యంగ్ ఇండియాతో విద్యాభివృద్ధి

యంగ్ ఇండియాతో విద్యాభివృద్ధి

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని వాటిని మరింతగా బలోపేతం చేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఇటీవల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యంగ్ ఇండియా అనేది తన బ్రాండ్ అని మహాత్ముడి స్ఫూర్తితోనే ముందుకు వెళ్తున్నామని చెప్పడం సంతోషకరమైన పరిణామం. యంగ్ ఇండియా బ్రాండ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో  యంగ్ ఇండియా  సమీకృత గురుకులాల ఏర్పాటుకు చర్యలు చేపట్టడం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మొదలగునవి నిర్దిష్ట ప్రణాళికతో ఏర్పాటు చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.  2023 డిసెంబర్​లో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగంలో సమూలమైన మార్పులు, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా పేరుకుపోయిన ఉపాధ్యాయుల, విద్యావిషయక సమస్యల పరిష్కారంలో ఉపాధ్యాయులను, అధికారులను సమన్వయపరచి చాకచక్యంగా పరిష్కరించడం జరిగింది. 

మెరుగైన విద్యా వ్యవస్థకు రూపకల్పన

తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ఇటీవల విద్యాభివృద్ధిపై ఐసీసీసీలో జరిగిన సమావేశంలో ముఖ్య మంత్రి విద్యా కమిషన్​ను ఆదేశించడం విద్యావ్యవస్థలో రానున్న మార్పులకు దర్పణం పడుతోంది.  తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్  ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ద్వారా పాఠశాలల్లో విద్యుత్, మరుగుదొడ్డి, మంచినీరు మొదలగు కనీస వసతుల కల్పనకు లక్షలాది రూపాయలు కేటాయించింది. పాఠశాలల్లో పారిశుద్ధ్యం ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో ఉపాధ్యాయుల కోరిక మేరకు ప్రభుత్వం పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులను నియమించింది. అదేవిధంగా పాఠశాలల్లో పేరుకుపోయిన వేలాది రూపాయల కరెంటు బిల్లులను రద్దుచేసి పాఠశాలలకు ఉచిత విద్యుత్ కల్పించడంతో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉపశమనం కలిగినట్లయింది.

పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేయాలి

దశాబ్ద కాలంగా తెలంగాణలో నిలిచిపోయిన ఉపాధ్యాయ నియామకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం దాదాపు 11 వేల ఉపాధ్యాయ ఖాళీలను ప్రకటించి భర్తీకి పూనుకుంది. 2024 జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీని ఆన్ లైన్​లో నిర్వహించి సెప్టెంబర్ 30న మెరిట్ లిస్టు విడుదల చేయటం, అక్టోబర్ మాసంలో నియామక పత్రాలు ఇవ్వడంతో కేవలం నాలుగు మాసాల సమయంలోనే ప్రక్రియను ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముగించింది.  తెలంగాణలోని సంక్షేమ వసతి గృహాల్లో ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలను భారీగా పెంచడంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు రూ.950గా ఉన్న డైట్ చార్జీలను రూ.1330 కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.1100 నుంచి రూ. 1540కి పెంచారు.

 ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 నుంచి రూ. 2100 పెంచారు. మూడు నుంచి ఏడవ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ. 55గా ఉన్న కాస్మోటిక్ చార్జీలను రూ.175 కు పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ.275కు పెంచారు. తెలంగాణ రాష్ట్రంలో  సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీలను పెద్ద మొత్తంలో పెంచడంతో పేద విద్యార్థులకు మేలు చేకూరింది.  ప్రభుత్వం తగిన పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటుచేసి వ్యవస్థను గాడిలో పెట్టాలి.  ప్రభుత్వం అన్ని పాఠశాలలను ఒకే గొడుగు కిందికి తెచ్చి కామన్ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలి.  మెరుగైన విద్యను అందించడానికి మండలాలు, జిల్లాలలో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈవో, డీఈవో  పోస్టులను మంజూరు చేసి, న్యాయపరమైన ఆటంకాలను అధిగమించి రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి,
ప్రధానోపాధ్యాయుడు