సూర్యాపేట వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా రెడ్డి వర్గానికి టికెట్ దక్కేలా నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యే కు మధ్య నెలకొన్న విభేదాలు సైతం కలిసొస్తున్నాయి. ఇటీవల జిల్లా ఎమ్మెల్యే తీరుపై అధిష్టానం కూడా అసంతృప్తి వ్యక్తం చేసి హెచ్చరికలు జారీ చేసింది. ఇది కూడా రెడ్డి నేతకు కలిసొచ్చే అంశంగా మారింది. మొత్తానికి కోదాడలో ఎమ్మెల్యేకు చెక్ పెట్టె రెడ్డి పాలిట్రిక్స్ హాట్ టాపిక్ గా మారాయి.
సొంత నేతల నుండే అసంతృప్తి
కోదాడ ఎమ్మెల్యే గా వున్న బొల్లం మల్లయ్య యాదవ్ గత ఎన్నికల్లో తొలిసారిగా గెలిచాడు. అప్పటివరకు టీడీపీలోనే కొనసాగిన ఆయన 2018 ఎన్నికల్లో టికెట్ రావడం లేదని తెలిసి అనూహ్యంగా చివరి నిమిషంలో టీఆర్ఎస్ లో చేరి టికెట్ దక్కించుకున్నారు. సీనియర్ నాయకుల సహకారంతో కేవలం 700 ఓట్ల స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై గెలుపొందారు. ఎన్నికల అనంతరం సీనియర్లను దూరం పెట్టడంతో గత కొంతకాలంగా అసమ్మతి నెలకొంది. దీంతో ఎమ్మెల్యే కు చెక్ పెట్టేలా సీనియర్ నాయకులు రెడ్డి రాజకీయాలు మొదలు పెట్టారు. టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వడం, పాత వారిపై కేసులు నమోదు చేయడంతో ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు.
కలిసొస్తున్న విభేదాలు
కొంతకాలంగా జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ అభివృద్దిలో ఎమ్మెల్యేకు మంత్రి సహకారాలు లేవన్న ఆరోపణలు ఉన్నాయి. కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో కరెంట్ కొరత తీర్చేందుకు కొత్తగా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని కొంతమంది సిబ్బంది ఎమ్మెల్యేను కోరారు. వెళ్ళి మంత్రిని కలవాలని తన చేతిలో ఏమీ లేదని బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. వీరిద్దరి మద్య నెలకొన్న భేదాభిప్రాయాలతో చాలా వరకు నియోజక వర్గంలో పనులు పెండింగులోనే ఉన్నాయి. గతంలో టికెట్ ఆశించి భంగ పడ్డ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ నేత ఉద్యమకారుడైన శశిధర్ రెడ్డి ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకునేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా కార్యాక్రమాలు చేపట్టగా దీనికి సీనియర్ నాయకులు మద్దతుగా నిలవడంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి సైతం శశిధర్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే తీరు పట్ల అధిష్ఠానం గుర్రు
ఎమ్మెల్యే పైన అధిష్ఠానం సైతం గుర్రుగానే ఉంది. నియోజకవర్గంలో దళితబంధు కింద మంజూరైన యూనిట్లలో ఎమ్మెల్యే అనుచరులే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో అధినేత కేసీఆర్ సైతం వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఎమ్మెల్యే అక్రమాలపై సొంత పార్టీ నేతలే అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడంతో ఈ సారి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదటికెట్ దక్కే అవకాశాలు తక్కువేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.