
- హరీశ్‌రావు సపోర్ట్ చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నరు: రఘునందన్‌రావు
- వెంకట్రామ్రెడ్డి డబ్బులు పంచుతుంటే పోలీసులు పట్టించుకోలే
- సిద్దిపేటలో హరీశ్‌రావును ఎప్పటికైనా ఓడించేది బీజేపీనే
హైదరాబాద్, వెలుగు: తాను ఎవరి దయతోనూ గెలవలేదని, హరీశ్‌రావు తనకు సపోర్ట్ చేశాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బీజేపీని, మోదీని చూసే ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. హరీశ్‌రావు తనకు ఓట్లు వేయించారని భాగ్యలక్ష్మి టెంపుల్ కు వచ్చి సీఎం రేవంత్ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.
మల్కాజిగిరిలోనూ కాంగ్రెస్ ఓడిందనీ, ఆ సీటు గురించి మాట్లాడని రేవంత్ రెడ్డి.. మెదక్ సీటు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం స్కామ్ లో హరీశ్‌రావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. తన గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, ఆయన కంటే తా నే ఎక్కువ చదివానని అన్నారు. సిద్దిపేటలో హరీశ్ ను ఎప్పటికైనా ఓడించేది బీజేపీనేనని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి ఓటర్లకు భారీగా డబ్బులు పంచారని, అయినా పోలీసులు అడ్డుకోలేదని అన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వం
రాష్ట్ర ప్రజలు తమ మీద పెట్టిన నమ్మకం, విశ్వాసం వమ్ముకానివ్వబోమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 22 శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలందరూ సీనియర్లేనని, గతంలో పదవులు అనుభవించిన వారేనని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని తెలిపారు. కేసీఆర్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచిందని అన్నారు.