జర్నలిస్టుల సంక్షేమ పాలసీకి కృషి.. మహిళా దినోత్సవంలో మంత్రి సీతక్క

జర్నలిస్టుల సంక్షేమ పాలసీకి కృషి.. మహిళా దినోత్సవంలో మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్/ముషీరాబాద్/బషీర్​బాగ్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమం కోసం నూతన పాలసీని తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని  మంత్రి సీతక్క తెలిపారు. ది జూబ్లీహిల్స్​కో-ఆపరేటివ్​హౌసింగ్​సొసైటీ లిమిటెడ్​ఆఫీసులో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం, వైద్యం,అభివృద్ధి, వేతనాలపై సీఎం రేవంత్​రెడ్డితో చర్చించి కొత్త పాలసీ తీసుకు రావడానికి కృషి చేస్తానన్నారు. మహిళా జర్నలిస్టులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. 

పాత్రి కేయుల కోసం సొసైటీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను సొసైటీ అధ్యక్షుడు గోపరాజు మంత్రికి వివరించారు. అనంతరం సీనియర్​ మహిళా జర్నలిస్టులను మంత్రి సత్కరించారు. ప్రెస్​అకాడమీ మాజీ అధ్యక్షుడు దేవుల పల్లి అమర్, సొసైటీ కార్యదర్శి రవీంద్రబాబు, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ మసాదె, సంయుక్త కార్యదర్శి డాక్టర్​చల్లా భాగ్యలక్ష్మి, కోశాధికారి భీమగాని మహేశ్వర్​గౌడ్, సభ్యుడు కమలాకరచార్య తదితరులు పాల్గొన్నారు. దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం మహిళా దినోత్సవ క్రీడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. 

కాంగ్రెస్​అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, శాట్స్​చైర్మన్​శివసేనారెడ్డి, టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. టీజీఓ మహిళ విభాగం నేతలు డాక్టర్ దీపారెడ్డి, సుజాత, శిరీష పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో తెలుగు వర్సిటీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్​పర్సన్ నేరెళ్ల శారద,  రాష్ట్ర సంస్కృతి కళాసారథి చైర్మన్ వెన్నెల పాల్గొన్నారు. బీఎన్ఐ క్యాపిటల్​ఆధ్వర్యంలో బంజారాహిల్స్​లోని హోటల్​ తాజ్​ దక్కన్​లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా అర్గలా హెల్త్​ సర్వీసెస్​ ప్రయివేట్​ లిమిటెడ్​ ప్రతినిధి డాక్టర్​శ్రీదేవి యాడవల్లి పాల్గొన్నారు.