సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కుర్చీ, కుటుంబం, లక్షల కోట్ల సంపాదన కోసమే ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని అన్నారు. రాష్ట్రంలో ధర్నాలు వద్దన్న సీఎం.. ఇప్పుడు స్వయంగా ధర్నాలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఉద్యమ నేతగా రాష్ట్రాన్ని సాధించుకున్న అనంతరం ప్రజల చేత అసహ్యించుకునే స్థితి దిగజారిన వ్యక్తి కేసీఆర్ అని ఈటల విమర్శించారు. సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే సూచనలు కనీసం పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు. ముఖ్యమంత్రి అతి విశ్వాసమే అన్ని అనర్థాలకు కారణమని అభిప్రాయపడ్డారు.
అబద్దాల పుట్ట అయిన కేసీఆర్ మాటలు ఎవరూ నమ్మడంలేదన్న ఈటల రాజేందర్.. అందుకే కొత్తగా వడ్ల నాటకం మొదలుపెట్టిండని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పీకే సర్వేలో తేలినందునే పంజాబ్ విధానం ఇక్కడ అమలు చేయాలని చూస్తుండని అన్నారు. కేసీఆర్ తన గొంతు నొక్కాలని చూస్తే.. ప్రజలను కడుపులో పెట్టుకుని నిలబెట్టారని అన్నారు. సభలో ఉంటే అధికారపార్టీ లొసుగులు బయటపెడతానన్న భయంతోనే సస్పెన్షన్ పేరుతో బయటకు పంపారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో హుజూరాబాద్ ఫలితాలే పునరావృతం అవుతాయన్న ఈటల.. రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే వాళ్లే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.