నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు షురూ..!

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు షురూ..!
  • 10లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామన్న సీఎం
  •  రంగంలోకి దిగిన ఏఐసీసీ కార్యదర్శులు 
  •  గాంధీభవన్ లో 48 మంది సీనియర్లతో భేటీ
  • వన్ టు వన్ ప్రశ్నిస్తున్న ఏఐసీసీ నేతలు
  • ఎమ్మెల్సీ పోస్టులకూ భారీ డిమాండ్ 
  • మండలిలో చోటు కోసం ఢిల్లీకి విజయశాంతి?
  • ఢిల్లీ వెళ్లిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
  • హాట్ టాపిక్ గా మారిన నేతల హస్తిన టూర్

హైదరాబాద్: రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ఈ నెల 10వ తేదీ లోపు ఆశావహులు తమ పేర్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల గాంధీభవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలిపారు. ఈ నేపథ్యంలో పదేండ్లుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులతో ఏఐసీసీ కార్యదర్శులు  విష్ణునాథ్, విశ్వనాథ్ ఇవాళ భేటీ అవుతున్నారు. 

రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గా లనుంచి 48 మంది సీనియర్ నేతలను ఇవాళ గాంధీభవన్ పిలిచారు. విష్ణునాథ్ 24 మందితో , విశ్వనాథ్ 24  మందితో వన్ టు వన్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి నియోజకవర్గంలో  పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తూనే పార్టీ గత, ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.

 ‘పార్టీలో ఎంత కాలం నుంచి కాలం నుంచి కొనసాగుతున్నారు? .. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏ నియోజకవర్గానికి ఇంచార్జీ గా ఉన్నారు? అక్కడ పార్టీ గెలిచిందా? ఓడిందా? .. పార్టీలో ఇప్పుడు మీరు ఏ పదవి ఆశిస్తున్నారు?’ అనే ప్రశ్నలను సంధిస్తున్నారు. 

ALSO READ | నిజాలను దాచకుండా బయట పెట్టండి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వన్ టు వన్ మీటింగ్ లో ఇప్పటి వరకు  వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బుజ్జు,అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, పలు వురు పీసీసీ ఆఫీసు బేరర్లతో ఏఐసీసీ కార్యదర్శులు మాట్లాడినట్టు సమాచారం. 

ఎమ్మెల్సీ పోస్టుల కోసం ప్రయత్నాలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ పోస్టులకు ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల10లోపు నామినేషన్లు వేయాల్సి ఉన్నందున ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సినీ నటి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ పెద్దల సహకారంతో ఎమ్మెల్సీగా టికెట్ పొందాలని ఆమె భావిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరడం చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఎమ్మెల్సీ పదవి కోసం ఢిల్లీ వెళ్లడం లేదని, రాహుల్ గాంధీని కలిసేందుకే వెళ్తున్నానని జగ్గారెడ్డి చెబుతున్నారు. టికెట్లు ఎవరికి కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే.  ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఎల్లుండి కల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.