రాష్ట్రంలో విద్య బకాయిల్లో కూరుకుపోయింది. ఇంటర్ నుంచి ఇంజనీరింగ్, పీజీ, పీహెచ్డీ వరకు ప్రభుత్వం సకాలంలో ఫీజు రియింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివిధ కాలేజీలు స్టూడెంట్లను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళితే. ఫీజు రియింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో చాలా వరకు విద్యార్థులు, ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. 2020–--21 విద్యా సంవత్సరానికి దాదాపు 3,350 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు15 లక్షల మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన రియింబర్స్మెంట్ ఇంతవరకు కూడా విడుదల చేయలేదు. 2022–--23 విద్యా సంవత్సరానికి రియింబర్స్మెంట్దరఖాస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆయా కాలేజీల్లో చేరిన షెడ్యూలు కులాలు,షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు కాలేజీ యాజమాన్యాల వేధింపులకు గురి అవుతున్నారు.
చేతి నుంచి ఫీజు కట్టాల్సిందే..
విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో చదివే స్టూడెంట్లకు సకాలంలో ఫీజు రియింబర్స్మెంట్రాకపోవడంతో, చేతి నుంచి ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ అంటున్నారు. దీంతో వారు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రంగా సతమతమవుతున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలకు సర్టిఫికెట్స్ అవసరం కావడంతో దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు అప్పుతెచ్చి మరీ కళాశాలలకు ఫీజులు చెల్లిస్తున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నా సర్కారు మాత్రం ట్యూషన్ ఫీజులు, రియింబర్స్మెంట్ఇవ్వకుండా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. దీంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. కొన్ని కళాశాలల్లో, ఫీజులు చెల్లిస్తేనే, పరీక్షలకు అనుమతిస్తామని విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారు.
టోకెన్ల జారీతోనే సరి...
రియింబర్స్మెంట్మంజూరు చేసి ముందుగా టోకెన్లు జారీ చేస్తారు. ఆ తర్వాత విద్యార్థుల బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది. కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించి టోకెన్లు జారీ చేసి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. అదేంటని విద్యార్థులు అధికారులను ప్రశ్నిస్తే, త్వరలోనే ఖాతాలో నగదు జమ అవుతుందని బదులిస్తూ దాటవేస్తున్నారు. విద్యార్థులు నెలల తరబడి సంక్షేమ శాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది. నిధుల విడుదలకు ఇంకా ఎంత సమయం పడుతుందని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వాయిదాల పద్ధతిలో మార్గదర్శకాలు తీసుకొచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం ఏడాది ముగిసే సరికి 25 శాతం చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఈ విధానానికి కూడా ప్రభుత్వం మంగళం పాడింది అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు దాదాపుగా రెండు సంవత్సరాల కాలం నుంచి కాస్మోటిక్ చార్జెస్ కూడా చెల్లించలేదు. అంతేకాకుండా సంక్షేమ హాస్టల్స్ కు చెల్లించాల్సిన బిల్లులు కూడా ప్రభుత్వం సమయానికి చెల్లించకపోవడంతో వార్డెన్లు, కాంట్రాక్టర్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అందుకే హాస్టళ్లలో నాణ్యత లేని భోజనాలతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో విద్య ‘బకాయిల విద్య’ గా మారింది. బడ్జెట్లో విద్యకు కేటాయింపే నామమాత్రం. వాటిని కూడా ఖర్చు చేస్తున్న జాడలేదు. విద్యకు కేవలం7.30 శాతం నిధులు కేటాయించారు. విద్యకు బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలోనే తెలంగాణ (22వ స్థానం) అట్టడుగున ఉండటం చూస్తే.. విద్యపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నది.
- సిలివేరు అశోక్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు