వైభవంగా ఏడుపాయల జాతర

వైభవంగా ఏడుపాయల జాతర
  •    పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్, ఎమ్మెల్యే

మెదక్, పాపన్నపేట, వెలుగు : మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయలలో జాతర ప్రారంభమైంది.  శుక్రవారం ఉదయం నుంచే పూజారులు వన దుర్గా భవానీ మాతకు అభిషేకం నిర్వహించి, రంగురంగుల పువ్వులు, బంగారు కిరీటం, అభరణాలతో అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, శివాని దంపతులు

కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ముందున్న మంజీరా నది పాయల మధ్యలో ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహం వద్ద పూజలు చేశారు. ఏడుపాయల ఆలయ కమిటీ చైర్మన్​ బాలాగౌడ్,  ఈవో మోహన్ రెడ్డి ఆలయ మర్యాదలతో వారిని సత్కరించారు. 

ఆకట్టుకున్న సెట్టింగ్

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్​లో ఉన్న ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆదియోగి విగ్రహం తరహాలో ఏర్పాటు చేసిన సెటప్ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతరకు వచ్చిన భక్తులు ఈ సెట్టింగ్ వద్ద ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు, హైదరాబాద్ , కర్నాటక, మహారాష్ట్ర నుంచి  తరలి వచ్చిన భక్తులు మంజీరా నదీ పాయలు

వనదుర్గా ప్రాజెక్ట్ వద్ద ఏర్పాటు చేసిన షవర్ల వద్ద స్నానాలు చేసి వనదుర్గా మాతను దర్శించుకున్నారు. అనంతరం బోనాలు తీసి, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ఏడుపాయల వచ్చి వన దుర్గా భవానీ మాతను దర్శించుకున్నారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, రమేశ్ జాతర ఏర్పాట్లు పర్యవేక్షించారు.