టారిఫ్ వార్.. చైనాపై మరో 20 శాతం టారిఫ్ పెంచిన అమెరికా

టారిఫ్ వార్.. చైనాపై మరో  20 శాతం టారిఫ్ పెంచిన అమెరికా
  • మొత్తం 145 శాతానికి చేరిన సుంకాలు.. రెండు దేశాల మధ్య ముదురుతున్న టారిఫ్​ వార్​ 
  • టారిఫ్ లను 145 శాతానికి పెంచిన ట్రంప్ 
  • జిన్​పింగ్ చాలా స్మార్ట్ అంటూ కామెంట్ 
  • అమెరికా బెదిరింపులకు భయపడమన్న చైనా

వాషింగ్టన్:  అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్​మరింత తీవ్ర స్థాయికి చేరింది. చైనాపై టారిఫ్ లను బుధవారం మొత్తం 125 శాతానికి పెంచిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. గురువారం మరింత బాదుడుతో షాక్ ఇచ్చారు. చైనాకు చెందిన వివిధ వస్తువులపై ఏకంగా145% టారిఫ్ లను ట్రంప్ విధించినట్టు ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటించింది. అయితే, కాపర్, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్స్, తదితరు ఉత్పత్తులకు మాత్రం ఈ టారిఫ్ లు వర్తించబోవని తెలిపింది. అలాగే స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్ దిగుమతులపై సెపరేట్ గా 25% టారిఫ్​లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త టారిఫ్ లన్నీ గురువారం నుంచే అమలులోకి వచ్చాయని స్పష్టం చేసింది. అంతకుముందు ట్రంప్ వైట్​హౌస్​లో మీడియాతో మాట్లాడారు. చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ చాలా స్మార్ట్ అని ప్రశంసించారు. ఎప్పుడు ఏం చేయాలో జిన్​పింగ్​కు బాగా తెలుసు అంటూ ప్రశంసలు కురిపించారు. టారిఫ్ విషయంలో అమెరికాతో డీల్​కు చైనా ముందుకొస్తే చర్చలకు తాము రెడీగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. ‘‘చైనాను జిన్​పింగ్ ఎంతో ప్రేమిస్తాడు. వాణిజ్యపరమైన విధానాల్లో తెలివిగా వ్యవహరిస్తాడు. టారిఫ్​ల విషయంలో కూర్చొని మాట్లాడుకునేందుకు నేను సిద్ధంగా ఉన్న. తన వైఖరి ఏంటో జిన్​పింగ్ చెప్పాలి. ఏదో ఒక టైమ్​లో చైనా నుంచి ఫోన్ వస్తుందని భావిస్తున్నాను. దేశ ప్రయోజనాల విషయంలో జిన్​పింగ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు. చైనా కోసం అతను చాలా గొప్పగా పని చేస్తున్నారు. నేను కూడా అమెరికా అభివృద్ధి కోసం అలాగే పని చేస్తున్నాను. జిన్​పింగ్​కు చైనా ఫస్ట్ అయితే.. నాకు అమెరికా ఫస్ట్. నేను తీసుకున్న నిర్ణయాలు అమెరికాను మరింత డెవలప్ చేస్తాయి’’అని ట్రంప్ అన్నారు.

చైనా విషయంలో మేం అదే చేశాం.. 

చైనాతో పాటు మరికొన్ని దేశాలు మినహా అన్నింటిపై టారిఫ్ అమలుకు 90 రోజుల బ్రేక్ ఇచ్చినట్లు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ‘‘ఏ దేశమైన మాపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే.. దానికి అమెరికా నుంచి రెట్టింపు ప్రతీకారం ఉంటది. చైనా విషయంలో అదే చేశాం. గత ప్రభుత్వ హయాంలో అమెరికాను చైనా చాలా దోచుకున్నది. అందుకే అన్ని దేశాలకంటే చైనాపై ఎక్కువ టారిఫ్ విధించాను’’అని ట్రంప్ అన్నారు. ప్రతీకారం  తీర్చుకోకపోతే.. ప్రతిఫలం లభిస్తుందని తెలిపారు.

90 రోజులు బ్రేక్ ఇచ్చిన ఈయూ

టారిఫ్ అమలుకు ట్రంప్ 90 రోజులు బ్రేక్ ఇవ్వడంతో యూరోపియన్ యూనియన్ కూడా దిగొచ్చింది. అమెరికా వస్తువులపై విధించే పన్ను అమలును తాము కూడా 90 రోజులు పోస్ట్​పోన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాతో చర్చలు జరిపేందుకు ఆలోచిస్తున్నది. ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపింది. జీరో – జీరో టారిఫ్ ఒప్పందం కోసం ప్రయత్నిస్తామని పేర్కొన్నది. తాము టారిఫ్ వార్ కోరుకోవడం లేదని, దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఈయూ తెలిపింది.

ఎంత కవ్వించినా భయపడం: చైనా

ట్రంప్ విధించిన 125 శాతం టారిఫ్​పై చైనా దీటుగా స్పందించింది. తాము చైనీయులమని, బ్లాక్ మెయిల్ వర్కౌట్ కాదని అమెరికాను హెచ్చరించింది. సుంకాల విధింపు వ్యవహారంలో తమతో చర్చలకు తలుపులు తెరిచి ఉన్నాయని స్పష్టం చేసింది. టారిఫ్ అనే ఆయుధంతో అమెరికా ఎంత కవ్వించినా భయపడబోమని తేల్చి చెప్పింది. చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో కొనసాగాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి యోంగ్కియాన్ తెలిపారు. ‘‘మాపై అమెరికా ఒత్తిడి పెంచుతున్నది. తన స్వార్థం కోసం మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్తున్నది. అమెరికా వైఖరి.. చైనాతో పాటు చాలా దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ట్రంప్ ఏకపక్ష బెదిరింపులను ఖండిస్తున్నాం. మా హక్కులు కాపాడుకోవడానికి చివరి దాకా పోరాడుతాం’’అని యోంగ్కియాన్ అన్నారు. తమతో అమెరికా చర్చలు జరపాలనుకుంటే.. అవి మ్యూచువల్ రెస్పెక్ట్, ఈక్వాలిటీగా ఉండాలని తెలిపారు. ఒత్తిడి పెంచి.. బ్లాక్ మెయిల్ చేస్తే దారికొస్తామని మాత్రం అనుకోవద్దని ట్రంప్​ను హెచ్చరించారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ట్రేడ్​వార్​లో విజేతలు ఎవరూ లేరన్న ఆమె.. అమెరికా ప్రవర్తించే తీరుకు అనుగుణంగా చైనా నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు 1953 నాటి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.