
- అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి దామోదర
మెదక్, పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల శివరాత్రి మహాజాతరకు ముస్తాబైంది. మూడు రోజుల పాటు జాతర జరగనుండగా బుధవారం మహా శివరాత్రి, 27న బండ్లు, బోనాలు, 28న రథోత్సవం ఉంటాయి. ఆలయ వెనక గుట్టమీద, ప్రాంగణంలో ఉన్న ఎత్తైన బండలకు సంప్రదాయ బద్ధంగా సున్నం, జాజు నామాలతో అలంకరించారు. ఆలయం ముందు ఉన్న మంజీరా నది పాయ మధ్యలో భక్తులను ఆకట్టుకునేలా భారీ శివలింగం సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
బుధవారం తెల్లవారు జామున పూజారులు రాతి గుహలో కొలువైన వనదుర్గా భవానీ మాతకు అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఏడుపాయల జాతర స్టేట్ ఫెస్టివల్కావడంతో మంత్రి దామోదర రాజనర్సింహ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. జాతరకు తెలంగాణాలోని వివిధ జిల్లాలతోపాటు, పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర నుంచి 8 నుంచి 10 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. మంగళవారం కలెక్టర్రాహుల్రాజ్ ఏడుపాయలలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడంతోపాటు జాతర ప్రాంగణంలో తిరిగి ఏర్పాట్లు పర్యవేక్షించారు.