కేసీఆర్ ప్రజలను తాగుబోతుల్ని చేస్తుండు : ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు. చౌటుప్పల్ మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఈటల ఫైర్ అయ్యారు. గ్రామాలలో బెల్టు షాపులు పెట్టించి 30ఏండ్లకే యువత మరణానికి కేసీఆర్ కారణమవుతున్నడని మండిపడ్డారు. 

లిక్కర్ పై ఏడాదికి రూ.45 వేల కోట్ల ఆదాయం పొందుతున్న కేసీఆర్.. పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, రైతు బంధు పథకాలకు కలిసి కేవలం రూ.20కోట్లు మాత్రమే ఖర్చుపెడుతున్నడని ఈటల ఆరోపించారు. ప్రజలు సుపరిపాలన కోసం ఓటు వేశారే తప్ప.. బెల్టు షాపులు పెట్టి మహిళల పుస్తెలు తెంచేందుకు కాదని అన్నారు. ఒకవైపు వందల ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు ఇస్తే లబ్దిదారులు బెంజి కార్లలో వచ్చి డబ్బులు తీసుకుపోతుంటే మరోవైపు పంట ఎండిపోయి కౌలురైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. 

కులాలవారీగా కాకుండా ప్రతి పేదోడికి పేద బంధు పథకం ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న వారిని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి బానిసల్లా వ్యవహరిస్తున్న పోలీసులు కేసీఆర్ కలకాలం అధికారంలో ఉండడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మునుగోడు ప్రజల గోడు తీరాలంటే ఓటర్లంతా రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఈటల పిలుపునిచ్చారు.