విద్యా వలంటీర్లు కూలీలైతున్నరు

కరోనా మహమ్మారి కారణంగా విద్యా వలంటీర్ల బతుకులు ఆగమవుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు రాక.. కుటుంబ పరిస్థితుల కారణంగా విద్యా వలంటీర్లుగా పని చేస్తున్న వేలాది మంది బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. కరోనా వల్ల స్కూళ్లు మూతపడటంతో వీరికి ఏడాదికిపైగా జీతాలు అందడం లేదు. దీంతో దొరికిన పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొందరు ఉపాధి కూలీలుగా మారుతుంటే.. మరికొందరు చేతి వృత్తులను మళ్లీ చేసుకుంటూ జీవితం గడుపుతున్నారు. 
12 వేల గౌరవ వేతనంతో బతుకుతున్నరు
బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయని.. అప్పుడు మంచిగా బతకవచ్చని తల్లిదండ్రులు చెప్పిన మాటలతో రాత్రనకా పగలనకా కష్టపడి డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన వారు లక్షల్లో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నియామకాలను చేపట్టకపోవడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొందరు విద్యా రంగంపై ఉన్న మక్కువతోనో.. లేదా అనుభవం వస్తుందనో ప్రభుత్వ బడుల్లో విద్యా వలంటీర్లుగా చేరారు. ఏటా ప్రభుత్వం నిర్వహించే పోటీలో ఎన్నికై స్టూడెంట్ల భవిష్యత్​ను తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా పని చేస్తూ కేవలం నెలనెలా రూ.12,000 గౌరవ వేతనంతో కుటుంబాలను పోషిస్తున్నారు. డీఎస్సీ, గ్రూప్స్,​ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పుడు పడతాయో అని ఎదురుచూస్తున్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వీరిని ఆవేదనకు గురిచేస్తోంది. 
ఆత్మహత్యలు చేసుకుంటున్నరు
ఇలాంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా గత ఏడాది మార్చి నుంచి కరోనా వైరస్ విజృంభణతో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. అప్పటి వరకూ ఏదోలా విద్యా వలంటీర్ల కుటుంబాలు పూట గడిపినా.. 14 నెలల కాలం నుంచి వారి బతుకులు బజారులో పడ్డాయి. ఆకలిబాధ, ఆవేదనతో ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన పాలకూరి శైలజ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన తొడసం రామస్వామి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసిఫాబాద్ జిల్లా రుద్రపూర్ గ్రామానికి చెందిన బొర్కూటి బండు అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్​మెంట్​ చేయించుకోవడానికి డబ్బులు లేక ప్రాణాలు విడిచాడు. ఇలా ప్రభుత్వ బడుల్లో విద్యా వలంటీర్స్ గా పని చేసేవారు ఆవేదనతో ఆత్మహత్యలు, ఆకలిచావులకు బలైపోతున్నారు. ఇంత జరుగుతున్నా విద్యా వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు వారి కష్టాల గురించిన సోయి కూడా ప్రభుత్వానికి గానీ, పాలకులకు గానీ ఉన్నట్టుగా కనిపించడం లేదు.
