సదువు సక్కగవ్వాలంటే..సర్కారీ స్కూళ్లు మారాలే

సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలు తొలగించేలా పాలనా విధానాలు ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 71 ఏండ్లు గడిచినా అంతరాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఈ తేడాలను తగ్గించే సాధనం చదువే. దేశంలోని బాలలందరికీ ఒకే రకమైన చదువును ఒకే చోట అందినప్పుడే అసమానతలు తొలగిపోతాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన ప్రకారం రాష్ట్రంలోని బాలలందరూ ఒకే రకమైన బడుల్లో చదువుకునేలా చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. ఇలా జరగాలంటే ముందుగా ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లు డెవలప్​ కావాలి. ఈ దిశగా ఇకనైనా అడుగులు పడాలి.

స్కూల్​ ఎడ్యుకేషన్​ కోసం ఇన్నోవేటివ్​ స్కీమ్​ను తీసుకొస్తున్నామని బడ్జెట్​ను ప్రవేశపెట్టే సమయంలో మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. 2021–-22 బడ్జెట్ లో రూ.2 వేల కోట్లు, 2022–-23 బడ్జెట్ లో మరో రూ.2 వేల కోట్లతో స్కూల్​ ఎడ్యుకేషన్​ను డెవలప్​ చేస్తామన్నారు. ఈ స్కీమ్​ విధివిధానాలు రూపొందించటానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్​రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కమిటీ వేసినట్లు తెలిసినది. ఈ పథకాన్ని కౌన్సిల్​లో నేను స్వాగతించాను. అయితే ఈ పథకం అమలులో కొన్ని కీలక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఒక ప్రణాళిక ప్రకారం ఈ స్కీమ్​ను అమలు చేస్తే రేపటి పౌరుల బంగారు భవిష్యత్​కు బాటలు పడతాయి.

ప్రైవేటులో 32 లక్షలు.. సర్కారులో 27 లక్షలు

2019-–20 యుడైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 40,901 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో 10,503 ప్రైవేటు స్కూళ్లు. వీటిలో 32,24,852 స్టూడెంట్లు ఉన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే 30,398 బడుల్లో 27,00,921 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లంటే.. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, ఐదు రకాల రెసిడెన్షియల్ స్కూల్స్, తాత్కాలిక నివాస ప్రాంత స్కూల్స్ మొదలైనవి. 20 ఏండ్లుగా సర్కారీ స్కూల్స్ లో స్టూడెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రైవేటు స్కూళ్లలో స్టూడెంట్లు క్రమంగా పెరుగుతున్నారు. తెలంగాణ ఏర్పడిన ఈ ఏడేండ్లలో కూడా ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్ల సంఖ్య తగ్గుతూనే ఉంది. కొత్తగా 600కుపైగా గురుకులాలను ప్రారంభించినా మార్పు రాలేదు. 6 నుంచి 10వ తరగతి వరకు స్టూడెంట్ల సంఖ్యలో కొద్దిగా పెరుగుదల కనిపించినా, 1 నుంచి 5 తరగతుల వరకు వేగంగా తగ్గుతోంది.

భారమైనా ప్రైవేటుకే పంపుతున్నరు

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, మండల పరిషత్ యాజమాన్యంలోనే 18,230 ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1,467 ప్రైమరీ స్కూల్స్, 297 ఎయిడెడ్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వ నిధులతో నడిచే ప్రైమరీ స్కూల్స్ 19,984 ఉన్నా, 1 నుంచి 5 వరకు చదివే స్టూడెంట్లలో 60 శాతానికిపైగా ప్రైవేటు బడుల్లోనే ఉన్నారు. కొత్తగా విస్తరిస్తున్న నగరాలు, పట్టణాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైమరీ బడులు నివాస ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇంటి పక్కన ప్రభుత్వ బడి ఉన్నా, సంపాదనలో అధిక భాగం వెచ్చించి దూరంగా ఉన్న ప్రైవేట్​ బడికి పిల్లలను పంపుతున్న దిగువ ఆదాయ వర్గాల పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈ పరిస్థితికి కారణాలను విశ్లేషించుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ ‘ఇన్నోవేటివ్​ స్కీమ్’ ఎలా ఉండాలో నిర్ణయించుకోవచ్చు. 

