జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన

జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన
  • కాంగ్రెస్​ ఆధ్వర్యంలో జగదీశ్వర్​ రెడ్డి, కేటీఆర్ ​దిష్టి బొమ్మల దహనం

నెట్​వర్క్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్​పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్​ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాలోని ఐబీ చౌరస్తా వద్ద డీసీసీ చైర్​పర్సన్​ కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపి దిష్టి బొమ్మలు దహనం చేశారు. స్పీకర్​పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, స్పీకర్​కు క్షమాపణ చెప్పాలని సురేఖ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు దళితుల జోలికొస్తే ఊరుకునేది లేదని ఆసిఫాబాద్​ డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల విశ్వప్రసాద్ రావు హెచ్చరించారు.

అంబేద్కర్ చౌక్ వద్ద మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మసాదే చరణ్, మాజీ ఎంపీపీ బాలేశ్ గౌడ్, జిల్లా యువజన అధ్యక్షుడు గుండా శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. దండేపల్లిలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు ఆందోళనలు చేపట్టారు.

జగదీశ్​ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

మందమర్రి పాత బస్టాండ్​ ఏరియాలో కాంగ్రెస్​లీడర్లు జగదీశ్వర్ ​​రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత స్పీకర్​గడ్డం ప్రసాద్​పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్​ ​రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చెన్నూరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ ఎండీ నయీం, మందమర్రి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, ఎస్సీ సెల్ కన్వీనర్ జె.విజయ్, మాజీ కౌన్సిలర్ రాములు నాయక్, యూత్ కాంగ్రెస్ నేత ఆకాశ్, ఎస్సీ సెల్ నాయకులు రాస్తారోకో చేపట్టి కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. లక్సెట్టిపేటలోని ఊట్కూర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేపట్టి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.

మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. కాసిపేట మండలం కొండాపూర్ (యాప)లో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రాజమౌళి, మాజీ జడ్పీటీసీ రౌతు సతయ్య ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.