నిరంతర సర్వేలతో.. విద్యా ప్రమాణాలు మెరుగయ్యేనా?

నిరంతర సర్వేలతో.. విద్యా ప్రమాణాలు మెరుగయ్యేనా?

రాష్ట్రంలోని  విద్యార్థుల్లో  తెలుగు, గణితం, ఆంగ్లం సబ్జెక్టుల్లో అభ్యసన సామర్థ్యాలను మూల్యాంకనం చేయడానికి రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధనా సంస్థ ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జిల్లాకు 50 పాఠశాలల్లో సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా  రెండో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి అంచనా వేస్తారు. 

అలాగే,  ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో ఫౌండేషనల్ లిటరసీ,  న్యూమరసీ,  భాష, గణిత భావనల్లో విద్యార్థుల ప్రమాణాలను అంచనా వేస్తారు. ఈ సర్వే ఫలితాలను బట్టి  విద్యా సంస్కరణలను తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అసర్ విద్యా నివేదిక- 2025 విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు లేవని,  ఎనిమిదో తరగతి విద్యార్థి కూడా మూడో తరగతి తెలుగు పుస్తకాన్ని చదవలేకపోతున్నాడని,  చిన్నపాటి గణిత సమస్యలను చేయలేకపోతున్నారని తెలిపింది. 

 96 శాతం మంది విద్యార్థుల్లో ఆలోచనాశక్తి, క్రియేటివిటీ పూర్తిగా లోపించింది.  కేంద్ర ప్రభుత్వం చేసే నేషనల్ అచీవ్​మెంట్ సర్వే కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపింది.  అంతేకాకుండా  పాఠశాలల పనితీరు ఇండెక్స్ 2021 నివేదిక  ప్రకారం తెలంగాణ రాష్ట్రం దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 36 స్థానాలకుగాను 31వ స్థానంలో ఉంది.  అంటే  కింది నుంచి ఆరో స్థానంలో నిలిచింది.  

612 మండలాలకుగాను 596 మండలాల్లో మండలి విద్యాధికారి (ఎంఈఓ) పోస్టులు ఖాళీగా ఉండగా ,  66 పోస్టులకుగాను 64  డిప్యూటీ విద్యాధికారి పోస్టులు , 33 జిల్లాలకుగాను 26  డీఈవో పోస్టులు ఖాళీలు ఉండి విద్యాపాలన  కుంటుపడింది  పర్యవేక్షణ పడకేసింది. ఫలితంగా ఉపాధ్యాయుల పనితీరు, బోధన , హాజరు , మధ్యాహ్న భోజనం, యూనిఫారాలు వంటి అంశాలను పర్యవేక్షించే అవకాశం లేదు.  

ఉన్నత పాఠశాలలో ప్రతి సబ్జెక్టులో బోధనను తరగతి గదిలో మూల్యాంకన చేసే డిప్యూటీ విద్యాధికారి పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో ఆరు నుంచి 10 తరగతుల బోధనను పర్యవేక్షణ చేసే వ్యవస్థ చేష్టలుడిగింది. సబ్జెక్టు టీచర్ల కొరతతో బోధన జరగడం లేదు.  

నామమాత్రంగా ఉపాధ్యాయ శిక్షణ

విద్యాహక్కు చట్టం ప్రకారం అకడమిక్ అథారిటీగా ఉన్న రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ (ఎస్సీఈఆర్టీ ) ఉపాధ్యాయులకు వృత్తిపరమైన శిక్షణ, విద్యా లక్ష్యాలు, బోధన విధానాలు, విద్యా ప్రణాళిక రూపకల్పన, పాఠ్యపుస్తకాల రచన, నూతన మూల్యాంకన పద్ధతుల పై పరిశోధన, అకడమిక్  క్యాలెండర్ రూపొందించడం చేస్తోంది.

 కానీ, అందులోని 44 ప్రొఫెసర్ పోస్టులు, 33 అధ్యాపక పోస్టులు ఖాళీ.  భావి ఉపాధ్యాయులను తయారుచేసే బీఈడీ కళాశాలలు, డైట్ కళాశాలల్లోని అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉపాధ్యాయ శిక్షణ నామమాత్రమైంది. నామమాత్రమైన ఉపాధ్యాయ శిక్షణతో రూపొందిన ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలు కూడా నాసిరకంగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి.  

