హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పీఆర్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో గురుకుల టీచర్స్ అసోసియేషన్ సమావేశం పీఆర్జీటీఏ స్టేట్ ప్రెసిడెంట్ వేంరెడ్డి దిలీప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ... త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గురుకుల టీచర్లు, స్టూడెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తానని తెలిపారు. ప్రధానంగా గురుకుల స్కూళ్ల టైమింగ్స్ మార్పుతో పాటు టీచర్లకు బోధనేతర పనులు లేకుండా అన్ని కాలేజీల్లో కేర్ టేకర్లను నియమించే విధంగా ఉత్తర్వులు ఇప్పిస్తానని హామీనిచ్చారు. కాగా..మార్చిలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థులు శ్రీపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డికి పీఆర్జీటీఏ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మద్దతు లేఖను వారికి అందించింది.