
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు : వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్. బలరాంనాయక్ చెప్పారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి.సంజీవరెడ్డితో కలిసి గురువారం ఇందారం ఓపెన్ కాస్ట్ మైన్, జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, చెన్నూరు మండలం శివాలింగపూర్‌లోని సోలార్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాదించడమే సింగరేణి లక్ష్యమని చెప్పారు. 2024--–25 సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించాలని, ఉపరితల గనుల్లో ఓబీ కాంట్రాక్ట్ కంపెనీలు తమ రోజువారి ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వర్షాకాలంలో క్వారీలో నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
వేసవి తీవ్రత దృష్ట్యా ఉపరితల గనుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తగినన్ని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. చెన్నూరు మండలం శివలింగాపూర్‌లో మూసివేసిన చెన్నూరు 2 గని ఆవరణలో 76 ఎకరాల్లో 11 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. జులై 10వ తేదీలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్ట్ కంపెనీని ఆదేశించారు. ఆఫీసర్లు పరస్పర సహకారంతో ఎస్డీపీపీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పారు. అంతకుముందు జైపూర్ ప్లాంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ కిరీటి మృతికి సంతాపం తెలిపారు.
చనిపోయిన కార్మికుడి ఫ్యామిలీని పరామర్శించిన సీఎండీ
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన, మార్చి 16న మందమర్రి ఏరియా స్టోర్స్‌లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన సింగరేణి జనరల్ మజ్దూర్ కార్మికుడు కర్రె రాజు కుటుంబ సభ్యులను గురువారం సీఎండీ ఎన్.బలరాంనాయక్ పరామర్శించారు. కార్మికుడి ఫ్యామిలీకి అందాల్సిన అన్ని బెనిఫిట్స్ త్వరగా వచ్చేలా చూడాలని జీఎం ఎ.మనోహర్‌ను ఆదేశించారు. రాజు భార్యకు త్వరలోనే జాబ్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియా జీఎంలు ఎ.మనోహర్, బి.సంజీవరెడ్డి, ఎస్టీపీపీ ఓఅండ్‌ఎం చీఫ్ జేఎన్.సింగ్, ఎస్‌వోటు జీఎంలు రాజేశ్వర్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ఏరియా ఇంజనీర్, చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.