
నస్పూర్, వెలుగు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ప్రతి రైతు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ, నాబార్డ్ అదిలాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
దీనికి అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ, విస్తరణ అధికారుల సూచనలు పాటించి పంట సాగు చేసి అధిక దిగుబడి పొందాలన్నారు. సమీకృత, ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించి ఆరోగ్యకరమైన పంటల దిగుబడితో సమాజ శ్రేయస్సుకు రైతులు కృషి చేయాలని కోరారు.
ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ, మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా ఆదాయం పొందడంపై దృష్టి సారించాలన్నారు. పంట విక్రయించేలా మార్కెటింగ్ వ్యవస్థలో ఇబ్బందులను పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. రుణాల కోసం బ్యాంకులకు వచ్చే రైతులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని బ్యాంకర్లను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, పశు వైద్య, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ రమేశ్, ఉద్యానవన శాఖ అధికారి ఉదయ్ కుమార్, హాజీపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు గోనె శ్యాంసుందర్ రావు, శంకర్, పలు బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.