కాశ్మీర్​ పార్టీలు ఏం చేస్తాయో?

జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం ఇటీవల తీసుకున్న సంచలన నిర్ణయాలతో అక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోయే సూచనలు ఉన్నాయి. రెండు ప్రధాన​ పార్టీల భవిష్యత్​ ఏంటనేది అంతుచిక్కట్లేదు. జమ్మూ కాశ్మీర్ స్పెషల్​ స్టేట్​ అని, ఆ రాష్ట్రానికి ఆర్టికల్​–370, ఆర్టికల్​–35ఏ​ ఇస్తున్న అటానమీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడి తీరతామని నేషనల్​ కాన్ఫరెన్స్​, పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీలు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చాయి. కానీ.. ఇప్పుడు అలా జనాన్ని మభ్యపెట్టే ఛాన్సే లేదు. దీంతో అవి ఇకపై ఏ అజెండాతో ప్రజల ముందుకు వెళతాయో తెలియట్లేదు. అసలు ఆ పార్టీలు బతికి బట్ట కట్టగలవా అనే అనుమానాలూ వస్తున్నాయి.

జమ్మూకాశ్మీర్​లో ఆర్టికల్​–370, ఆర్టికల్​–35ఏ రద్దుతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో  స్థానిక రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయని భావిస్తున్నారు. అక్కడ మొత్తం పదికిపైగానే రాజకీయ​ పార్టీలు ఉన్నా ప్రధాన లోకల్​ పార్టీలు మాత్రం రెండే. మొదటిది  నేషనల్​ కాన్ఫరెన్స్​(ఎన్​సీ) కాగా రెండోది పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ(పీడీపీ). నేషనల్ కాన్ఫరెన్స్​కు జమ్మూకాశ్మీర్​తో 70 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. జమ్మూకాశ్మీర్​ ఒక రాజ సంస్థానంగా ఉన్నప్పటి నుంచీ ఆ పార్టీ స్థానికుల హక్కుల కోసం కృషి చేస్తోంది. 1947 మొదలుకొని 2015 వరకు కంటిన్యూగా కాకపోయినా మధ్య మధ్యలో బ్రేక్​లతో ఆ పార్టీయే కాశ్మీర్​లో  అధికారంలో కొనసాగింది.

స్పెషల్​ స్టేటస్​కు కట్టుబడ్డ పార్టీలు

తొలుత షేక్​ అబ్దుల్లా, తర్వాత ఆయన కుమారుడు ఫరూఖ్​ అబ్దుల్లా, ఆ తర్వాత  మనవడు ఒమర్​ అబ్దుల్లా​ సీఎంలయ్యారు. వీరు ల్యాండ్​ రిఫార్మ్స్​ అమలు చేశారు. ఆర్టికల్​–370 కింద రాష్ట్రానికి ఉన్న అటానమీ​ స్టేటస్ కాపాడారు. రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, జెండా రూపొందించారు. మరో పార్టీ పీడీపీ 20 ఏళ్ల నుంచి యాక్టివ్​గా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ ఫౌండర్​ ముఫ్తీ మహ్మద్​ సయీద్​ కాంగ్రెస్​తో కలిసి మూడేళ్లు పాలించారు. తర్వాత ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ బీజేపీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు సీఎంగా ఉన్నారు. బీజేపీ సపోర్ట్​ విత్​డ్రా చేసుకోవటంతో  కిందటేడాది జూన్ లో  మెహబూబా ప్రభుత్వం కూలిపోయింది. ​

ఇదంతా ఇక గతమేనా?

జమ్మూకాశ్మీర్​కు కొత్త రాత రాసేందుకు మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రీసెంట్​గా తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడి మెయిన్​స్ట్రీమ్​ పొలిటికల్​ పార్టీలు పాలసీ పరంగా ఒక్కసారి​గా ప్రాధాన్యం కోల్పోనున్నాయి.

జనం వద్దకు వెళ్లటానికి కొత్త విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ ఇస్తున్న ‘ఆర్టికల్​–370’, ‘ఆర్టికల్​–35ఏ’ని కాపాడుకోవటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు తాము పూచీగా ఉంటామని ఎన్​సీ, పీడీపీ ఇన్నేళ్లుగా హామీ ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు  ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ రద్దు కావడంతో ఆ రెండు పార్టీలకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఏం చెప్పాలో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాయి.

ఆర్టికల్​–370, ఆర్టికల్​–35ఏని తొలగిస్తామని బీజేపీ లీడర్లు, సెంట్రల్​​ మినిస్టర్లు అన్నప్పుడల్లా ఆ రెండు ప్రాంతీయ పార్టీలు మండిపడేవి. కాశ్మీర్​కి, ఇండియాకి మధ్య ఉన్న ఒకే ఒక్క బంధం ఆ రెండు ఆర్టికల్స్​ మాత్రమేనని, వాటినీ తెంపేస్తే దేశంతో సంబంధాలకు తెర పడినట్లేనని హెచ్చరించేవి. జమ్మూకాశ్మీర్​ స్పెషల్​ స్టేటస్​ జోలికి వస్తే ఊరుకోబోమని బెదిరించేవి, స్థానికుల్లో సెంటిమెంట్​ని రగిలించేవి. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో ప్రతిసారీ ఇలా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొనేవి. పవర్​లోకి వచ్చాక అభివృద్ధిని, హామీలను గాలికొదిలేసేవి. ఇప్పుడిదంతా గతంగా మారింది.

లోకల్​ పార్టీలు ఏం చేయాలంటే..

ఆర్టికల్​ 370పై స్థానిక పార్టీలు ఎంతగా బెదిరించినా మోడీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఆపరేషన్​ కాశ్మీర్​ను అనుకున్న విధంగా పక్కా ప్లానింగ్​తో పూర్తి చేసింది.  జమ్మూకాశ్మీర్​లో యుద్ధం లాంటి పరిస్థితిని సృష్టించారని; ప్రజల అభిప్రాయాలను, ప్రధాన రాజకీయ వ్యవస్థ సలహాలను, సూచనలను పట్టించుకోలేదని పీడీపీ సుప్రీం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో  జమ్మూకాశ్మీర్​లోని ప్రధాన పార్టీలు ఇప్పుడు ప్రజల్లో నమ్మకం, అభిమానం సంపాదించాలంటే వాళ్లకు నిజంగా లాభం  కలిగించే పోరాటాలు చేయాలి. ‘ఆర్టికల్​–35ఏ’ లేని పరిస్థితుల్లో జమ్మూకాశ్మీర్​ను ‘ఓపెన్​ ఫర్​ ఆల్​’ చేయొద్దనే ముఖ్యమైన డిమాండ్​ను బీజేపీయే ముందుకు తీసుకొచ్చింది. ఇలాంటి కీలకమైన అంశాలను, హక్కులను గుర్తించి వాటిని సాధించేందుకు కృషి చేయాలి. అప్పుడు మాత్రమే జమ్మూకాశ్మీర్​లోని లోకల్​ పార్టీలు మనుగడ సాగించగలవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.