ప్రభుత్వ బడుల డేటా తెప్పిస్తున్న అధికారులు

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి. క్లాస్ రూమ్ ల రిపేర్లు, టాయిలెట్స్, ప్రహరీ గోడలు, ఫర్నిచర్ మొదలైన వివరాలను మార్చి చివరి వారం నుంచి అధికారులు తెప్పిస్తున్నారు. హెడ్​మాస్టర్లు పంపిన సమాచారాన్ని ఎంఈవోలు 50 శాతం, డీఈవోలు 20 శాతం క్రాస్ చెక్ చేయాలని ఆదేశించారు. ఈ డేటాను క్రోడీకరించి, ఈ ఏడాది కేటాయించే రూ.2 వేల కోట్లతో క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, ప్రహరీ గోడలు నిర్మించి, ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే పేరెంట్స్ తమ పిల్లలను వెంటనే సర్కారు బడుల్లో చేర్పిస్తారా? నా అనుభవం ఇది సాధ్యం కాదనే చెపుతోంది. రాష్ట్రంలో 80 శాతం మంది పేరెంట్స్ తమ పిల్లలను మూడేండ్లు నిండగానే కిండర్​ గార్డెన్(కేజీ)లో చేర్పిస్తున్నారు. అందు వల్ల ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో కేజీ తరగతులు, ఇంగ్లీష్​ మీడియం సమాంతరంగా ప్రారంభించాలి. కేజీ క్లాసుల కోసం అదనపు టీచర్లను నియమించాలి. ఇలా చేరే స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం, దుస్తులు అందించడంతోపాటు  స్త్రీ–మహిళా సంక్షేమ శాఖ నుంచి మూడేండ్ల నుంచి ఆరేండ్ల మధ్య వయసు గల పిల్లల సంఖ్య ఆధారంగా బడ్జెట్ ను విద్యా శాఖకు బదిలీ చేయాలి.

కొత్తగా ప్రభుత్వ స్కూళ్లు పెట్టాలి

గత 20 సంవత్సరాల నుంచి అర్బనైజేషన్  వేగం పెరిగింది. ఈ క్రమంలో నగరాలు, పట్టణాల్లో జనాభా పెరుగుతోంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వ బడులను ప్రారంభించలేదు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో కొత్తగా ఏర్పడిన బస్తీల్లో ప్రభుత్వ స్కూళ్లను ఏర్పాటు చేయాలి. నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్ పట్టణాల్లో కూడా కొత్తగా ఏర్పడిన బస్తీల్లో బడులను పెట్టాలి. ఎయిడెడ్ స్కూళ్లన్నీ నగరాలు, పట్టణాల్లోనే ఉన్నాయి. 2004 నుంచి ఎయిడెడ్ విద్యా సంస్థల్లో టీచర్ల పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఈ స్కూళ్లలో చదివే స్టూడెంట్ల నుంచి ట్యూషన్ ఫీజు వసూలు చేసి ప్రైవేటుగా టీచర్లను నియమిస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలో టీచర్​ పోస్టులను భర్తీ చేయటానికి అనుమతించాలి. మేనేజ్​మెంట్లు అంగీకరిస్తే ఎయిడెడ్ స్కూళ్లను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలి. హైదరాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఇది ఎంతో అవసరం. హైస్కూళ్లలో తెలుగు, ఇంగ్లీష్​ మీడియంను సమాంతరంగా అమలు చేయాలి. కంప్యూటర్ ఎడ్యుకేషన్​ను కూడా ప్రవేశపెట్టాలి. లైబ్రరీలను అభివృద్ధి చేయాలి. లైబ్రరీలు లేని స్కూళ్లలో వాటిని ఏర్పాటు చేయాలి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో నాన్​ టీచింగ్ సిబ్బందిని ఎన్​రోల్​మెంట్​కు అనుగుణంగా నియమించాలి.

స్కీమ్​ అమలుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలి

సంక్షేమ పథకాల అమలు ప్రకారం రాష్ట్రంలో 77 శాతం కుటుంబాలకు కిలో రూపాయి బియ్యం అందుతున్నాయి. ఈ కుటుంబాలన్నీ పావర్టీ లైన్​కు దిగువన ఉన్నాయి. 23 శాతం కుటుంబాలు మాత్రమే పావర్టీ లైన్​కు ఎగువన ఉన్నాయి. ఈ 23 శాతం కుటుంబాలకు తమ పిల్లలను ఫీజులు చెల్లించి ప్రైవేటు స్కూల్స్​లో చదివించే స్తోమత ఉంటుంది. అయితే రాష్ట్రంలో 53 శాతం కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చదివిస్తున్నాయి. అంటే 30 శాతం కుటుంబాలు తగిన ఆదాయం లేకున్నా ప్రైవేటు బడుల్లో పిల్లలను చదివిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తే పేరెంట్స్​పై ఫీజుల భారం తగ్గుతుంది. అలాగే ఇన్నోవేటివ్ స్కీమ్​ అమలుపై ముసాయిదా విడుదల చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. వీటన్నింటినీ సమీక్షించి మెరుగైన పద్ధతిలో స్కీమ్ ను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
                                                                           - అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ
గ్రేటర్​ హైదరాబాద్​ను ప్రత్యేకంగా చూడాలె

