ముగిసిన గురుకులాల జోనల్ క్రీడలు
లింగాల, వెలుగు : క్రీడాకారుల, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, గ్రామీణ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ప్రభుత్వ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం గురుకులాల 8వ జోనల్ క్రీడల ముగింపు వేడుకల్లో వారు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహించేలా ఈ పోటీలను నిర్వహించడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులలో దాగివున్న నైపుణ్యాన్ని వెలికి తీసి జాతీయస్థాయిలోకి తీసుకురావడానికి ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగమ్మ, సింగిల్ విండో అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, మాజీ జడ్పీటీసీ మాకం తిరుపతయ్య, గురుకులాల డీసీఓ దానం, ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా ,వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి, పీడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అలంపూర్ అలయాలను
అభివృద్ధి చేయకపోతే.. ఉద్యమిస్తాం
అయిజ, వెలుగు: పైరవీల ద్వారా ఏర్పాటైన పాలకవర్గం వల్లే అలంపూర్ ఆలయాలు అభివృద్ధి చెందడంలేదని గద్వాల జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ లో మంగళవారం ఆయన మాట్లాడారు. జోగులాంబ ఆలయం ద్వారా ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ కు ఏటా రూ. 4 కోట్ల ఆదాయం వస్తున్నా అందులో ఒక శాతం నిధులు కూడా ఆలయాల కోసం ఖర్చు చేయడం లేదన్నారు. నవరాత్రి ఉత్సవాలను కు ఫెయిర్ అండ్ ఫెస్టివల్ నిధుల ద్వారా దేవాదాయశాఖ పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండగా కేవలం గుడి డబ్బు తోనే ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రభుత్వమే జోగులాంబ ఆలనా పాలనా చూసుకుంటుందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రోజుకు 600 మందికి భోజనాలు పెట్టే యోగ్యత ఉన్నా సరైన వసతులు లేక 60 మందికి మించి భోజనాలు పెట్టలేని దుస్థితి నెలకొందన్నారు. నవరాత్రులకు పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి రావాల్సి ఉండగా ప్రచారం కూడా చేయడం లేదని అన్నారు. వెంటనే అధికారులు జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాల అభివృద్ధి దిశగా ప్రయత్నించాలని చూపించారు.లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యం లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లీడర్లు మెడికల్ తిరుమల్ రెడ్డి, మాదన్న, శేఖర్, నరసింహయ్య శెట్టి, ప్రతాప్ గౌడ్, గోపాలకృష్ణ, ఆది, రామాంజనేయులు, ప్రహ్లాద్, నారాయణ పాల్గొన్నారు.
ఆస్పత్రుల్లో తనిఖీలు
వనపర్తి, వెలుగు : ఆత్మకూర్, అమరచింత మండలాల్లో ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తిపడంపల్లె గ్రామంలో వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అక్షయ్ కుమార్.. అమరచింత మండల కేంద్రంలో ప్రయివేటు క్లినిక్, ల్యాబ్ నడపడంతో ఆ క్లినిక్ ను సీజ్ చేశారు. ఆత్మకూర్ మండల కేంద్రంలోని సాయి బాబా క్లినిక్, కేర్ ల్యాబ్‌లకు షోకాజ్ నోటీస్ లు జారీ చేసినట్లు డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 18 ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోం, డయాగ్నోస్టిక్ సెంటర్ లల్లో తనిఖీలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.
పత్తి కొనుగోలులో ఇబ్బందులు రాకుండా చూడాలె
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని కలెక్టర్ ఎస్ .వెంకటరావు ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై కలెక్టరేట్లో మంగళవారం ఆయన సమీక్షించారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు తనిఖీ చేసి సౌకర్యాలను పరిశీలించాలని ఆదేశించారు. బాదేపల్లిలో 3, మహబూబ్‌నగర్‌లో 1 కాటన్ మిల్లు ఉన్నాయని, ఈఏడాది సుమారు లక్ష ఎకరాలలో పత్తి సాగు అవగా.. ఎకరాకు 8 క్వింటాళ్ల పత్తి వస్తుందని అధికారులు చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, సీతారామారావు, అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్ పాల్గొన్నారు.
