పటిష్టమైన విద్య కోసమే విద్యా కమిషన్

పటిష్టమైన విద్య కోసమే విద్యా కమిషన్
  • విశ్వేశ్వరావుకు ఎమ్మెల్సీ కోదండరాం సన్మానం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత పదేండ్లుగా అస్తవ్యస్తంగా మారిన విద్యా విధానాన్ని పటిష్టమైన పద్ధతిలో నడిపించడానికే ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసిందని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.  విద్యా కమిషన్ మెంబర్ గా  తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్  విశ్వేశ్వరరావు  నియామకం కమిషన్ కే  గౌరవమని పేర్కొన్నారు. సోమవారం నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీస్ లో పార్టీ నేతలు.. పీఎల్ విశ్వేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులు చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు సముచిత న్యాయం కల్పించే లక్ష్యంతో విద్యా కమిషన్ పనిచేయాలని సూచించారు.

పీఎల్  విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యారంగంలో తనకున్న 40 ఏండ్ల అనుభవాన్ని ఉపయోగించి ఉన్నత విద్యలో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు.  పార్టీ ఏర్పడిన నాటి నుంచి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కోదండరాం  నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేశామని  తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కోదండరాం  కృషి చేస్తున్నారని, విద్యా కమిషన్ ఏర్పాటులో కోదండరాం  కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం. నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేశ్, గోపగాని శంకర్రావు, పల్లె వినయ్ గౌడ్, ఆశప్ప, రమేశ్ ముదిరాజ్, సర్దార్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.