సర్కారీ టీచర్లతో సమానంగా పని
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ స్కూళ్లలో 13,000 నుంచి 14,000 వరకు విద్యా వలంటీర్స్ పని చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వ టీచర్లతో సమానంగా స్కూల్​ స్టూడెంట్లకు చదువును అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరతను తీర్చుతూ.. కేవలం గౌరవ వేతనంతోనే వీరంతా పని చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అలవెన్స్ లు ఆశించకుండా ఎన్నో ఏండ్లుగా పని చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం రాదా అనే ఆశతో జీవితంతో పోరాటం చేస్తూనే ఉన్నారు విద్యా వలంటీర్లు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా డిగ్రీ, పీజీ వంటి పెద్ద చదువులు చదివిన వారే.. ఉపాధ్యాయ శిక్షణ, టెట్ అర్హతను పొంది కాస్తలో టీచర్​ ఉద్యోగాలను చేజార్చుకున్న నిరుద్యోగులే వీరంతా. ఇకనైనా ప్రభుత్వ నోటిఫికేషన్ రాకపోదా.. డీఎస్సీ వేస్తే తమకు ప్రయారిటీ వస్తుందని వలంటీర్లు ఎదురుచూస్తున్నారు. ఇటాంటి పరిస్థితుల్లో ఏటా తీవ్రమైన పోటీని తట్టుకుని విద్యా వలంటీర్ పోస్టులకు ఎన్నికవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినా, ప్రభుత్వ టీచర్లకు వేతనాలు మాత్రం ఆగలేదు. కానీ, అదే ప్రభుత్వ బడుల్లో సర్కారీ టీచర్లతో పాటు స్టూడెంట్లకు విద్యను అందించిన విద్యా వలంటీర్స్ ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నా ప్రభుత్వం చలించకపోటం సిగ్గుచేటు. ఆత్మ గౌరవం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వీరిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? కానీ, వారిని గురించి రాష్ట్ర సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదు. పోయిన ప్రాణాలను ఎలాగూ తేలేరు.. వారి కుటుంబాలైనా రోడ్డుపాలు కాకుండా చూడకుంటే ఆ పాపం ప్రభుత్వానిది కాదా? 
ప్రభుత్వానికి విద్యా వలంటీర్లంటే ఎందుకింత నిర్లక్ష్యమో అర్థం కావటం లేదు. కనీసం ఇప్పటికైనా విద్యా వలంటీర్ల గురించి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి స్పందించాలి. ప్రైవేట్ టీచర్స్ కు ఇచ్చినట్టే ఆర్థిక సాయం, సన్న బియ్యం ఇవ్వాలి. కాంట్రాక్టు లెక్చరర్స్ కు ఇచ్చినట్లే గౌరవ వేతనాలను చెల్లించాలి. వారిపై ఆధారపడ్డ కుటుంబాలను ఆదుకోవాలి. ఇప్పటికైనా వలంటీర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించి ఆదుకుంటుందని ఆశిద్దాం.

వలంటీర్లు ప్రైవేటు టీచర్ల పాటి చేయరా?
గత ఏడాది మార్చి నుంచి ప్రభుత్వ స్కూళ్లు కరోనా వల్ల మూతపడినప్పటి నుంచి ఎలాంటి వేతనం, ఉపాధి లేక ఆకలితో ఉన్న విద్యా వలంటీర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఒకవైపు ఆకలి, మరోవైపు అవమానాలు, ఆవేదనతో చాలాసార్లు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకున్న నాథుడే లేడు. ఆత్మాభిమానంతో ఆకలి తీర్చుకోవడానికి దినసరి కూలీగా పనులు చేసుకొని పూట గడుపుకోవడంలో పోటీ పడుతున్నారు. విద్యా వలంటీర్స్ మీద ఇంత నిర్లక్ష్యం ఎందుకు. కరోనా సంక్షోభం సందర్భంగా ఈ విద్యా సంత్సరంలో ప్రత్యక్ష పద్ధతిలో క్లాసులు జరగకున్నా.. కాలేజీలు తెరవకున్నా.. ఇంటర్, డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్స్ ఉద్యోగ కాలాన్ని మరో ఏడాది పెంచి వారికి యధావిధిగా వేతనాలు చెల్లించారు. కానీ, విద్యా వలంటీర్స్ ఏం పాపం చేశారు. కనీసం సగం గౌరవ వేతనం అన్నా ఇవ్వలేరా? ఈ మధ్య ప్రైవేట్ టీచర్స్ కు నెలకు రూ.2,000, ప్రతి నెలా 25 కిలోల సన్న బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు లక్షా 50 వేల మంది ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ స్కూల్​ సిబ్బందికి సహాయం అందించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో 13,000 నుంచి 14,000 ఉన్న విద్యా వలంటీర్స్ కు అలాంటి సాయం పొందే అర్హత లేదా? - శ్రీనివాస్ తిపిరిశెట్టి, సీనియర్ జర్నలిస్ట్.