వడ్ల కొనుగోలు లో కేసీఆర్‌ది కమీషన్ ఏజెంట్ పాత్రే
ప్రజాగోస యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి
వనపర్తి, వెలుగు : వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పదిశాతం కమీషన్ తీసుకునే ఏజెంట్ మాత్రమే అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ విమర్శించారు. వనపర్తి నియోజకవర్గం లో మంగళవారం ‘ప్రజాగోస.. బీజేపీ భరోసా’ నిర్వహించారు. ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఏ. రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఖిల్లా ఘనపూర్ మండలం షాపూర్, దొంతికుంట తండా,
మానాజీపేట, గట్టు కాడపల్లి, వెంకటం పల్లి, కమాలుద్దీన్ పూర్, తిరుమలయ్యపల్లి గ్రామాల్లో ఈ యాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమీషన్ ఏజెంట్ మాత్రమేననీ అన్నారు. వడ్ల కొనగోలుకు కావాల్సిన గన్ని బ్యాగులను, టార్ఫాలిన్లను, కేంద్రాల లీజు డబ్బులను, సుతిలి, హమాలీల ఛార్జీలు ఎఫ్ సీఐ భరిస్తుందని చెప్పారు. రైతులకు ఇచ్చే ధాన్యం డబ్బులల్లో 10 శాతం డబ్బులు కమీషన్ కింద ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు. కరోనా విపత్తు సమయంలో నెలకు ఐదు కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం లో, రైతులకు సరఫరా చేసే ఎరువులలో, పేదలకు ఇచ్చే ఉపాధి కూలీ డబ్బులలో , రైతులు అమ్ముకునే వడ్లల్లో కేసీఆర్ దండె కొడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దేవకి వాసుదేవరావు, బీజేపీ జిల్లా ఇన్చార్జీ బోసు పల్లి ప్రతాప్, రాష్ట్ర నాయకులు అశ్వద్ధామ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జీ జింకల కృష్ణయ్య,పెద్ది రాజు పాల్గొన్నారు.
టూరిజంపై పిల్లల్లో అవగాహన కల్పించాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: టూరిజం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్ రావు సూచించారు. మంగళవారం ఇంటర్నేషనల్ టూరిజం డే సందర్భంగా జిల్లా పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఎకో అర్బన్ పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో శిల్పారామంతో పాటు నెక్లెస్ రోడ్, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నాయన్నారు. మార్చి నాటికి పూర్తి అవుతాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలన్నింటిని సందర్శించే విధంగా టూరిజం ప్లాన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. త్వరలోనే అనుమతులు రానున్నాయన్నారు. అడిషనల్ కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, డీపీఆర్వో, టూరిజం ఆఫీసర్ వెంకటేశ్వర్లు, డీఈఓ రవీందర్, డీఐఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వనపర్తి: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడారు. జిల్లాలో అనేక చారిత్రాత్మక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని పిల్లలకు చూపాల్సిన బాధ్యత పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. ఉపన్యాసం, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఆశీష్ సంగ్వాన్, డి.వేణుగోపాల్, టూరిజం అధికారి యం. ఎ.రషీద్,జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సెక్రటరీ మాకొద్దు
గండీడ్, వెలుగు : మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ పని కోసం వెళ్తే దురుసుగా మాట్లాడుతున్నాడని, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇటీవల ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో డీఎల్పీఓ మంగళవారం విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా సెక్రటరిని మార్చాలని జీపీ ఎదుట గ్రామస్థులు ఆందోళన చేశారు. అనంతరం డీఎల్పీఓకు వినతి పత్రం ఇచ్చారు. అలాగే పంచాయతీ కార్యదర్శి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్టు విచారణలో తేలిందని పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు డీఎల్పీవో తెలిపారు.
ఎన్‌హెచ్44పై లారీ ఢీకొని బాలుడి మృతి
కొత్తకోట,వెలుగు: మండలంలోని పాలెం సమీపంలో ఎన్‌హెచ్ 44ను దాటుతుండగా అటుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో అదే గ్రామానికి చెందిన గణేశ్(13) చనిపోయాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై నాగశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం... పాలెం గ్రామానికి చెందిన గణేశ్, నరేందర్, శాంతన్న జాతీయ రహదారి సమీపంలో ఉన్న వాగు దగ్గరకు చేపలు పట్టడానికి బయల్దేరారు. బ్రిడ్జి సమీపంలో రోడ్డు దాటుతుండగా... కర్నూలు వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడిన వారిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గణేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్న రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
చెంచుల జీవనోపాధికి చర్యలు తీసుకుంటాం..
