ఏడుపాయల పాలకమండలి ఏమాయే..! జాతరలు సమీపిస్తున్నా జాడలేని కమిటీ

 ఏడుపాయల పాలకమండలి ఏమాయే..! జాతరలు సమీపిస్తున్నా జాడలేని కమిటీ
  • జాతరలు సమీపిస్తున్నా జాడలేని కమిటీ

మెదక్, పాపన్నపేట, వెలుగు: జాతరలు సమీపిస్తున్నప్పటికీ   ఏడుపాయల దేవాలయ పాలకమండలి ఇంకా ఏర్పాటు కాలేదు.  గత పాలకమండలి పదవీ కాలం ఆగస్టు 6న  ముగిసింది.  కొత్త కమిటీ కోసం ఎండోమెంట్ డిపార్టుమెంటు  సెప్టెంబర్​లోనే నోటిఫికేషన్ జారీ చేసినా  డైరెక్టర్   పదవులకు ఎవరూ దరఖాస్తు చేయలేదు.

 మరోసారి నోటిఫికేషన్​జారీ చేయాల్సిఉండగా  ఇంతవరకు అధికారులు స్పందించలేదు. ఏడుపాయల పాలక మండలిలో  12 డైరెక్టర్​ పోస్టులు ఉంటాయి. ఎండోమెంట్స్​  గైడ్​ లైన్స్​ ప్రకారం నోటిఫికేషన్​ జారీ అయిన తర్వాత ఆసక్తి, అర్హత ఉన్న వారు దరఖాస్తు  చేసుకోవాలి.  పోలీసు  ఎంక్వైరీ అనంతరం డైరెక్టర్​పోస్టులను భర్తీ చేస్తారు. డైరెక్టర్లు తమలో ఒకరిని  చైర్మన్​గా ఎన్నుకుంటారు. 

ఎమ్మెల్యే ఆశీస్సుల కోసం ప్రయత్నాలు 

ఏడుపాయల కమిటీ పదవులు మెదక్​ ఎమ్మెల్యే అనుకున్నవారికే దక్కుతాయి.  ఈ పదవులకు సంబంధించి ఎమ్మెల్యే ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అందుకే పాలకమండలి ఏర్పాటులో జాప్యం జరుగుతుందని తెలుస్తోంది.  కాగా.. ఆలయ చైర్మన్​ పదవి కోసం కాంగ్రెస్​ నేతల్లో పోటీ తీవ్రంగా ఉంది.  మొదటి నుంచి పాపన్నపేట మండలానికి చెందిన వారికే  ​ చైర్మన్ పదవి ఇస్తూవస్తున్నారు.  ఇదే ఆనవాయితీ ఇప్పుడు కూడా కొనసాగించాలని  ఆ మండలానికి చెందిన నాయకులు అంటున్నారు.

 పాపన్నపేట మండలానికి చెందిన  ఆరేడుగురు కాంగ్రెస్ నేతలు  పదవిని ఆశిస్తున్నారు.  పదవి ఆశిస్తున్నవారంతా ఎమ్మెల్యే ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు.  డైరెకర్టర్​ పోస్టుల్లో కూడా 10 పాపన్నపేట మండలానికి, రెండు కొల్చారం మండలానికి  కేటాయిస్తారు. ఈ పోస్టుల విషయం కూడా ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది.

ALSO READ : వనపర్తి జిల్లాలో .. కంది కొనుగోళ్లలో ప్రైవేట్‌‌‌‌ దందా  

ఉత్సవాల కోసం కమిటీ వేసే చాన్స్​

ఏడుపాయలలో  ఈ నెల 29న మాఘ అమావాస్య జాతర, ఫిబ్రవరి   26 నుంచి మూడు రోజుల పాటు మహా అమావాస్య జాతర జరుగుతాయి. జాతరల నిర్వహణ, లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు  సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులను దేవాలయ కమిటీ చేయాల్సిఉంటుంది.

అయితే జాతరలు సమీపిస్తున్నప్పటికీ  నోటిఫికేషన్​ రాకపోవడంతో  ఇప్పట్లో పాలక మండలి ఏర్పాటయ్యే అవకాశం లేకుండాపోయింది.    దీంతో  జాతర ఏర్పాట్ల కోసం  తాత్కాలికంగా ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. జాతర ముగిసిన తర్వాతే  పాలక మండలి ఏర్పాటు  జరగవచ్చన్న సంకేతాలతో ఈ పదవులు మీద ఆశలు పెట్టుకున్న నేతలు  నారాజ్​ అవుతున్నారు.