉద్యోగం గురించి కాకుండా వాళ్ల ఉద్యోగంలోని సమస్యలు చుట్టే తిరిగేట్లు చేస్తున్నారు. ప్రతిభను గణాంకాల్లో కొలిచే వ్యవస్థగా మార్చి నిజమైన విద్యను మిథ్యగా మార్చేస్తున్నారు. 

ప్రభుత్వ విద్యావ్యవస్థలో వింతలు

స్కూల్​ ఎడ్యుకేషన్​లో 22ఏండ్ల నుంచి సర్వీస్​ రూల్స్ సమస్య. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌–రష్యా యుద్ధానికైనా పరిష్కారం లభిస్తుందేమోకానీ, పంచాయతీరాజ్–ప్రభుత్వ టీచర్ల సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ప్రభుత్వం గట్టి చొరవ తీసుకుంటే క్షణాల్లో సమస్యకు జవాబు దొరుకుతుంది.  దీనికితోడు అనాలోచితంగా ఏర్పాటు చేసిన మల్టీజోన్ల వ్యవస్థ వల్ల, అవసరంలేని 317 జీవో వల్ల మరిన్ని కొత్త సమస్యలు మన విద్యావ్యవస్థలో సృష్టించబడ్డాయి. ఇంటర్​విద్యలో గత ప్రభుత్వం చేసిన సాఫ్ట్​వేర్​ తప్పిదాలకు విద్యార్థులే బలయ్యారు. ఇంటర్​, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు మరోవైపు యూజీసీ, ఇంకోవైపు ఉన్నత విద్యాశాఖ పెత్తనంతో వాటి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగ ఉంది. ‘దో స్త్’ పద్ధతి వల్ల జరుగుతున్న అడ్మిషన్లలో గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో విద్యార్థులు చేరడం లేదు. అలాగే వర్సిటీల్లో ఈ పదేండ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. మన ఓయూ, కేయూలు వాటి గ్రేడింగ్ ను కోల్పోతున్నాయి. ఈ తరుణంలో ఇక్కడి విద్యావ్యవస్థ మేలుకోరి ప్రభుత్వం సరైన వ్యక్తులను విద్యామిషన్​లో పెట్టుకోవాలి. విద్యను ప్రథమ ప్రాధాన్యతగా ప్రభుత్వం భావిస్తే ఈ రంగం బతికి బట్టకడుతుంది. 

విద్యా వ్యవస్థలో నిజాయితీ తేవాలి

ఇటీవల పాశ్చాత్య దేశాల ప్రభావంతో ర్యాంకులు ఒకవైపు,  పరుగెత్తే తల్లిదండ్రులు, పరుగెత్తించే విద్యాసంస్థలు ఒకవైపు ఉన్నాయి. మరోవైపు అరకొర వసతులతో చదువుకుని జీవితాంతం ‘విఫలయత్నం’తో మిగిలిపోయే వర్గం  మరోవైపు ఉంది.  ఆఖరుకు వీళ్లంతా వ్యవసాయం,  కార్మిక వ్యవస్థ, రియల్​ ఎస్టేట్​ బ్రోకర్లుగా, కూలీలుగా,  చిరుద్యోగులుగా మారుతున్నారు. దీనివల్ల సమాజంలోని ఓ పెద్దవర్గం విస్మరణకు గురి అవుతున్నది. మరీ ముఖ్యంగా  గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ బాధ్యత ఉండటం లేదు. దీనికి నిరక్షరాస్యత, విద్య విలువ గుర్తించకపోవడం, కుటుంబ పరిస్థితులు తదితర కారణాలు కనిపిస్తున్నాయి. సామాజిక వ్యవస్థలో నిజాయతీ లేకపోవడం, వ్యవస్థలోని లోపాలు ప్రతి మనిషిని అశాంతిలో ముంచుతున్నాయి.  అయితే నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా కొందరు మాత్రమే తీర్చిదిద్దబడుతున్నారు. ఎక్కువమంది సమాజం బరువుగా భావించేవిధంగా తయారు కావడానికి కారణం మన విద్యావ్యవస్థలోని లోపాలే. 

చదువు కొంటున్నారు

భౌతికంగా తెలంగాణ ఏర్పడ్డా ఇతర ప్రాంతాలవారి విద్యాసంస్థలే ఇప్పటికీ హైదరాబాద్​లో రాజ్యమేలుతున్నాయి. అవుటర్​ రింగ్​రోడ్​ చుట్టూ సాయంత్రం మనం ప్రయాణం చేస్తే సుమారు 50కిపైగా కార్పొరేట్​ విద్యాసంస్థలు జిగేల్​మనే లైట్ల వెలుగులో కన్పిస్తాయి. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్లను నియంత్రణలో పెట్టలేదు. వాళ్లకు అద్దె భవనాలు ఇచ్చిన నాయకులే  వాళ్లకు రక్షణ కవచంలా నిలబడుతున్నారు. చిన్న చిన్న విద్యాసంస్థలను రచ్చకీడ్చే మీడియా వారిని ఏమీ అనదు. రోజూ విద్యావ్యవస్థపై లెక్చర్లు దంచే ప్రముఖ విద్యావేత్తలు వారిగురించి నోరెత్తరు.  అలాగే మెడికల్​ కాలేజీలు, ఇంజినీరింగ్​ కాలేజీల వ్యాపారం అందరికీ తెలుసు. 

- డాక్టర్​పి. భాస్కర యోగి, సోషల్ ఎనలిస్ట్​