లేని ఇండ్లకు నంబర్లు పరిహారం కోసం ప్రయత్నాలు

లేని ఇండ్లకు నంబర్లు పరిహారం కోసం ప్రయత్నాలు
  •     మిడ్‌‌‌‌మానేరు ముంపునకు గురైన వరదవెల్లిలోని ఇండ్లకు బై నంబర్లతో ఫేక్‌‌‌‌ డాక్యుమెంట్లు
  •     దళారులతో కుమ్మక్కైన ఆఫీసర్లు, మళ్లీ పరిహారం ఇవ్వాలంటూ అప్లికేషన్లు
  •     గత ఏడాదే రెడీ అయిన చెక్కులు, గ్రామస్తుల ఫిర్యాదుతో ఆగిన పంపిణీ
  •     దళారుల పైరవీతో మరోసారి చెక్కులు సిద్ధం చేసిన ఆఫీసర్లు
  •     9 ఇండ్లపై రూ. 1.86 కోట్లు కాజేసే ప్రయత్నాలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్‌‌‌‌మానేరు ముంపు గ్రామమైన వరదవెల్లిలో ఇండ్ల స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి మరోసారి పరిహారం కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు దళారులు, ఆఫీసర్లు కుమ్మక్కై లబ్ధిదారులతో కలిసి ఇప్పటికే పరిహారం తీసుకున్న ఇండ్లకు బై నంబర్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకునేందుకు ప్లాన్‌‌‌‌ చేశారు. చెక్కులు కూడా రెడీ అయిన తర్వాత విషయాన్ని గుర్తించిన కొందరు గ్రామస్తులు ఆఫీసర్లకు ఫిర్యాదు చేయడంతో చెక్కుల పంపిణీ ఆగిపోయింది. అయినా దళారులు తమ పట్టు విడవకుండా పైరవీలు చేశారు. దీంతో మళ్లీ చెక్కులు రెడీ చేసిన ఆఫీసర్లు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పరిహారంతో పాటు ఇండ్లు సైతం...

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌‌‌‌పల్లి మండలం మన్వాడ వద్ద 25.6 టీఎంసీల కెపాసిటీతో 2.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2006లో మిడ్‌‌‌‌మానేరు ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ పనులు 2019లో పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌‌‌‌లో 12 గ్రామాలు ముంపునకు గురికాగా అందులో వరదవెల్లి గ్రామం కూడా ఒకటి. ఈ గ్రామంలో ఇండ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడమే కాకుండా, వేములవాడ నాంపల్లి గుట్ట సమీపంలో ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలనీలు సైతం నిర్మించి ఇచ్చింది.

బై నంబర్లతో టోకరా...

మిడ్‌‌‌‌మానేరులో భాగంగా వరదవెల్లి గ్రామంలో ఇప్పటికే పరిహారం మంజూరైన ఇండ్లకు మరోసారి పరిహారం పొందేందుకు కొందరు దళారులు స్కెచ్‌‌‌‌ వేశారు. నిర్వాసితులకు డబ్బుల ఆశ చూపించి, ఆఫీసర్లతో కుమ్మక్కై గ్రామంలోని 9 ఇండ్లకు కొడుకులు, భార్యల పేరుతో బై నంబర్లు, నకిలీ పత్రాలు సృష్టించి రూ. 3 కోట్లు స్వాహా చేసేందుకు ప్లాన్‌‌‌‌ చేశారు. గ్రామానికి చెందిన ఈడుగుల నర్సయ్య గతంలోనే పరిహారం తీసుకున్నప్పటికీ ఆయన కొడుకు అంజయ్య పేరున -2-–16/2 నంబర్‌‌‌‌తో ఫేక్‌‌‌‌ డాక్యుమెంట్‌‌‌‌ సృష్టించారు.

