మహబూబ్‌నగర్/వనపర్తి, వెలుగు :ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక్కడి 14 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. వీరికి దీటైన క్యాండిడేట్లను రంగంలోకి దింపేందుకు చరిష్మా ఉన్న లీడర్ల కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కొత్తకోట దంపతులకు ఆహ్వానం
టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన కొత్తకోట దయాకర్ రెడ్డి, ఎమ్మెల్యేగా, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆయన సతీమణి కొత్తకోట సీతను పార్టీలోకి రావాలని రెండు వారాల కింద బీజేపీ లీడర్లు కోరినట్లు తెలిసింది. వీరికి మక్తల్‌తో పాటు దేవరకద్ర స్థానాన్ని కూడా ఇచ్చేందుకు ప్రపోజల్పెట్టారని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు కొత్తకోట దంపతులు దేవరకద్రకు చెందిన తమ కేడర్‌తో ఇటీవల చర్చలు కూడా జరిపారు. ఇదే అంశం నాలుగు రోజుల కింద సీసీకుంట, దేవరకద్ర మండలాల్లో జరిగిన ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’లో కమల దళంలోని కొందరు లీడర్లు ‘కొత్తకోట’ ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటన కూడా చేశారు.
వనపర్తిలో రావుల
వనపర్తి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్లీడర్ రావుల చంద్రశేఖర్‌రెడ్డిని బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఢీకొట్టాలంటే గతంలో ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న రావుల అయితే కరెక్ట్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. వనపర్తి ప్రజలు కూడా ఎప్పుడూ ఒక్కరికే కాకుండా విభిన్నంగా తీర్పు ఇస్తుండడంతో కలిసి వచ్చే అవకాశం ఉందని యోచిస్తున్నారు. మరో పక్క కాంగ్రెస్ నుంచి మరో సారి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా రావులను కాంగ్రెస్ లోకి రావాలని కోరుతున్నారు. ఓ దశలో రావుల కాంగ్రెస్‌లోకి వస్తే తాను తప్పుకొని ఆయనకు టికెట్ ఇప్పిస్తానంటూ బహిరంగ ప్రకటన చేశారు.
కొల్లాపూర్‌లో జూపల్లి..
కొల్లాపూర్‌లో వరుసగా ఐదు సార్లు గెలుపొందిన జూపల్లి కృష్ణారావు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. బీజేపీ నుంచి పోటీ చేసిన జూపల్లి సామాజిక వర్గానికి చెందిన ఎల్లేని సుధాకర్ రావుకు 13 వేల ఓట్లు రావడంతో జూపల్లికి ఎదురుదెబ్బ తగిలినట్లు ప్రచారం ఉంది. కాగా, హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరడంతో హైకమాండ్ జూపల్లిని లైట్ తీసుకుంటోంది. జూపల్లి కూడా అధికారిక కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అంతేకాదు పోలీసులు తన అనుచరులను కేసులు పెట్టడంపై గుర్రుగా ఉన్నారు. హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తనకార్యకర్తలను వేధించడం ఆపకపోతే తనదారి చూసుకుంటానని బహిరంగానే హెచ్చరించారు. ఈ క్రమంలో జాతీయ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరాలని భావించినా మాజీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రావు కాంగ్రెస్‌లోకి ఇప్పటికే చేరడంతో ఆశలను వదులుకున్నట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సహచర మంత్రిగా పనిచేసిన అనుబంధం ఉండడంతో ఈటల రాజేందర్ ద్వారా బీజేపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అలంపూర్‌లో చల్లా వెంకట్రామిరెడ్డి
2005లో అలంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా వెంకట్రామిరెడ్డిని కూడా బీజేపీ టచ్చేసినట్లు తెలిసింది. 2014 వరకు వనపర్తి జిల్లాలోని పెబ్బేరుతో 25 గ్రామాలు అలంపూర్ నియోజకవర్గంలో ఉండేవి. జిల్లాల విభజన తర్వాత ఈ గ్రామాలు వనపర్తి పరిధిలోకి వచ్చాయి. ఈ గ్రామాల్లో చల్లాకు పట్టు ఉంది. దీంతో ఈయనను బీజేపీలోకి చేర్చుకునేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ఎన్పీ వెంకటేశ్ బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర-–3 జరుగుతుండగా, ఈ యాత్ర ముగింపు సభకు అమిత్ షా, జేపీ నడ్డా హాజరుకానున్నారు. వారి సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ కేడర్ చెబుతున్నారు.