మెదక్, వెలుగు : ఇటీవల కురుస్తున్న అకాల, వడగండ్ల వానల ఎఫెక్ట్ మామిడిపై తీవ్రంగానే పడుతోంది. ఈదురుగాలులు, భారీ వర్షాలకు మామిడి కాయలు రాలిపోతుండడంతో అటు రైతులు, ఇటు ఆమ్‌చూర్ (మామిడి టంకర) తయారీదారులు భారీగా నష్టపోతున్నారు. చెట్ల మీద కాయలు కొని ఆమ్‌చూర్ తయారు చేసేవారికి ప్రస్తుతం పెట్టుబడి కూడా చేతికి అందే పరిస్థితి కనిపించడం లేదు.
1,585 ఎకరాల్లో దెబ్బతిన్న మామిడి
మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మనోహరాబాద్, తూప్రాన్, శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి, చేగుంట, నిజాంపేట మండలాల్లో పచ్చడికి, ఆమ్‌చూర్ తయారీకి పనికి వచ్చే మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. సకాలంలో పూత వచ్చి, వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రెండు టన్నుల దిగుబడి వస్తుంది. ఈ సారి మామిడి కాయలు బాగానే కాయడంతో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావించారు. కానీ దిగుబడి చేతికందే సమయం రాగానే ఈదురుగాలులు, వడగండ్ల వానలు పడ్డాయి. దీంతో మనోహరాబాద్, తూప్రాన్, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం మండలాల్లో 1,585 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఆయా చోట్ల పెద్దమొత్తంలో కోతకు వచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల టన్నుల మామిడికాయలు నేలరాలినట్టు అంచనా.
ఆందోళనలో ఆమ్‌చూర్ తయారీదారులు
ఉత్తరాది రాష్ట్రాల్లో, విదేశాల్లో, పెద్దపెద్ద హోటళ్లలో వంటకాల్లో పులుపు కోసం చింతపండుకు బదులుగా ఆమ్‌చూర్ వాడుతుంటారు. మెదక్ జిల్లాలోని కొల్చారం, వెల్దుర్తి, చిన్నశంకరంపేట, హవేలిఘనపూర్, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పెద్దఎత్తున ఆమ్‌చూర్ తయారు చేస్తారు. ఇందుకోసం తయారీదారులు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే మామిడికాయల కోసం చెట్లను గుత్తకు తీసుకుంటారు. ఏప్రిల్, మే నెలల్లో కాయలు తెంపి, కూలీలతో ఆమ్‌చూర్ తయారు చేయిస్తారు. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడికాయలు రాలిపోయాయి. దీని వల్ల కాయలకు దెబ్బలు తగిలి క్వాలిటీ తగ్గడంతో పాటు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించదు. దీంతో ఈ సారీ భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తోందని ఆమ్‌చూర్ తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా ఆమ్‌చూర్ తయారు చేసేందుకు చెట్ల మీద కాయలు కొన్నం. అయితే గాలివానకు చాలా కాయలు రాలిపోయినయ్. కాయలు దెబ్బతినడంతో ఆమ్‌చూర్ దిగుబడి అనుకున్నంత వస్తలేదు. దీంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ప్రభుత్వం పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలి. – మాధవి, ఆమ్‌చూర్ తయారీదారు, కొల్చారం
గిట్టుబాటు అయితలేదు
చాలా ఏండ్ల నుంచి ఆమ్‌చూర్ తయారు చేస్తున్నం. అయితే ఈ సారి చెట్ల రేట్లు పెరిగినయి. టంకర కోసే కూలీ రేటు ఇంతకు ముందు 100 కాయలకు రూ.20 ఉంటే ఇప్పుడు రూ.40 అయ్యింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఆమ్‌చూర్ రేటు క్వింటాల్ రూ.2 వేలకుపైన ఉంటేనే గిట్టుబాటు అయ్యేది. కానీ ఈ సారి క్వింటాల్ రూ.1,400 మాత్రమే ఉంది. దీంతోని గిట్టుబాటు అయితలేదు. – పెంట్యా, ఆమ్‌చూర్ తయారీదారు, కొల్చారం తండా