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోకి హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్​గిరి, రంగారెడ్డి జిల్లాలు వస్తాయి. ఈ మూడు జిల్లాల్లోనే 21,10,408 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. మిగిలిన 30 జిల్లాల్లో 39 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారు. పై మూడు జిల్లాల్లోని ప్రభుత్వ బడుల్లో 4,67,649 మంది స్టూడెంట్లు ఉంటే, ప్రైవేటు స్కూళ్లలో 16,42,759 మంది స్టూడెంట్లు ఉన్నారు. అంటే 78 శాతం ప్రైవేటులోనే చదువుకోవలసిన దుస్థితి ఏర్పడినది. ప్రభుత్వ బడుల్లో స్టూడెంట్ల ఎన్​రోల్​మెంట్​ ఎక్కువగా ఉన్న స్కూళ్లు కూడా గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. అయితే గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ బడులు తక్కువగా ఉన్నాయి. 2011 సెన్సెస్​ ప్రకారం, హైదరాబాద్​ జిల్లా జనాభా 39,43,323, ప్రభుత్వ బడులు 690, ఎయిడెడ్ స్కూళ్లు 245 ఉన్నాయి. మేడ్చల్–మల్కాజ్​గిరి జిల్లా జనాభా 24,40,074, ప్రభుత్వ బడులు 562, రంగారెడ్డి జిల్లా జనాభా 24,46,269, ప్రభుత్వ బడులు 1,463 ఉన్నాయి. అదే వికారాబాద్​ జిల్లా జనాభా 9,27,140, ప్రభుత్వ బడులు 1,117, నారాయణ పేట జిల్లా జనాభా 5,66,874, ప్రభుత్వ బడులు 534, నల్గొండ జిల్లా జనాభా 16,18,416, ప్రభుత్వ బడులు 1,663, వరంగల్ అర్బన్ జిల్లా జనాభా 10,80,867, ప్రభుత్వ బడులు 609, వరంగల్ రూరల్ జిల్లా జనాభా 7,18,537, ప్రభుత్వ బడులు 726 ఉన్నాయి. 

మండలం యూనిట్​గా బడులను డెవలప్​ చేయాలె

రాష్ట్రంలోని 19,984 సర్కారు ప్రైమరీ స్కూళ్లలో ఒకేసారి కేజీ క్లాసులు, ఇంగ్లీష్​ మీడియం ప్రవేశపెట్టడం సాధ్యం కాకపోవచ్చు. మండలం యూనిట్ గా జనాభా అధికంగా ఉన్న మండలాల్లో 20 బడులు, మధ్యస్తంగా ఉన్న మండలాల్లో 15 స్కూల్స్, తక్కువ జనాభా ఉన్న మండలాల్లో 10 బడులు చొప్పున పది వేల ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేసి తొలుత అభివృద్ధి చేయాలి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలో పది వేల ప్రైమరీ స్కూల్​ హెడ్​ మాస్టర్ల పోస్టులు సృష్టించి, సెకండరీ గ్రేడ్​ టీచర్లకు ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 4,300 ప్రైమరీ స్కూళ్లలో హెడ్​ మాస్టర్​ పోస్టులు ఉన్నాయి. ఇంకా 5,700 హెచ్ఎం పోస్టులు మంజూరు చేస్తే సరిపోతుంది. వీటి ఎంపికలో అన్ని మేనేజ్ మెంట్ల స్కూల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇన్నోవేటివ్​ స్కీమ్​ ద్వారా చేసే అభివృద్ధి ఈ ఎంపిక చేసిన ప్రైమరీ స్కూళ్లలోనే జరగాలి. ఒక్క ఏడాదిలోనే పది వేల బడులను అభివృద్ధి చేయడం సాధ్యం కాకపోతే, 2021-22లో ఐదు వేలు, 2022-23లో మరో ఐదు వేలు స్కూళ్లను ఎంపిక చేసి అభివృద్ధి చేయాలి.