ఎర్ర పెంటను సందర్శించిన కలెక్టర్ ఉదయ్ కుమార్
లింగాల, వెలుగు : చెంచుపెంటల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, చెంచుల జీవనోపాధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మండలంలోని ఎర్ర పెంటను బల్మూరు మండలంలోని కొండనాగుల గ్రామాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా చెంచుపెంటల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ఎర్ర పెంటలో చెంచుల జన్యు పరిశోధన కోసం సీసీఎంబీ సేకరిస్తున్న రక్త నమూనా కేంద్రాన్ని పరిశీలించారు. ఇక్కడి ప్రజల్లో ఎవరికైనా జబ్బులు , రక్తహీనత ఉన్నా గుర్తించి నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ఆర్డీటీ ద్వారా చెంచులకు మంజూరు చేసిన 37 పక్కా ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. గర్భిణుల కు వైద్యం కోసం అంబులెన్స్, ఆశా వర్కర్ తో పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీరంగాపూర్ గ్రామస్థులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అటవీ శాఖాధికారులు కొత్తగా ఇళ్లు నిర్మించుకోడానికి అనుమతించడం లేదని కలెక్టర్ ను కొరగా కమ్యూనిటీ రైట్స్ కింద దరఖాస్తులు చేయించాలని సెక్రటరీ ని ఆదేశించారు. త్వరలోనే ఈ ఏరియాల్లో కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాలను ప్రారంభిస్తామని, వాటి ద్వారా జీవనోపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ పుష్ప, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్, తహసీల్దార్ మునీరుద్దీన్, ఆర్ఐ వెంకటేశ్వర్లు శ్రీరంగాపురం సర్పంచు అక్కమ్మ పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
గద్వాల, వెలుగు: నేరాల నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ సూచించారు. మంగళవారం జిల్లాలోని బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ పోలీసులతో మీటింగ్ నిర్వహించారు. నేరాల నియంత్రణలో సిబ్బంది పాత్ర కీలకమన్నారు. డయల్100 ఫోన్లకు ఫాస్ట్ గా స్పందించాలని, ఇన్ టైంలో ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నారు. రౌడీలు, అనుమానితులు, హిస్టరీ సీట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్‌బాపూజీకి నివాళి
వనపర్తి, వెలుగు: తెలంగాణ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా బాపూజీకి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఆశిశ్ సంగ్వాన్, డి.వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి
అలంపూర్,వెలుగు: వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో నాయకులు మంత్రి సత్యవతి రాథోడ్ ను హైదరాబాద్‌లో మంగళవారం కలిశారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించాలని వినతి పత్రం ఇచ్చారు. అలాగే ఆర్టీసీ భవన్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ను, ఎండీ సజ్జనార్‌ను ఎమ్మెల్యే అబ్రహం కలిశారు. నియోజకవర్గానికి మినీ డిపో ఏర్పాటు చేయాలని కోరారు.
కానిస్టేబుల్ ఫ్యామిలీకి రూ. లక్ష ఆర్థికసాయం
వనపర్తి టౌన్, వెలుగు : కరెంట్ షాక్ తో మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీను కుటుంబానికి తోటి పోలీసు సిబ్బంది మంగళవారం రూ. లక్ష ఆర్థికసాయం చేశారు. 2012 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ శ్రీనువాసులు ఇటీవల కరెంటు షాక్ తో చనిపోయాడు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జగన్, సంతోశ్, సుదర్శన్, ఆంజనేయులు ఉన్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
కోస్గి టౌన్, వెలుగు : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కనుకుర్తికి చెందిన కుమ్మరి నర్సింలు (50) కుటుంబ సభ్యులతో గొడవపడి, గత 15 ఏండ్లుగా వివిధ ప్రాంతాలలో మేస్త్రీ పని చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కోస్గి బస్టాండ్ ఆవరణలో మృతిచెందాడని తెలిపారు. మృతుని భార్య చంద్రమ్మ ఫిర్యాదు తో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విరిగి పడిన కొండ చరియలు- తప్పిన ప్రమాదం
అచ్చంపేట, వెలుగు: ప్రముఖ శైవ క్షేత్రం ఉమామహేశ్వరంలో మంగళవారం కొండ చరియలు విరిగి పడ్డాయి. ఆలయం పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆసమయంలో భక్తులు ఎవరూ అక్కడ లేదు. దీంతో ప్రమాదం తప్పిందని ఆలయ చైర్మెన్ కందేరు సుధాకర్, ఈఓ శ్రీనువాస రావు తెలిపారు. గతంలో కురిసిన వర్షాలకు కొండ చరియలు నానడం వల్లనే విరిగి పడ్డాయన్నారు.