మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పదవి వదులుకున్న ఆయనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఉప ఎన్నిక వస్తే మునుగోడులో హుజూరాబాద్ కన్నా గొప్ప తీర్పు వస్తదని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీని ఓడగొట్టాలని ఈటల పిలుపునిచ్చారు.
భయంతోనే అబద్దపు ప్రచారం
కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. బీజేపీ సభ సక్సెస్ కావద్దని నిన్న మీటింగ్ పెట్టుకుండని ఆరోపించారు. మునుగోడు గడ్డ మీద బీజేపీ గెలిస్తే బంగాళాఖాతంలో వేస్తరని ఆయననే చెప్పుకుంటున్నడని, అది తప్పకుండా జరుగుతదని చెప్పారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మోటర్లకు మీటర్లు పెడ్తరని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఈటల విమర్శించారు. సీఎం చేస్తున్న ప్రచారం తప్పని హుజూరాబాద్ లో నిరూపితమైందని చెప్పారు.
ప్రజలు క్షమించరు
వామపక్ష నాయకులు కేసీఆర్ తో కలవడం కన్నా హీనమైన చర్య మరొకటి లేదని ఈటల విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు నిషేధించిన నాయకుడు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలా చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఎనిమిదిన్నరేండ్లలో ఏనాడైనా ప్రగతి భవన్ లో అడుగుపెట్టారా అని ప్రశ్నించారు. ట్రేడ్ యూనియన్లు సమ్మె చేస్తే సీఎం కేసీఆర్ ఏనాడైనా పిలిచి చర్చించి సమస్యను పరిష్కరించాడా అని నిలదీశారు.