అలాగే ఈడుగు కనకయ్య పేరు మీద గతంలోనే పరిహారం వచ్చినప్పటికీ ఆయన భార్య ఈడుగు సంపూర్ణ పేరున 2–16/3 నంబర్‌‌‌‌తో మరో డాక్యుమెంట్‌‌‌‌ సృష్టించారు. అలాగే ఈడుగుల విజయ పేరున 2–-16/1, ఈడుగు రాజేశం 2–-16/3 , ఈడుగు రాజేశ్వరి 2– 16/4, గుండం రాజేశం 2–-23/1, ఈడుగు మానస 3–40/1, ఈడుగు శ్యామల 3–-40/9, దుబ్బ శ్యామల 3-–43/1, ఈడుగు తిరుపతి 5–-52/1 నంబర్లతో నకిలీ పేపర్లు సృష్టించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన ఓ బడా నాయకుడు వెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపించినట్లు వార్తలు వినిపించాయి.

పట్టువీడని దళారులు..మరోసారి చెక్కులు రెడీ చేసిన ఆఫీసర్లు

పరిహారానికి సంబంధించిన చెక్కుల పంపిణీ ఆగిపోవడంతో దళారులు మళ్లీ రంగంలోకి దిగారు. తమ పలుకుబడి, పైరవీలను ఉపయోగించి పరిహారం మంజూరు కోసం మరోసారి ప్రయత్నాలు చేశారు. దీంతో వరదవెల్లి గ్రామంలోని 9 ఇండ్లకు రూ. 1.86 కోట్ల పరిహారానికి సంబంధించిన చెక్కులు రెడీ అయ్యాయి. విచారణ అనంతరం వీటిని పంపిణీ చేస్తామని స్పెషల్‌‌‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌‌‌ రాధాభాయి చెప్పారు. అయితే తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి అక్రమంగా పరిహారాన్ని పొందాలని చూస్తే అడ్డుకుంటామని వరదవెల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

గ్రామస్తులు ప్రశ్నించడంతో ఆగిన చెక్కుల పంపిణీ

బై నంబర్లతో నకిలీ పేపర్లు సృష్టించిన తర్వాత పరిహారం కోసం అప్లై చేయడం, ఆఫీసర్ల అండదండలు సైతం ఉండడంతో చెక్కులు రెడీ అయ్యాయి. విషయం తెలుసుకున్న కొందరు వరదవెల్లి గ్రామస్తులు ఇప్పటికే పరిహారం అందిన ఇండ్లకు మరోసారి ఎలా ఇస్తారంటూ 2023 డిసెంబర్‌‌‌‌లో స్పెషల్‌‌‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంక్వైరీ చేయాలని డిప్యూటీ కలెక్టర్‌‌‌‌ గంగయ్య డీపీవో రవీందర్‌‌‌‌ను ఆదేశించారు.

విచారణ చేపట్టిన డీపీవో ఫేక్‌‌‌‌ సర్టిఫికెట్లు సృష్టించి పరిహారం కోసం అప్లై చేసిన విషయం వాస్తవమేనని తేల్చారు. అప్పటికే పరిహారం పొందిన ఇండ్లకు బై నంబర్లతో పేపర్స్‌‌‌‌ సృష్టించి, అవి మిడ్‌‌‌‌ మానేరులో మునిగిపోయాయంటూ పరిహారం కోసం అప్లై చేశారని స్పెషల్‌‌‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌‌‌కు రిపోర్ట్‌‌‌‌ ఇచ్చారు. దీంతో అప్పుడు చెక్కులు పంపిణీ ఆగిపోయింది.

చెక్కులు సిద్ధంగా ఉన్నాయి 

వరదవెల్లి గ్రామానికి చెందిన కొందరు నిర్వాసితులకు సంబంధించిన చెక్కులు సిద్ధంగా ఉన్నాయి. కొందరు గ్రామస్తులు అభ్యంతరం చెప్పడంతో చెక్కుల పంపిణీ ఆపేశాం. గతంలో డీపీవో చేసిన ఎంక్వైరీ రిపోర్ట్‌‌‌‌ నాకు అందలేదు. అసలైన లబ్ధిదారులు లేకపోతే చెక్కుల పంపిణీని నిలిపివేస్తాం.

-రాధాభాయ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, రాజన్న సిరిసిల్ల జిల్లా