మునుగోడు, వెలుగు: కులాలతో సంబంధం లేకుండా ‘పేద బంధు’ ప్రకటించాలని మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేయాలని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం మునుగోడులోని రాజగోపాల్ రెడ్డి క్యాంప్‌ఆఫీస్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్బైఎలక్షన్లో తనపై ఎలాంటి ప్రయోగాలు చేశారో.. ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారని, మునుగోడు ప్రజలు ఎన్నికల్లో కేసీఆర్‌కు కర్రుకాల్చి వాత పెడతారన్నారు. రాష్ట్రంలో మహిళలకు 3,750 కోట్ల పావలా వడ్డీ రుణాలు బకాయిలు ఉన్నాయని, మునుగోడు మహిళలు ఓట్ల కోసం వస్తున్న మంత్రులను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేసేందుకు వెళ్తే వారిపై దాడులు చేస్తున్నారని, అధికారులకు విన్నవిస్తే వారు పట్టించుకుంటలేరన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో యాదవులకు గొర్లు, గట్టుప్పల మండలం తో పాటు సంక్షేమ పథకాలు శరవేగంగా అమలవుతున్నాయన్నారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు పథకాల అమలు గుర్తుకు వస్తుందన్నారు. ప్రపంచ నలుమూలల ఉండే తెలుగు ప్రజలు మునుగోడులో పోరాడుతున్న రాజగోపాల్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.