బోధన్‌‌ షుగర్‌‌ ఫ్యాక్టరీ షిఫ్ట్‌‌ ! ..రెంజల్‌‌లోగానీ, ఎడపల్లిలో గానీ ఏర్పాటుకు ప్రయత్నాలు

  • 150 నుంచి 200 ఎకరాల భూసేకరణకు ప్లాన్‌‌
  • నగరం మధ్యన ఫ్యాక్టరీ నిర్వహణ కష్టమని అంచనా
  • సర్కార్‌‌తో మాజీమంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌‌రెడ్డి సంప్రదింపులు

నిజామాబాద్, వెలుగు :నిజాం షుగర్‌‌ ఫ్యాక్టరీలకు మదర్‌‌ యూనిట్‌‌ అయిన బోధన్‌‌ కర్మాగారాన్ని మరో చోటుకు షిఫ్ట్‌‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మాజీమంత్రి, లోకల్‌‌ ఎమ్మెల్యే సుదర్శన్‌‌రెడ్డి ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం ఆసక్తి రేపుతోంది. 

రూ. 100 కోట్లతో రిపేర్లు చేస్తే తిరిగి నడిచే చాన్స్‌‌

2015 డిసెంబర్‌‌ 23 నుంచి లేఆఫ్‌‌లో ఉన్న బోధన్‌‌, మెట్‌‌పల్లి, మెదక్‌‌ నిజాం షుగర్‌‌ ఫ్యాక్టరీలను రీఓపెన్‌‌ చేసేందుకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి వచ్చాక మంత్రి శ్రీధర్‌‌బాబు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా సభ్యులంతా కలిసి ఇప్పటికే ఫ్యాక్టరీలను విజిట్‌‌ చేసి రైతుల అభిప్రాయాలను సేకరించారు. వన్‌‌టైం సెటిల్‌‌మెంట్‌‌ కింద రూ.190 కోట్ల అప్పును బ్యాంకులకు సర్కారు చెల్లించేసింది. అలాగే ప్రభుత్వం నియమించిన 15 మంది ఇంజినీరింగ్‌‌ నిపుణులు నెలన్నర కింద ఫ్యాక్టరీ మెషీన్ల పనితీరును పరిశీలించారు. మూడు రోజుల పాటు ఫ్యాక్టరీలో తిరిగి సెంట్రీప్యూగల్‌‌, బాయిలర్స్, క్లారిఫయిర్స్‌‌, పంప్‌‌ మోటార్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసి మెషీన్లను రిపేర్‌‌ చేస్తే మిల్లును నడపొచ్చన్న రిపోర్ట్‌‌ను ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే చెరుకు రికవరీ 9.5 శాతం దాటే విషయంలో మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. 

నగరం మధ్యలో ఉండడంతో ఇబ్బందులు

బోధన్‌‌ షుగర్‌‌ ఫ్యాక్టరీలో చెరుకు రికవరీ పెరిగేలా ఆధునికీకరించినా పట్టణం మధ్యలో మిల్లు నిర్వహణ కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే పొల్యూషన్‌‌తో పాటు రోడ్లపై ట్రాఫిక్‌‌ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతారని అంటున్నారు. ఈ ఇబ్బందులను తొలగించాలన్న ఉద్దేశంతోనే మిల్లును గ్రామీణ ప్రాంతానికి తరలించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తన ఆలోచనను ఇప్పటికే సీఎం రేవంత్‌‌రెడ్డికి వివరించినట్లు సమాచారం.

150 నుంచి 200 ఎకరాల సేకరణ

బోధన్‌‌ మిల్లును కొత్తగా 150 నుంచి 200 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి పాజిటివ్‌‌ సంకేతాలు అందడం వల్లే భూ సేకరణ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఎడపల్లి మండలంలోని ఏఆర్‌‌పీ క్యాంప్‌‌, రెంజల్‌‌ మండలంలోని తాడ్‌‌ బిలోలి, కందకుర్తి ప్రాంతాలను పరిశీలించి, భూసేకరణకు అవసరమైన ప్రాథమిక అంచనాను రూపొందించారు. చిన్న పట్టాదారుల జోలికి వెళ్లకుండా కేవలం 12 మంది పెద్ద రైతుల నుంచి సుమారు 200 ఎకరాలు సేకరించే వీలున్న రేంజల్‌‌ మండలంలోని తాడ్‌‌ బిలోలి, ఎడపల్లి మండలంలోని ఏఆర్‌‌పీ క్యాంప్‌‌ వైపు ఆయన ఇంట్రస్ట్‌‌ చూపుతున్నారు. అలాగే స్టేట్‌‌ బార్డర్‌‌లోని కందకుర్తి భూములను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఫెసిలిటీ, నేషనల్‌‌ హైవేలకు లింక్, వాటర్‌‌ అవైలబిలిటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని భూమిని సేకరించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ ఏడాది క్రషింగ్‌‌ కష్టమే...

నిజాం షుగర్‌‌ ఫ్యాక్టరీని 2025 డిసెంబర్‌‌లో రీఓపెన్‌‌ చేస్తామని మిల్లు విజిట్‌‌ సందర్భంలో సబ్‌‌ కమిటీ చైర్మన్‌‌ దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు ప్రకటించారు. అయితే ఫ్యాక్టరీకి కావాల్సిన చెరకును రైతులు సాగు చేయలేదు. దీంతో ఈ ఏడాది ఫ్యాక్టరీ రీఓపెనింగ్‌‌ కష్టంగా మారింది. 2025లో సీడ్‌‌ కోసం కనీసం 400 ఎకరాల్లో చెరకు సాగు చేస్తే 2026లో 15 వేల ఎకరాల్లో షుగర్‌‌ కేన్‌‌ సాగయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 4న మీటింగ్‌‌ నిర్వహించారు. ఇప్పటికిప్పుడు మిల్లు తెరిచినా మరో రెండేండ్ల దాకా చెరుకు లేదని స్పష్టంగా తెలుస్తుండడంతో ఈ లోపు ఫ్యాక్టరీని తరలించొచ్చని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు సమాచారం.