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు వద్దు

 కస్తూరిబా పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా తక్కువ వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేవారు ఉండడం గమనార్హం. వీరందరికీ ‘సమాన పనికి సమాన వేతన విధానం’ వర్తించదు.  ఇది విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలలో విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడం వలన మాధ్యమిక, ఉన్నత స్థాయిలో కూడా ప్రమాణాలు అదేస్థాయిలో ఉంటాయి.  

ప్రాథమిక స్థాయిలో 18 సబ్జెక్టులను ఒకరు లేదా ఇద్దరు టీచర్లు బోధించడం వలన విద్యా ప్రమాణాలు ఆశించినంతగా సాధ్యం కాదు.  ప్రాథమిక బడుల్లో ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్న విషయం విద్యా ప్రమాణాల సాధనకు కీలకమైన అవరోధం.  ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధన ప్రక్రియలో నిమగ్నం కావాలి. 

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు లేని వ్యవస్థను రూపొందించాలి.  ఉపాధ్యాయుల  తరగతి గది బోధనను రెగ్యులర్​గా  ఏకరూప పర్యవేక్షణ విధానాన్ని రూపొందించాలి.  1,002 గురుకుల పాఠశాలల్లో 750 పాఠశాలలకు సొంత భవనాలు లేవు. ప్రభుత్వ /జిల్లా పరిషత్ పాఠశాలలకు మౌలికవసతుల కొరత తీర్చడం జరగాలి.  

తెలంగాణ విద్యా కమిషన్ కూడా క్షేత్ర స్థాయిలోని సమస్యలపై దృష్టిసారించాలి.  విద్యాశాఖ నిర్వహణలో పాఠశాలలన్నిటిని తెచ్చి,  విద్యా పాలన,  పర్యవేక్షణ ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.   10వేల  ప్రైవేట్ పాఠశాలల్లో 36.7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి చదువుల సామర్థ్యాన్ని కూడా విద్యా శాఖ పర్యవేక్షణలో జరిగితే విద్యా సామర్థ్యాలల్లో మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. 

జవాబుదారీతనంతో పర్యవేక్షించాలి

క్షేత్రస్థాయిలోని కారణాలపై నిర్మాణాత్మక సూచనలతో కూడిన సిఫార్సులను చేయాల్సిన విద్యా కమిషన్ ఇటీవలనే ఒక మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.  ఇందులో మండలానికో పాఠశాల,  రెండు.. మూడు ఉన్నత పాఠశాలలో స్థాపించాలని సిఫార్సు చేసింది అంటే పటిష్టమైన పర్యవేక్షణతో జవాబుదారీతనంతో ఉపాధ్యాయులు బోధించే అకడమిక్ వాతావరణం కల్పించే విధంగా పర్యవేక్షణాధికారుల పోస్టులు భర్తీ చేయాలని విద్యా కమిషన్ సూచనలు ఇవ్వాల్సింది. 

అందుకు బదులుగా 26 వేల ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలను గాలికి వదిలి రాష్ట్రంలోని ప్రతి మండలంలో మూడు తెలంగాణ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లు.. నాలుగు తెలంగాణ ఫౌండేషనల్‌‌‌‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్‌‌‌‌ సిఫారసు చేసింది.  

 కొత్త సర్కారు ఉన్న పాఠశాలలను గాలికి వదిలి కొత్తగా యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ప్రారంభించడానికి 11 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి  ఉత్తర్వులు జారీ చేసింది.   రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ,  జిల్లా పరిషత్ పాఠశాలకు తోడుగా 1,002 గురుకులాలు 6 రకాల యాజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆదర్శ పాఠశాలలు, కస్తూరిబా విద్యాలయాలు కూడా ఉన్నాయి. 

- కె. వేణుగోపాల్, పూర్వ అధ్యక్షుడు, ఏపీటీఎఫ్-